చంద్రబాబునాయుడు హై సెక్యూరిటీ జోన్ లో ఉన్నారు నిజమే. ఆయనకు విపరీతమైన ప్రాణభయం ఉన్నది- అది కూడా నిజమే. ముఖ్యమంత్రి పదవినుంచి దిగిపోయిన తర్వాత కూడా అదే స్థాయిలో భద్రతను కోరుకున్నారు. ఇప్పటి స్థాయికి తగ్గట్టుగా తగ్గించేసరికి కంగారు పడిపోయారు. కోర్టు తలుపు తట్టారు. ఇదంతా కూడా ఓకే. ఆయన భద్రత పరంగా హైసెక్యూరిటీ జోన్ లో ఉన్నంత మాత్రాన ప్రభుత్వానికి కూడా అతీతులు అవుతారా? ఆయన ఇల్లు నదీ ప్రవాహంలో కొట్టుకుపోతున్నా కూడా ప్రభుత్వం మిన్నకుండా చూస్తూ ఊరుకోవాలా? అలాంటి పరిస్థితి తలెత్తుతోంటే.. ముందుజాగ్రత్త పాటించకుండా ఆయన భద్రతను గాలికొదిలేయాలా?
ఇప్పుడు.. తన విజయవాడ నివాసం మీద డ్రోన్లు ఎగిరాయనే కబురు వచ్చేసరికి.. చంద్రబాబు వ్యక్తం చేస్తున్న ఆగ్రహాన్ని, ఆక్రోశాన్ని గమనిస్తోంటే ఇలాంటి సందేహాలే కలుగుతున్నాయి. తాను హైసెక్యూరిటీ జోన్ లో ఉన్నాను గనుక.. తన నివాసంలో ఏం జరుగుతున్నా ఎవరూ జోక్యం చేసుకోవడానికి వీల్లేదన్నట్లుగా ఆయన వైఖరి కనిపిస్తోంది. కృష్ణానదిని ఆక్రమించుకుని కట్టిన అక్రమ కట్టడంలో చంద్రబాబునాయుడు నివాసం ఉంటున్నారు.
ఒక ప్రభుత్వాధినేతగా పనిచేసిన వ్యక్తి.. ఇంత దారుణంగా.. అక్రమార్కులకు వత్తాసు పలుకుతూ… వారి అక్రమ భవనాలనే నివాసం చేసుకోవడం అనేది సిగ్గుచేటు. అయినా సరే.. ఆయన అక్కడే కొనసాగుతున్నారు. ఇప్పుడు తుపాను లేకపోయినా.. వరదలు రాకపోయినా.. సమృద్ధిగా కృష్ణా నదిలోకి నీటి ప్రవాహం వచ్చేసరికి.. ఆయన నివాసం మునిగిపోయే పరిస్థితికి వచ్చింది. వేలాది ఇసుకబస్తాలు పేర్చి దానిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఆ ఇంట్లో ఉంటే.. ఏ క్షణాన ప్రాణం మీదికి వస్తుందోనని భయపడి హైదరాబాదులోని తన ఇంటికి ఆయన పారిపోయారు. అయితే… ఆ నివాసానికి ముంపు ప్రమాదం పొంచి ఉంది. జలవనరుల శాఖ.. ముంపు ప్రమాదం ఉన్న గ్రామాలను డ్రోన్ కెమెరా చిత్రీకరణలో గుర్తించే ప్రయత్నంగా.. చంద్రబాబు ఇంటిమీద కూడా డ్రోన్లు సంచరించాయి. దీంతో యావత్ తెలుగుదేశం కంగారు పడిపోయింది. నానా యాగీ చేస్తోంది. ‘నా భద్రతను ప్రశ్నార్థకం చేస్తారా?’ అంటూ బాబు కూడా నిలనదీస్తున్నారు.
అసలు డ్రోన్లు ఎగిరింది ఆయన భద్రత కోసమే అని ఆయన ఎందుకు గుర్తించలేకపోతున్నారో అని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.