Advertisement

Advertisement


Home > Politics - Gossip

బీజేపీలోకి చేరాలనే ఉంది కానీ, క్యాడర్‌ రాదే!

బీజేపీలోకి చేరాలనే ఉంది కానీ, క్యాడర్‌ రాదే!

రాయలసీమ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ నేతల్లో చాలామంది భారతీయ జనతా పార్టీ వైపు ఆశగా చూస్తూ ఉన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎలాగూ చేర్చుకోదు.. కాబట్టి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో జట్టుకట్టాలని వారు అనుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలో పలువురు ఇప్పటికే సంప్రదింపుల అంకంలో చాలా ముందుకు వెళ్లిపోయారు. ఇక చేరికలే తరువాయి అని వారు అనుకుంటున్నారట.

అయితే బీజేపీలో చేరితే తమవెంట క్యాడర్‌ ఎంతవరకూ వస్తుంది? అనేది మాత్రం వారికే అంతుబట్టని అంశంగా మారింది. వ్యక్తిగతంగా రాజకీయంగా బలం ఉన్నవాళ్లు తమ అనుచరవర్గాన్ని అయితే తీసుకెళ్లిపోగలరు. అయితే తెలుగుదేశం పార్టీ సంప్రదాయ ఓటు బ్యాంకు పరిస్థితి ఏమిటి? అనేది వారికే అంతుబట్టని అంశం అవుతోంది.

రాయలసీమ ప్రాంతంలో బీజేపీ ఎంత కసరత్తు చేసినా, ఆ పార్టీ గుర్తు ఏదో కూడా అక్కడి సామాన్యుల్లో చాలామందికి తెలియదు. అలాంటి పార్టీలోకి ఈ నేతలు వెళితే ఆ పార్టీకి గంపగుత్తగా ఓట్లుపడే ముచ్చట్లు ఏమీ ఉండవు. వీళ్లు వెళితే వెళ్లొచ్చు. అలా వెళితే వీరు అవకాశవాదులు అనిపించుకుంటారు. అలాంటి ముద్రను వేయించుకుంటారు. తమతో పాటు కొంతవరకూ అనుచరవర్గాన్ని బీజేపీలోకి తీసుకెళ్తారు. అంత మాత్రానా బీజేపీకి ఒరిగేది ఏమీలేదు.

పేరుకు అయితే కొంతమంది నేతలుగా చలామణి అవుతారు. అలాగని వారికి నియోజకవర్గాల్లో సూపర్‌ పవర్స్‌ ఏమీరావు. బీజేపీలోకి చేరగానే వారు అధికారం చలాయించేది ఏమీ ఉండదు కూడా. తెలుగుదేశం అంటేనే కాస్తో కూస్తో విలువ ఉంటుంది ద్వితీయశ్రేణి నాయకత్వానికి.

బీజేపీలోకి చేరడం ద్వారా కేవలం మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలే కొన్ని కాంట్రాక్టులు గట్రా సంపాదించుకోగలరేమో! అంతకు మించి క్యాడర్‌కు ఒరిగేదేమీ ఉండదు. ఇప్పుడు బీజేపీలోకి వెళ్లిపోయి రేపటి ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీచేసినా దక్కేది ఏమిటనేది ప్రశ్నార్థకమే!

బీజేపీ తరఫున పోటీచేస్తే.. సీమలోని సీనియర్‌ పొలిటీషియన్లు కూడా మహా అంటే  డిపాజిట్లు సంపాదించుకోగలరేమో! ఇంకో మార్గం ఏమిటంటే.. ఇప్పుడు బీజేపీలోకి చేరిపోయి ఎన్నికల నాటికి మళ్లీ తెలుగుదేశంలోకి రావడం. అలాచేస్తే ఈ నేతలు మరింత నవ్వుల పాలవుతారు. దీంతో.. ఏం చేయాలో అంతుబట్టక వారు దిక్కుతోచని స్థితిలో ఉన్నారనేమాట వినిపిస్తూ ఉంది!

సమ్మర్‌కి బంపర్‌ బిగినింగ్‌! హడలెత్తించిన మార్చి! ఆల్‌టైమ్‌ డిజాస్టర్‌!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?