మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో లభించిన బెయిల్ ను నిజంగానే ఊరటగా పరిగణించాలా? ఈ బెయిలు ద్వారా ఆయన పూర్తిగా సేఫ్ జోన్ చేరుకున్నట్లేనా? అంటే పూర్తిగా అవునని చెప్పలేని పరిస్థితి.
స్కిల్ డెవలప్మెంటు కేసులో మాత్రమే హైకోర్టు చంద్రబాబుకు పూర్తిస్థాయి బెయిల్ మంజూరు చేసింది. అంతమాత్రాన ఆయన కడిగిన ముత్యంగా బయటకు వచ్చినట్టు కాదు. చంద్రబాబు మీద ఇంకా అనేక కేసులు పెండింగులోనే ఉన్నాయి. అన్నీ వందల వేల కోట్లరూపాయల ప్రభుత్వ నిధులను స్వాహాచేసిన అవినీతి కేసులే. అందుకే ఏదో ఒక కేసులో ఆయన మళ్లీ అరెస్టు అయ్యే అవకాశం ఉన్నదని పలువురు భావిస్తున్నారు.
బెయిలు దక్కిన స్కిల్ డెవలప్మెంటు కేసును పక్కన పెడితే.. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు అనేది చాలా కీలకమైనది. చంద్రబాబునాయుడు అనుచర గణం, అనుయాయులు, తొత్తులు.. ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో భారీగా లబ్ధి పొందరు. ఇదే కేసులో హెరిటేజ్ భూములకు సంబంధించి.. లోకేష్ మీద కూడా కేసు ఉంది. అందరూ కలిసి వేల కోట్ల రూపాయల సొమ్ము అక్రమాలకు పాల్పడినట్టు కేసు ఉంది.
అలాగే ఫైబర్ నెట్ కేసు కూడా చాలా పెద్దది. నిజానికి ఇది .. చంద్రబాబు మాయోపాయాలనుంచి పుట్టిన అక్రమాల్లో స్కిల్ డెవలప్మెంట్ కేసు కంటె చాలా పెద్దది.
ఇటీవలి కాలంలోనే చంద్రబాబునాయుడు మీద ఆయన ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న ఇసుక కుంభకోణం మీద కూడా కేసు నమోదు అయింది. వీటిలో కొన్ని కేసులు మీద చంద్రబాబునాయుడు ముందుగానే బెయిలు తెచ్చుకోవడానికి వెళ్లినప్పుడు కోర్టు నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది.
పుంగనూరు అంగళ్లు వద్ద రెచ్చగొట్టిన అల్లర్లకు సంబంధించి.. నమోదు అయిన కేసులో మాత్రమే చంద్రబాబునాయుడుకు ముందస్తు బెయిలు లభించింది. ఈ నేపథ్యంలో ఆయన మీద అవినీతి, అక్రమార్జనలకు సంబంధించిన కేసులన్నీ అలాగే ఉన్నాయి.
ఇప్పుడు స్కిల్ కేసులో బెయిలు వచ్చినంత మాత్రాన చంద్రబాబుకు ఊరట లభించినట్టు కాదు. ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్, ఇసుక కుంభకోణం కేసుల్లో చంద్రబాబునాయుడును సీఐడీ అధికారులు ఏ క్షణాన్నయినా అరెస్టు కావడానికి అవకాశం ఉంది.
ఈ నెల 28 వరకు మాత్రమే మధ్యంతర బెయిలు. ఆ తర్వాత.. సాధారణ బెయిలే గనుక.. రాజకీయ సభలు సమావేశాలతో చంద్రబాబు రెచ్చిపోయి తిరగడం ప్రారంభిస్తారు. కాబట్టి.. చంద్రబాబునాయుడును ఎప్పుడు మళ్లీ అరెస్ట్ చేస్తారా? ఏ కేసులో ముందుగా అరెస్ట్ చేస్తారా? అనే భయం కూడా ఆ పార్టీ వారిలో ఉంది. మళ్లీ అరెస్టు కాకుండా చంద్రబాబు తప్పించుకునే అవకాశమే లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.