జ‌న‌సేన నాయ‌కురాలు చైత‌న్య‌కు కీల‌క ప‌ద‌వి!

ఉమ్మ‌డి చిత్తూరు జిల్లా జ‌న‌సేన నాయ‌కురాలు, దివంగ‌త డీకే ఆదికేశ‌వుల‌నాయుడు మ‌న‌వ‌రాలు చైత‌న్య‌కు కీల‌క ప‌ద‌వి ద‌క్క‌నున్న‌ట్టు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. టీటీడీ చైర్మ‌న్ త‌ర్వాత ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలో తుడా చైర్మ‌న్ ప‌ద‌వికి…

ఉమ్మ‌డి చిత్తూరు జిల్లా జ‌న‌సేన నాయ‌కురాలు, దివంగ‌త డీకే ఆదికేశ‌వుల‌నాయుడు మ‌న‌వ‌రాలు చైత‌న్య‌కు కీల‌క ప‌ద‌వి ద‌క్క‌నున్న‌ట్టు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. టీటీడీ చైర్మ‌న్ త‌ర్వాత ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలో తుడా చైర్మ‌న్ ప‌ద‌వికి డిమాండ్ ఉంది. ఈ ప‌ద‌వి కోసం ఎన్నిక‌ల‌కు ముందు నుంచి చాలా పోటీ వుంది. టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ పొత్తు కుదుర్చుకోవ‌డంతో ప్ర‌భుత్వం ఏర్పాటు చేస్తామ‌నే ధీమా ఆ పార్టీల నాయ‌కుల్లో క‌నిపించింది.

దీంతో తుడా చైర్మ‌న్ ప‌ద‌వి త‌మ‌కంటే త‌మ‌క‌ని సంబంధిత పార్టీల అధినాయ‌కుల వ‌ద్ద త‌మ డిమాండ్‌ను స్థానిక నాయ‌కులు పెట్టిన‌ట్టు తెలిసింది. ఈ ప‌ద‌విని ఆశిస్తున్న వాళ్ల‌లో చంద్ర‌గిరి ఎమ్మెల్యే పులివ‌ర్తి నాని, మాజీ ఎమ్మెల్యే సుగుణ‌మ్మ‌, చంద్ర‌గిరి టీడీపీ నాయ‌కుడు డాల‌ర్స్ దివాక‌ర్‌రెడ్డి, తిరుపతి జిల్లా టీడీపీ అధ్య‌క్షుడు న‌ర‌సింహ‌యాద‌వ్, మ‌బ్బు దేవ‌నారాయ‌ణ‌రెడ్డి, సూరా సుధాక‌ర్‌రెడ్డి త‌దిత‌రులున్నారు.

ప్ర‌స్తుతం నామినేటెడ్ పోస్టుల భ‌ర్తీకి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు, మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా క‌స‌ర‌త్తు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో తుడా చైర్మ‌న్ ప‌ద‌విని జ‌న‌సేన నాయ‌కురాలు, టీటీడీ మాజీ చైర్మ‌న్ దివంగ‌త డీకే ఆదికేశ‌వుల‌నాయుడు మ‌న‌వ‌రాలు చైత‌న్య‌కు ఖ‌రారైన‌ట్టు తెలిసింది. ఎన్నిక‌ల‌కు ముందు ఈమె జ‌న‌సేన‌లో చేరారు. పిఠాపురంతో పాటు తొమ్మిది అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌న‌సేన‌, టీడీపీ అభ్య‌ర్థుల గెలుపు కోసం చైత‌న్య ప‌ని చేసిన‌ట్టు స‌మాచారం.

ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త అయిన చైత‌న్య ఎన్నిక‌ల్లో పెద్ద మొత్తంలో కూట‌మి నేత‌ల గెలుపు కోసం ఆర్థిక వ‌న‌రుల్ని ఖ‌ర్చు పెట్ట‌డాన్ని చంద్ర‌బాబు, ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. పైగా డీకే ఆదికేశ‌వుల‌నాయుడు కుటుంబం రాజ‌కీయాల‌కు అంతీతంగా అంద‌రితో స్నేహంగా వుంటుంది.

చైత‌న్య అయితేనే అంద‌రికీ ఆమోద‌యోగ్య‌మైన నాయ‌కురాలు అవుతుంద‌నే ఉద్దేశంతో చంద్ర‌బాబు, ప‌వ‌న్‌, లోకేశ్ ఆమెకు తుడా చైర్మ‌న్ ప‌ద‌వి ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నార‌ని తెలిసింది. ఏవైనా అనూహ్య‌మైన ప‌రిణామాలు చోటు చేసుకుంటే త‌ప్ప‌, ఆమె తుడా చైర్మ‌న్ కాకుండా ఎవ‌రూ అడ్డుకోలేర‌ని ప్రస్తుతానికి ఉన్న స‌మాచారం.

4 Replies to “జ‌న‌సేన నాయ‌కురాలు చైత‌న్య‌కు కీల‌క ప‌ద‌వి!”

Comments are closed.