శాసనసభకు స్పీకర్ ఎన్నిక కూడా పూర్తయిన తరువాత… ధన్యవాదాలు తెలిపే సందర్భంలోనే పాలక ప్రతిపక్షాలు మాటలు రువ్వుకున్నాయి. తెలుగుదేశాన్ని వైకాపా ఎండగడితే, ‘మీరు మాత్రం…’ అంటూ బుకాయింపు విమర్శలు చేయడానికి చంద్రబాబు ప్రయత్నించారు. నాయకుల తీరు మొత్తం ఒక ఎత్తు అయితే… సభాపతిగా తమ్మినేని సీతారాం మాటలు మరోఎత్తు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత… ఆయన చేసిన ఒక కీలక వ్యాఖ్య… గతంలో సాగిన అయిదేళ్ల తెలుగుదేశం పాలనకు, నాయకుడిగా చంద్రబాబు నాయుడుకు చెంపపెట్టు వంటిదని పలువురు భావిస్తున్నారు.
సభాపతి అయిన తర్వాత తమ్మినేని సీతారాం మాట్లాడుతూ… శాసనసభ నిర్ణయాలను కోర్టు సమీక్షించే పరిస్థితి రాకూడదని వ్యాఖ్యానించారు. నిజానికి ఇది చాలా పెద్ద కామెంట్. ఎందుకంటే… గత అయిదేళ్ల పాలనలో ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ అభాసుపాలైపోయిందన్న సంగతి అందరికీ తెలిసిందే.
తాను గద్దెఎక్కిన నాటినుంచి… చంద్రబాబునాయుడు- ప్రతిపక్షాన్ని నాశనం చేయడం ఎలా అనే అంశం మీదనే దృష్టిపెట్టారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలకు ప్రలోభాల ఎరవేసి, భయపెట్టి వీలైనంత మందిని తమ పార్టీలోకి ఫిరాయించేలా చేసుకోగలిగారు. మంత్రి పదవులు కూడా కట్టబెట్టారు. ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని, తద్వారా రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారు.
వైకాపా ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పీకరు స్పందించలేదు. వ్యవహారం కోర్టు కెళ్లి, అక్కడినుంచి తాకీదులు వచ్చినా స్పందించలేదు. రోజా వ్యవహారంలో వెలివేయడం కూడా కోర్టుకెక్కింది. ఇలా ఏపీ అసెంబ్లీ వ్యవహారాలు అంటేనే… కోర్టులో కూడా తేలని చిక్కు సమస్యలుగా ముద్ర పడిపోయాయి. ఇవాళ తమ్మినేని – మన నిర్ణయాలను కోర్టు సమీక్షించే పరిస్థితి రాకూడదు అనడమే చాలా పెద్ద విషయం.
తమ పార్టీలోకి ఎవరైనా వచ్చినా కూడా ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి రావాల్సిందేనని జగన్ కూడా అన్నారు. దీనిద్వారా రాజ్యాంగ విలువలకు, రాజకీయాల్లో నైతిక విలువలకు తాము ఎంత ప్రాధాన్యం ఇవ్వబోతున్నామో కొత్త ప్రభుత్వం స్పష్టంగా చెప్పిందని అనుకోవాలి. రాజకీయాల్లో వందల ఏళ్లుగా ముదిరిపోయిన కుట్ర రాజకీయాలు కాకుండా, స్వచ్ఛంగా ఆలోచించడం మంచిదని చంద్రబాబు అండ్ కో నేర్చుకోవాలి.