ఛానెల్ ను ఎవ్వరు నడపోచ్చు.. ఎవ్వరు నడపకూడదు? దీనికి సమాధానం తెలియాలంటే టీవీ 9 ఎక్స్ సిఇఓ రవిప్రకాష్ ను అడిగి తెలుసుకోవాలి. ఆయన తన లేటెస్ట్ ఇంటర్వూలో ఇలా అన్నారట.. ''రామేశ్వరరావు 2016లోనే టీవీ9ను కొనాలని సంప్రదించారు. కానీ నేను ఆ ఆలోచనకు వ్యతిరేకిని. ఆయనకు రాజకీయ అజెండా వుంది. పైగా ఆయన చినజీయర్ శిష్యుడు. ముఖ్యమంత్రికి సన్నిహితుడు అందుకే ఆయన సిద్దాంతాలు, ఐడియాలజీ టీవీ9 మీద రుద్దడానికి ప్రయత్నిస్తారు. అందుకే వ్యతిరేకించాను..''
పోలిటికల్ అజెండా లేకుండానే రవిప్రకాష్ ఇన్నాళ్లుగా ఛానెల్ ను రన్ చేసారా? ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఓపెన్ బ్యాలెట్ పెట్టినా, జనం ముక్తకంఠంతో చెబుతారు. టీవీ9 పొలిటికల్ ఎజెండా చంద్రబాబుకు మద్దతుకాక వేరు కాదు అని. పోనీ బిజిసెస్ అయిడియాలజీ లేదు అని అందాం అంటే, మరి వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర సెజ్ కోసం ఎందుకు దరఖాస్తు చేసి, తీసుకున్నారు. అన్ని పరిశ్రమలు ఆ సెజ్ కే ఎందుకు కేటాయించారు?
ఇవన్నీ పక్కన పెడితే చినజీయర్ శిష్యుడు అయితే ఛానెల్ నడపకూడదా? మరి అదే చినజీయర్ కు చంద్రబాబు సైతం అనుకూలంగా వ్యవహించిన సందర్భాలు వున్నాయి కదా? మరి అనేక మతసంస్థలు టీవీల్లో ప్రకటనలు ఇస్తుంటే తీసుకున్న రోజులు లేవా? అనేక మత సంస్థలు పరోక్షంగా మీడియాలో షేర్లు తీసుకుని శాసిస్తున్న సంగతి వాస్తవం కాదా? పైగా చినజీయర్ సిద్దాంతం అంత ప్రమాదకరమా? దారుణమా? ఎందుకు రవిప్రకాష్ కు ఇష్టం లేదో?
ఆ సంగతి అలా వుంచితే మెగా కృష్ణారెడ్డికి అయితే అమ్మడానికి ఓకె అన్నారట. కానీ ఆయన తనతో పాటు వెనకాల రామేశ్వరరావును కూడా తీసుకువచ్చారట. అదే నచ్చలేదట. ఇద్దరూ ఇండస్ట్రియలిస్ట్ లే. రామేశ్వరరావుకు కేసిఆర్ తో సంబంధాలు వుంటే కృష్ణారెడ్డికి బాబుగారితో కూడా మంచి సంబంధాలు వున్నాయని టాక్. ఆంధ్రలో అనేక ప్రాజెక్టులు కృష్ణారెడ్డికి వున్నాయి. మరి ఆయన ఎందుకు రవిప్రకాష్ కు ముద్దు?
ఎడిటోరియల్ బోర్డులో జోక్యం చేసుకుందామని రామేశ్వరరావు ప్రయత్నించారు అన్నది రవిప్రకాష్ కామెంట్. కెసిఆర్ పార్టీకి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించాలన్నది వారి ప్రయత్నంగా చెబుతున్నారు. కానీ టీవీ 9 నిస్పక్షపాతంగా వుందన్నది ఆయనమాట. మరి ఆంధ్ర విషయంలో టీవీ9 లో ఈ నిస్పక్షపాతం ఎందకు కనిపించదు? వేలాది ఇన్సిడెంట్లు, వ్యవహారాల విషయంలో టీవీ9 ఆంధ్రలో నిస్పక్షపాతంగా వ్యవహరించిందో లేదో, సాక్షిని, దానిని పక్కన పెడితే తెలిసిపోతుంది.
మొత్తం మీద రవిప్రకాష్ పోలీసులకు దొరకడం లేదు కానీ, ఫోన్ ఇంటర్వూలు మాత్రం బాగానే ఇస్తున్నట్లు కనిపిస్తోంది.