మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి రైతుల ఓట్లను పొంది అధికారం సంపాదించుకుని, అదే రైతులను దారుణంగా మోసం చేసిన పెద్దమనిషి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు. ఆ మోసం ఏమిటో వివరించనక్కర్లేదు. 2014 ఎన్నికల ముందు రుణమాఫీ అంటూ చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. తీరా అధికారంలోకి రాగానే మోసం మొదలుపెట్టారు. వడపోశారు. అనేక మంది రైతులను అనర్హులుగా తేల్చారు. అదేమంటే వాళ్లంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని బాహాటంగా వ్యాఖ్యానించారు!
ఇక ఆ రైతులకు మాఫీ విషయంలో ఎన్ని వేషాలు వేశారో, రైతులకు ఏ రకంగా టోపీ పెట్టారో కూడా అందరికీ తెలిసిందే. తాకట్టులోని బంగారాన్ని కూడా విడిపించడం అనే హామీని ఇచ్చి, ఆ రుణాలను పట్టించుకోనే పట్టించుకోకుండా, చివరకు విడతల వారీగా మాఫీ అని ప్రకటించారు. ఐదేళ్ల పాలనలో మూడేళ్ల మాఫీ చేసి, మిగతా రెండు విడతల విషయంలో మరో మోసం చేశారు. అదేమంటే మాఫీ అంతా అయిపోయినట్టుగా ఎన్నికల ముందు చెప్పారు. తీరా జనాగ్రహంతో టీడీపీ చిత్తు అయ్యింది. మోసం తప్ప మరోటి ఎరగనట్టుగా సాగిన చంద్రబాబు పాలనకు రైతులు, సామాన్యులు తగిన బుద్ధి చెప్పారు.
ఆ నిస్సిగ్గు వ్యవహారంలో మరింత దారుణం ఏమిటంటే.. తాము హామీ ఇచ్చిన రుణమాఫీని జగన్ పూర్తి చేయాలని సంవత్సరంగా చంద్రబాబుతో సహా తెలుగుదేశం వాళ్లు అంటూ ఉండటం. మిగిలిన రెండు విడతల మాఫీని జగన్ ప్రభుత్వం చేయాలంటూ తెలుగుదేశం వాళ్లు అనేక నిస్సిగ్గు ప్రకటనలు చేశారు. తద్వారా తమ అసమర్థతను, చేతగాని తనాన్ని వారే చాటుకున్నారు.
అది చాలదన్నట్టుగా చంద్రబాబు నాయుడు రైతు దినోత్సవం రోజున చేతగాని మాటలు మాట్లాడారు. ఇప్పుడు చంద్రబాబు చేతిలో అధికారం ఉండి ఉంటే.. రైతులకు తలా ఇరవై వేలు ఇచ్చేవారట! జగన్ ప్రభుత్వం అలా ఇవ్వడం లేదట! రుణమాఫీని ఎగ్గొట్టిందట!
ఈ మాటలను వింటే.. సామాన్య రైతులు కూడా గ్రాడించి ఉమ్మేసి తర్వాత మాట్లాడతారు! అధికారం చేతిలో ఉన్నన్ని రోజులూ.. ఏమీ చేయకుండా, రుణమాఫీ విషయంలోనూ రైతులను దారుణంగా మోసం చేసి, ఇప్పుడు ప్రతిపక్షంలో 23 సీట్లతో కూర్చుని.. తన చేతిలో అధికారం ఉంటే.. రైతులను తెగ ఉద్ధరించే వాడినంటూ చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రకటనలు రైతులకే కంపరం పుట్టించేలా ఉన్నాయి! చంద్రబాబు నాయుడి షేమ్ లెస్ పాలిటిక్స్ పతాక స్థాయికి చేరిపోయాయని, తనేం మాట్లాడుతున్నట్టో ఆయనకే అర్థం కావడం లేదని.. అందుకే ఆయన ఇలా మాట్లాడుతూ ఉన్నారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు!