మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పరిస్థితి నానాటికీ దయనీయంగా తయారవుతున్నట్టున్నది. పార్టీని తిరిగి నిలబెట్టడానికి, అంతో ఇంతో జవసత్వాలు పుంజుకోవడానికి.. ఆయనకు ప్రధాని నరేంద్రమోడీతో తిరిగి సత్సంబంధాలు కొనసాగించడం మినహా మరొక మార్గం ఉన్న్టటు కనిపించడం లేదు. అందుకే శక్తివంచన లేకుండా మోడీ భజన చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రధానిని ప్రసన్నం చేసుకోవడానికి చంద్రబాబు ఆరాటం స్పష్టంగా కనిపిస్తోంది.
నరేంద్రమోడీ ఆదివారం నాడు జనతా కర్ఫ్యూకు పిలుపు ఇచ్చారు. కరోనా వైరస్ తీవ్రత చాలా ప్రబలంగా ఉన్న నేపథ్యంలో పార్టీలతో నిమిత్తం లేకుండా దాదాపుగా అందరూ ఆ పిలుపును స్వీకరించారు. దాదాపుగా ఎన్డీయేతర పార్టీల పాలనలో ఉన్న రాష్ట్రాల్లో కూడా ఈ పిలుపు ప్రభావం గణనీయంగానే కనిపించింది. కరోనా వైరస్ ప్రాధాన్యాన్ని ప్రజలు గుర్తించినట్లే కనిపించింది. అదే రీతిగా తెలుగు రాష్ట్రాల్లో కూడా సినిమా సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు అందరూ కూడా దీనిని గౌరవించారు. ఆ ప్రకారం నడుచుకున్నారు. కర్ఫ్యూ పాటించారు.
సాధారణంగా దీనికి ప్రధాని ప్రజలకు కృతజ్ఞతలు చెప్పాలి. ఆయన చెప్పారు కూడా. అయితే సందట్లో సడేమియా అన్నట్లుగా చంద్రబాబునాయుడు కూడా ప్రజలకు ధన్యవాదాలు చెప్పేశారు. నిజానికి చంద్రబాబు ఏదైనా ఒక యాక్టివిటీకి పిలుపు ఇస్తే ప్రజలు ఎలా స్పందిస్తున్నారో అందరికీ తెలుసు. రాజధాని అమరావతి కోసం దీక్షలు చేస్తున్నా, జోలె పడుతున్నా.. పోరాటాలకు నిధులివ్వండి అంటూ బాబు బతిమాలితేనే.. వీధుల్లో తిరిగితేనే జనం ఏమాత్రం పట్టించుకోలేదు.
ఇక కరోనా తీవ్రత పెరిగిన నాటినుంచి, ప్రధానంగా ఎన్నికల వాయిదాకు ఎస్ఈసీ నిర్ణయం తీసుకున్న నాటినుంచి.. చంద్రబాబు దాదాపుగా డాక్టరు మరియు సైంటిస్టు అవతారం ఎత్తారు. కరోనా జాగ్రత్తల గురించి మితిమీరి ప్రచారం చేయడం ప్రారంభించారు. జగన్ ఎన్నికలు కోరుకున్న నేపథ్యంలో.. ఇలాంటి టెక్నిక్ ను ప్రజలు నమ్మలేదు. చివరికి జనతా కర్ఫ్యూ తర్వాత.. ఏదో తాను పిలుపు ఇస్తే ప్రజలందరూ కర్ఫ్యూ పాటించినట్లుగా బిల్డప్ ఇస్తూ.. చంద్రబాబు అందిరికీ కృతజ్ఞతలు చెప్పేశారు. లేదా.. ఇలా మోడీ తరఫున మాట్లాడడం ద్వారా.. మోడీని ప్రసన్నం చేసుకుని, ప్రస్తుతానికి మరో గత్యంతరం లేని తమ పార్టీకి భాజపాతో పొత్తులకు ప్రయత్నించాలని చూస్తున్నారేమోనని ప్రజలు అనుకుంటున్నారు.