విజయనగరం జిల్లా గజపతినగరం తమ్ముళ్లకు జనసేన నుంచి భారీ ఝలక్ తప్పదని అంటున్నారు. ఈ సీటు కోసం జనసేన గట్టిగా పట్టుబడుతూండడమే ఇందుకు కారణం. గజపతినగరం మీద మొదటి నుంచి జనసేన ఆసక్తిని చూపిస్తోంది.
ఉమ్మడి విజయనగరం జిల్లాలో మొత్తం తొమ్మిది అసెంబ్లీ సీట్లు ఉంటే అందులో మూడింటిని జనసేన కోరుతోంది అని ప్రచారం అయితే సాగుతూ వస్తోంది. ఇపుడు జనసేన ఇంచార్జిని నియమించడంతో ఆయన పోటీకి సిద్ధం అవుతున్నారు.
టీడీపీలో చూస్తే రెండు వర్గాలుగా పార్టీ విడిపోయింది. మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు 2014లో ఇక్కడ నుంచి గెలిచారు. ఆయన 2019లో ఓటమి పాలు అయ్యారు. మరోసారి ఇక్కడ నుంచే పోటీ చేయాలని చూస్తున్నారు. టీడీపీలో మరో కీలక నాయకుడు కూడా ఈసారి పోటీకి తాను తయారుగా ఉన్నానని చెబుతున్నారు.
ఈ వర్గ పోరులో జనసేన సీటుని పొత్తులో భాగంగా కొట్టుకునిపోయేలా ఉందని అంటున్నారు. జనసేనలో మాజీ మంత్రి సీనియర్ నేత పడాల అరుణ ఈ మధ్యనే చేరారు. ఆమె కూడా సీటు ఆశిస్తున్నారు. అయితే జనసేన అధినాయకత్వం వెలమ సామాజికవర్గానికి చెందిన నేతను ఇంచార్జిగా నియమించడంతో ఆయనకే టికెట్ అంటున్నారు.
గజపతినగరంలో సామాజిక సమీకరణలు చూస్తే కాపు ప్లస్ వెలమ డామినేషన్ ఉంది. దాంతో జనసేన అభ్యర్ధికి రెండు సామాజిక వర్గాలు ఉపయోపడేలా ఈ ఎంపిక జరిగింది అని అంటున్నారు. గజపతినగరం జనసేనకే అని ప్రచారం మొదలైంది. దాంతో టీడీపీలో వర్గ పోరు కాస్తా జనసేన తీర్చేస్తుందా అన్న డౌట్లు తమ్ముళ్ళు వ్యక్తం చేస్తున్నారుట.