గడనగల మగని జూచిన
పడతులు పదియారువేలు తగ పెండ్లాడన్
గడనుడిగిన మగని జూచిన
నడ పీనుగ వచ్చెననుచు నగదురు సుమతీ
..అని సుమతీ శతక పద్యం మనకు నీతిని బోధిస్తుంది. ఇది చెప్పే నీతి ఏమిటో మన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారికి ఇప్పటికైనా అర్థమై ఉండాలి. ఈ పద్యం చెప్పేదేంటంటే.. ‘సంపాదన ఉన్న మగాడిని చూస్తే.. పదహారు వేల మంది అయినా.. పెళ్లాడడానికి వస్తారు. కానీ.. సంపాదన లేకుండాపోయిన వాణ్ని చూస్తే.. నడిచే శవం వస్తోందంటూ జోకులేసుకుంటారు’ అని! అధికారం ఉడిగిపోయిన తర్వాత.. చంద్రబాబును వదలిపోతున్న నాయకులను గమనిస్తే.. ఆయనకు ఆ నీతి తలకెక్కుతుంది.
2014లో అధికారంలోకి వచ్చినప్పుడు.. చంద్రబాబునాయుడుకు ప్రభుత్వం నడపడానికి అవసరమైన పూర్తి మెజారిటీ ఉంది. పార్టీలో చీలికలు వస్తాయేమో.. ప్రభుత్వం కూలుతుందేమో అనే భయం ఇసుమంత కూడా లేదు. అన్నింటినీ మించి.. అప్పటి ప్రతిపక్షనాయకుడు జగన్.. ఎమ్మెల్యేలను ఫిరాయింపజేసి తన పార్టీలోకి చేర్చుకునే ఆలోచనే ఉండేవాడు కాదు. అధికార పార్టీ నుంచి ఎమ్మెల్యేలు తనవైపు వచ్చినా.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాత మాత్రమే చేర్చుకుంటానని అంతకుమునుపే నిరూపించుకున్న నిబద్ధత కలిగిన నాయకుడు. ఇక అటువైపు నుంచి ప్రమాదంలేదు.
అయినా సరే.. చంద్రబాబు విలువలు తప్పి… నైతికతను విస్మరించి.. వైకాపాను బలహీనపరచడమే లక్ష్యంగా.. ఆ ఎమ్మెల్యేలు పలువురిని తనతో కలిపేసుకున్నారు. వాళ్లని మంత్రుల్ని కూడా చేశారు. అధికారం చూసి, అధికారం కోసం వచ్చిన వాళ్లు ఎన్నాళ్లుంటారు. ఇప్పుడాయన ఓడిపోగానే.. వారి దారి వారు చూసుకుంటున్నారు. ఇప్పటికే కొందరు నాయకులు భాజపా పంచన చేరితే.. మాజీమంత్రి కడపజిల్లాకు చెందిన ఆదినారాయణ రెడ్డి ఇవాళ భాజపాలో చేరుతున్నారు.
ఎవరొస్తే వాళ్లను చేర్చేసుకుందాం అనే ధోరణిలో భాజపా వెళుతోంది. ఆ సంగతి పక్కనపెడితే.. విలువలు లేని రాజకీయాల వలన తాత్కాలిక ప్రయోజనాలు దక్కుతాయే తప్ప,, శాశ్వతమైన బలం రాదు, పరువు కూడా మిగలదు అనే నీతిని చంద్రబాబు తెలుసుకుంటే మంచిది.