“రాష్ట్రం అతలాకుతలం అయిపోతోంది. అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. సీఎస్ ప్రభుత్వాన్నే ఎదిరిస్తున్నారు. ఎటుపోతున్నాం అని అడుగుతున్నాను. కచ్చితంగా కేబినెట్ మీటింగ్ పెట్టి తీరతాను.” ఇలా శపథం చేసి మరీ అనుకున్నది సాధించారు ఏపీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు. ఎలక్షన్ కమిషన్ నుంచి ప్రత్యేక అనుమతి తీసుకొని మరీ మంత్రివర్గ సమావేశం పెట్టిన బాబు చివరికి ఏం సాధించారు? దీనికి సమాధానం ఒకేఒక్కటి. చంద్రబాబు తన ఇగోను శాటిస్ ఫై చేసుకున్నారు.
రాబోయే రోజుల్లో ఈసీ మెడలు కూడా వంచాం అని తెలుగుతమ్ముళ్లు గొప్పగా చెప్పుకోవడానికి మాత్రమే ఈ సమావేశం పనికొస్తుంది. అంతకుమించి ఎలాంటి ప్రయోజనం కనిపించలేదు. ఇంకా సూటిగా చెప్పాలంటే మంత్రులంతా పిచ్చాపాటీ మాట్లాడుకున్నారు. దేశ రాజకీయాలు, ఏపీలో రాబోయే ఫలితాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. ఈపాటి చర్చకు కేబినెట్ మీటింగ్ అని పేరుపెట్టారు.
మరోరకంగా చూస్తే, మంత్రులందరికీ తుదివీడ్కోలు పలకడానికి ఈ సమావేశం పెట్టినట్టు కనిపించింది. వచ్చేది తమ ప్రభుత్వం కాదని, ఇదే తమకు ఆఖరి కేబినెట్ భేటీ అనే ఫీలింగ్ తో మంత్రులంతా మీటింగ్ కు వచ్చారు. అలానే మాట్లాడుకున్నారు కూడా. ఎలక్షన్ కోడ్ కు వ్యతిరేకంగా సమావేశం దారితప్పలేదు కాబట్టి, సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం కూడా ఎంచక్కా అందరితో కలిసి నవ్వులు చిందించారు.
రాజకీయాలు పక్కనపెడితే, ప్రజా సమస్యలకు సంబంధించి ఈ వేసవిలో పట్టణ ప్రాంతాల్లో ఉన్న తాగునీటి ఎద్దడిపై ఎక్కువగా మాట్లాడుకున్నారు మంత్రులంతా. తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని చంద్రబాబు, సీఎస్ ను ఆదేశించారు. దీనికి సీఎస్ అంగీకరించారు. కలెక్టర్లతో మాట్లాడతానని చెప్పారు.
అవసరమైతే నేరుగా నిధులు విడుదల చేయాలని చంద్రబాబు సూచించగా, దీన్ని సీఎస్ వ్యతిరేకించినట్టు తెలుస్తోంది. బిల్లుల చెల్లింపులకు సంబంధించి వచ్చిన ప్రతి అంశాన్ని, కోడ్ కారణంగా సీఎస్ సున్నితంగా తిరస్కరించినట్టు తెలుస్తోంది. ఈ విషయంలో మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర నిరాశకు గురయ్యారట.
మొత్తమ్మీద ఎక్కువసేపు రాజకీయాలు, చాలా కొద్దిసేపు మాత్రం మిగతా ప్రజాసమస్యలపై చంద్రబాబు చర్చించారు. అలా తన టర్మ్ లో చివరి కేబినెట్ భేటీని ముగించారు. మంత్రులకు తుది వీడ్కోలు పలికారు.