నాడు చంద్రబాబు చేసింది ఇంతకంటె ఘోరమే!

ఇవాళ విశాఖపట్నంలో చంద్రబాబునాయుడు తలపెట్టిన కార్యక్రమాన్ని అడ్డుకున్నందుకు వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద.. ఉదారవాదులంతా కారాలు మిరియాలు నూరుతుండవచ్చు గాక! చంద్రబాబును ఎయిర్ పోర్టు వద్దే పోలీసులు అడ్డుకోవడం, ఆయన కాలినడకన అయినా సరే…

ఇవాళ విశాఖపట్నంలో చంద్రబాబునాయుడు తలపెట్టిన కార్యక్రమాన్ని అడ్డుకున్నందుకు వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద.. ఉదారవాదులంతా కారాలు మిరియాలు నూరుతుండవచ్చు గాక! చంద్రబాబును ఎయిర్ పోర్టు వద్దే పోలీసులు అడ్డుకోవడం, ఆయన కాలినడకన అయినా సరే వెళ్లడానికి సిద్ధపడగా.. నియంత్రించడం.. తీవ్రమైన వాగ్వివాదం తరువాత.. అరెస్టు చేసి లాంజ్‌కే పరిమితం చేయడం.. ఇవన్నీ.. ఎవరికైనా కోపం తెప్పించవచ్చు గాక.. కానీ.. ఇలాంటి పాఠాలను ఏపీ పోలీసులు ఎక్కడ నేర్చుకున్నారు. అవి అచ్చంగా చంద్రబాబునాయుడు నేర్పించిన పాఠాలే అని ఒప్పుకోవాల్సిందే.

నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా అని ఒక సామెత ఉంటుంది. అచ్చంగా ఆ సామెత ఇవాళ్టి తెలుగు రాజకీయాలకు వర్తించినట్లుగా కనిపిస్తోంది. ఇవాళ చంద్ర బాబునాయుడు సుదీర్ఘకాలం పాటూ పోలీసులతో వాదించిన తర్వాత.. ఆయన కోరిక మేరకు ఎందుకు ఆయనను అడ్డుకుంటున్నారో పోలీసులు లిఖితపూర్వకంగా ఆయనకు ఒక లేఖ ఇచ్చారు. సెక్షన్ 151 కింద భద్రత నిమిత్తం ముందుజాగ్రత్త చర్యగా అరెస్టు చేస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. ఏదో ఒక కాగితం లిఖిత రూపంలో పోలీసులనుంచి తీసుకుంటే గనుక.. తనను అడ్డుకున్న విషయాన్ని కోర్టులో లేవనెత్తి ఇంకాస్త ఎడ్వాంటేజీ కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నది స్పష్టం.

ఇక్కడ ఇంకో సంగతి ప్రస్తావించాలి. చంద్రబాబును అడ్డుకోవడం మొదలైన దగ్గరినుంచి.. ‘మేం ఇలా చేసి ఉంటే.. అసలు జగన్ పాదయాత్ర సాగేదేనా?’ అని తెలుగుదేశం నాయకులు బీరాలు పలుకుతున్నారు. జగన్ పాదయాత్ర అంటే.. దానిని కూడా అడ్డుకుంటే రాష్ట్రం గగ్గోలు పెడుతుందని ఊరుకున్నారు గానీ.. ఇలా పోరాటాల్ని అడ్డుకోవడం అనేది చంద్రబాబు నేర్పిన పాఠమే. ప్రత్యేకహోదా కోసం పోరాటం ప్రకటించి జగన్మోహన రెడ్డి విశాఖకు వెళ్లినప్పుడు రన్ వే మీదనే ఆయనను అడ్డుకున్న చరిత్ర కూడా చంద్రబాబు హయాంలో నమోదు అయినదే. 

తుని సభ తర్వాత.. ముద్రగడ చేయదలచున్న ప్రతి దీక్షను చంద్రబాబునాయుడు అడ్డుకున్నారు. ఇవాళ జరిగిన దానికంటె ఘోరంగా అడ్డుకుని, ఆయనను ప్రతిసారీ అరెస్టుచేసి ఇంటికే పరిమితం చేస్తూ వచ్చారు. నిజానికి ఆయన చంద్రబాబు నాయుడు మీద ప్రకటించిన ప్రత్యక్ష పోరాటం కూడా కాదు. తన డిమాండ్ లను వినిపించేందుకే పాదయాత్ర చేయదలచుకున్నా, మరేం చేయదలచుకున్నా ప్రతిసారీ పోలీసులు దారుణంగా అడ్డు పడ్డారు. చంద్రబాబు తన పాలనలో  తన వంచనల పట్ల ప్రజల పోరాటాలను ఎలా అడ్డుకున్నారో… ఆయనకు గుర్తుంటే ఇవాళ అదే రిపీట్ అయిందని వారికి అర్థమవుతుంది. అది గుర్తుంచుకోకుండా… ఇవాళ ఆక్రోశిస్తే అర్థం లేదు.

సీన్ రివర్స్ అయింది..!