అసలే టాలీవుడ్ పరిస్థితి ఏమీ బాగాలేదు. సినిమాలకు రెవెన్యూ అంతంత మాత్రంగా వుంది. సీనియర్ హీరోల సినిమాలు చూసే జనాలు నానాటికీ తగ్గిపోతున్నారు. రెవెన్యూలు తగ్గుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో సీనియర్ హీరోలు ఇంకా రెమ్యూనిరేషన్లు తగ్గించకుండా, సినిమాల బడ్జెట్ పెంచుకుంటూ పోతే, నిర్మాత పరిస్థితి ఆందోళనకరమే.
రవితేజ హీరోగా నిర్మాణంలో వున్న డిస్కోరాజా సినిమా బడ్జెట్ ఇప్పటికే ఒకటో ప్రమాద హెచ్చరిక దాటేసిందని తెలుస్తోంది. 17 కోట్లకు కాస్త అటు ఇటుగా అవుతుంది అనుకంటే ఇప్పటికే ఇరవై రెండు కోట్లు దాటేసినట్లు తెలుస్తోంది. ఇంకా చాలా సినిమా వుంది. పబ్లిసిటీ, వడ్డీలు, పెట్టాల్సిన ఖర్చులు అన్నీకలిపి ముఫై కోట్ల దగ్గరకు చేరిపోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.
అసలే హిందీ డబ్బింగ్ మార్కెట్ ఆగిపోయింది. రవితేజ, యాక్షన్ సినిమా అనుకున్నా, ఈరోజుల్లో సీనియర్ హీరోల సినిమాలు మార్కెట్ చేయడం కష్టంగా వుంది. బహుశా అందుకే సినిమాను అమ్మకుండా సురేష్ మూవీస్ దగ్గరపెట్టి వుంటారు. ఏమైనా సరే, దర్శకులు ఖర్చును అదుపు చేయకపోతే నిర్మాతలకు కష్టమే.