అప్పుడు 23, ఇప్పుడు 12: ఏపీలో జోరుగా చర్చ

ఏపీ రాజకీయాల్లో 23 అనే నంబర్ గురించి అందరికీ తెలిసిందే. తను అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేల్ని అక్రమంగా తనవైపు లాక్కున్నారు చంద్రబాబు. సంతలో పశువుల్ని కొన్నట్టు కొనేశారు. ఆ…

ఏపీ రాజకీయాల్లో 23 అనే నంబర్ గురించి అందరికీ తెలిసిందే. తను అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేల్ని అక్రమంగా తనవైపు లాక్కున్నారు చంద్రబాబు. సంతలో పశువుల్ని కొన్నట్టు కొనేశారు. ఆ తర్వాత కొన్నినెలల కిందట జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు పార్టీకి వచ్చిన సీట్ల సంఖ్య కూడా ఇరవై మూడే. అలా ఏపీ రాజకీయాల్లో 23కు ఓ ప్రాముఖ్యత ఏర్పడింది. ఇప్పుడు అదే టైపులో 12 అనే అంకె కూడా పాపులర్ అవుతోంది.

అవును.. ప్రస్తుతం 12 అనే అంకె చుట్టూ జోరుగా చర్చ నడుస్తోంది. ఈ అంకెకు అర్థం ఏంటంటే… త్వరలోనే ఆంధ్రప్రదేశ్ లోని 12 అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలు వస్తాయంట. అవి కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన స్థానాల్లో కావడం విశేషం. తాజాగా ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి దీనిపై లీకులు అందించారు. దాదాపు 16 మంది టీడీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని ఆయన వ్యాఖ్యానించడం విశేషం.

వైసీపీ అధికారంలోకి వచ్చినప్పట్నుంచి చేరికలపై చర్చ జరుగుతూనే ఉంది. తెలుగుదేశం నుంచి భారీఎత్తున ఎమ్మెల్యేలు, కార్యకర్తలు వైసీపీలోకి వచ్చే అవకాశం ఉందంటూ అప్పట్లో చాలామంది నేతలు, విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కానీ జగన్ ఒకే ఒక్క ప్రకటనతో అన్నింటికీ తెరదించేశారు. తమ సభ్యత్వాలు, పదవులకు అన్ని ఫార్మాట్లలో రాజీనామా చేసిన తర్వాతే వైసీపీలోకి చేర్చుకుంటామంటూ, స్వయంగా అసెంబ్లీలోనే ప్రకటించి వలసల్ని ఆపేశారు జగన్.

అయితే తాజాగా జరుగుతున్న పరిణామాలు ఈ అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చాయి. టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ, ఆ ఎమ్మెల్యే పదవిని వదులుకొని వైసీపీలోకి రావడానికి పలువురు టీడీపీ నేతలు సిద్ధంగా ఉన్నట్టు నారాయణ స్వామి లాంటి నేతలు ప్రకటనలు చేస్తున్నారు. దీనికి మరింత ఊతమిస్తూ వల్లభనేని వంశీ రాజీనామా చేయడం రాజకీయాల్లో కలకలం రేపుతోంది.

ప్రస్తుతానికి తను ఏ పార్టీలో లేనని, పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకున్నానని వల్లభనేని ప్రకటిస్తున్నప్పటికీ.. మిగతా ఎమ్మెల్యేలు మాత్రం వల్లభనేనిని ఆదర్శంగా తీసుకొని తన పదవులకు రాజీనామాలు చేసి వైసీపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారట.

అలా గన్నవరంతో పాటు 12 స్థానాల్లో ఉపఎన్నిక తథ్యం అంటున్నారు చాలామంది. ఇదే కనుక జరిగితే ఈ లిస్ట్ లో గంటా శ్రీనివాసరావు ఉంటారనడంలో ఎవ్వరికీ ఎలాంటి సందేహాలు అక్కర్లేదు.

సినిమా రివ్యూ: మీకు మాత్రమే చెప్తా