నిన్నగాక మొన్న ఎన్నికలు జరిగాయ్.. మళ్ళీ ఉప ఎన్నికల గోలేంటి.? అంటే, దానికీ ఓ లెక్కుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి దూకేందుకు తెలుగుదేశం పార్టీ నుంచి చాలామంది ఎమ్మెల్యేలు సిద్ధంగా వున్నారు. ఐదుగురు ఎమ్మెల్యేలని లాగేద్దామని తనతో కొందరు అన్నారనీ, అయితే అందుకు తాను సుముఖత వ్యక్తం చేయలేదని సాక్షాత్తూ అసెంబ్లీలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రకటించారు. 'మాతో టీడీపీ ఎమ్మెల్యేలు టచ్‌లో వున్నారు.. ఆ లెక్క ఎంతో తెలుసా.?' అని చంద్రబాబుని ర్యాగింగ్ చేసి పారేశారు నిన్నటి అసెంబ్లీలో వైఎస్ జగన్.
'అయినా, మీలాగా మేం చేయం. పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహించం. ఒకవేళ టీడీపీ ఎమ్మెల్యేలు ఎవరైనా, మా పార్టీలోకి రావాలనుకుంటే వారి పదవులకు రాజీనామా చేసి మాత్రమే రమ్మంటాం..' అని వైఎస్ జగన్ స్పష్టం చేసిన దరిమిలా, అతి త్వరలో ఆంధ్రప్రదేశ్‌లో ఉప ఎన్నికలు తప్పవన్న సంకేతాలు అయితే స్పష్టంగా కన్పిస్తున్నాయి. వైసీపీకి చెందిన ఇద్దరు నేతలు, తమ పార్టీలోకి రాబోయే టీడీపీ ఎమ్మెల్యేల లెక్కపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
కరణం ధర్మశ్రీ లెక్కల్లో అయితే టీడీపీ నుంచి 11 మంది తప్ప ఇప్పటికిప్పుడు మిగతా 12 మంది ఎమ్మెల్యేలూ వైఎస్సార్సీపీలో చేరాలని అనుకుంటున్నారట. మరో వైసీపీ నేత కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి లెక్కల్లో అయితే 8 నుంచి 10 మంది ఎమ్మెల్యేలు వైసీపీతో టచ్‌లో వున్నారని అర్థమవుతోంది. ఎంపీల విషయానికొస్తే, విజయవాడ ఎంపీ కేశినేని నాని ఆల్రెడీ బీజేపీతో టచ్‌లో వున్నారు. మిగతా ఇద్దరు ఎంపీలు గల్లా జయదేవ్, కింజరాపు రామ్మోహన్‌నాయుడు ఎక్కువకాలం టీడీపీలో వుండే అవకాశమే కన్పించడంలేదు.
మొత్తమ్మీద, తెలుగుదేశం పార్టీలో అయితే ముసలం షురూ అయ్యిందన్నమాట. ఆ పదిమంది ఎమ్మెల్యేలు ఎవరు.? అన్నదానిపై తెలుగుదేశం పార్టీ మల్లగుల్లాలు పడ్తోంది. ఎవరికి వారే, 'మేం పార్టీ మారడంలేదు' అని చెబుతున్నా, ఫలితాలు వచ్చినప్పటి నుంచీ గెలిచిన ఎమ్మెల్యేల మాటలు పరిశీలిస్తే, ఎవరు వైసీపీలోకి వెళ్ళాలని డిసైడ్ అయ్యారో తెలుసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.
ఇప్పుడే 12 మంది ఎమ్మెల్యేలు టీడీపీని వీడే పరిస్థితులు కన్పిస్తున్నాయంటే, ఇంకో ఐదేళ్ళు చంద్రబాబు, తెలుగుదేశం పార్టీని నడపగలరా.? ప్రతిపక్ష హోదా చంద్రబాబుకి ఎన్ని రోజులు మిగిలి వుంటుంది.? ఏమో, వేచి చూడాల్సిందే.