ఇసుక సమస్యపై లాంగ్ మార్చ్ నిర్వహించి… జగన్ ప్రభుత్వం అంతు చూస్తానన్నట్లుగా.. హీరో పవన్ కల్యాణ్ హూంకరించిన సంగతి తెలిసిందే. ప్రతి చోటా జనసేన తరఫున డేరాలు వేసే ప్రణాళికలు కూడా చేశారు. తమ ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉధృతం చేసేస్తామని కూడా అన్నారు. కార్యరూపంలో అదంతా ఏమేరకు నిజరూపం దాలుస్తున్నదో తెలియదు గానీ.. వాస్తవంలో పవన్ కల్యాణ్ కంటె.. తెలుగుదేశం నాయకుడు చంద్రబాబునాయుడే కాస్త మంచి పోరాట పటిమ ప్రదర్శిస్తున్నట్లుగా ఉంది. ఆయన ఒకరోజు నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు.
పవన్ కల్యాణ్ చేసిన హడావిడి నేపథ్యంలో.. సమస్య పరిష్కారం అయ్యేదాకా ఆయన ఆమరణ నిరాహార దీక్షకు ఉపక్రమిస్తారనే ప్రచారం కూడా వచ్చేసింది. సోషల్ మీడియాలో పవన్ ఆమరణ నిరాహార దీక్ష గురించి కబుర్లు హోరెత్తి పోయాయి. దీంతో పార్టీకి కంగారు పుట్టింది. సోషల్ మీడియాలో ఆమరణ దీక్ష గురించి జరుగుతున్న ప్రచారం మొత్తం అవాస్తవం అంటూ.. పార్టీ నాయకులు ప్రకటనలు గుప్పించారు.
పవన్ కల్యాణ్ పాపం.. లాంగ్ మార్చ్ కు పిలుపు ఇచ్చి… తాను స్వయంగా నడవడానికి చాలా ఇబ్బందిపడిపోయి.. కార్లో ప్రయాణించాడు. నిత్యం మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ తో భయంకరమైన ఫిట్ నెస్ తో ఉండే హీరో అని ఆయన గురించి అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ.. ఆమాత్రం నడవలేకపోయిన హీరో ఇక.. ఆమరణ నిరాహార దీక్ష చేయడం ఎంత కామెడీనో ఊహించుకోవచ్చు. అందుకే ఆయన పార్టీ వాళ్లంతా కంగారు పడి.. అలాంటిదేం లేదని స్టేట్మెంట్ ఇచ్చారు.
కానీ … చంద్రబాబు మాత్రం.. వయసైపోయినా కూడా ఎట్ లీస్టు ఒకరోజు నిరాహార దీక్ష చేస్తున్నారు. సీనియర్ నేతలు చేసే ఇలాటి దీక్షలు ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతాయి. అందుకే.. ఇసుక సమస్యను పరిష్కరించడం సంగతి తర్వాత.. కనీసం దానిమీద గరిష్టంగా దృష్టిపెట్టే విషయంలో పవన్ కంటె చంద్రబాబు బెటర్ అనిపిస్తోంది.