కేవలం ముస్లింలను ఒక భయంలో పెట్టడానికే అనే అనుమానాల మధ్య కేంద్ర ప్రభుత్వం తలపెడుతున్న పౌరసత్వ సవరణ బిల్లు ఈ పార్లమెంటు సమావేశాల్లోనే చట్టం రూపు దాల్చనుంది.పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్ లనుంచి ఇండియాకు తరలివచ్చిన ముస్లిమేతరులందరూ… అక్కడ మతపరమైన వేధింపుల వలన వలస వచ్చామని చెప్పుకుంటే గనుక.. వారికి భారత పౌరసత్వం ఇచ్చేయడానికి వీలుగా ఈ బిల్లు రూపొందించారు. ఈ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందితే.. 1955 నాటి భారత పౌరసత్వ చట్టానికి సవరణ జరుగుతుంది.
నిజానికి ముస్లింలు- ముస్లిమేతరులుగా భారతదేశ పౌరసమాజం రెండు ముక్కలుగా చీలికలుగా కనిపించడానికి ఈ బిల్లు ఒక కారణం అవుతుందంటే అనుమానం అనవసరం. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్ లు మూడూ ముస్లిం దేశాలు.
ఈ మూడు దేశాలలో తమకు మతపరమైన రక్షణ లేకపోవడం వలన, మత విద్వేషాలకు బలవుతామనే భయం ఉండినందువల్ల.. ఇండియాకు వచ్చేశాం అని ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ లో ఎవరైనా చెప్పుకుంటే చాలు.. వారికి ఇప్పుడు భారత పౌరసత్వం లభిస్తుంది. అంటే పరోక్షంగా వారందరిలోను మరియు వారిపట్ల సానుభూతి ఉండే వారిలోనూ.. ముస్లిం మతం పట్ల ద్వేషాన్ని పాదుగొల్పుతున్నట్లే లెక్క.
ఉదాహరణకు పాకిస్తాన్‌లో ఉండే సౌమ్యుడైన ముస్లిం.. అక్కడి మత ధోరణులు నచ్చక.. ప్రశాంతంగా బతకడానికి భారత్‌కు వచ్చేశాడనే అనుకుందాం. అతడికి మాత్రం పౌరసత్వం ఇచ్చారు.
ముస్లిం మతానికి చెందిన వాడు కాకపోతే చాలు.. ఎలాంటి ఉగ్రవాదులైనా ఈ మూడు దేశాలనుంచి ఇండియాకు వచ్చేసి.. ఎంచక్కా పౌరసత్వం కూడా తీసుకుని.. తమ ఉగ్రవాద కార్యకలాపాలను నడుపుకుంటూ ఉండవచ్చు. కేవలం ముస్లింలను మాత్రం ఆ దేశాలనుంచి ఇతర మతాల వారిని వెళ్లగొట్టిన క్రూరులుగా చిత్రించేలా ఈ పౌరసత్వ సవరణ బిల్లు కనిపిస్తోంది.
ఏదేమైనా, ఎన్ని వ్యతిరేకతలున్నా… ఈ బిల్లు చట్టం రూపు దాల్చే అవకాశం కనిపిస్తోంది. రాజ్యసభలో ప్రభుత్వానికి బలం తక్కువ ఉన్నా బీజేడీ, వైకాపా మద్దతిస్తేనే బిల్లు నెగ్గుతుంది.
ముస్లింలో ఈ బిల్లు పట్ల ఉన్న వ్యతిరేకత నేపథ్యంలో ఆ రెండు పార్టీలు దూరం ఉండిపోతేగనుక.. ఈ ఏడాది జనవరిలో జరిగినట్లే.. లోక్ సభలో నెగ్గి, రాజ్యసభలో వీగిపోయి బిల్లు మళ్లీ చతికిలపడుతుంది. కానీ మోడీ హవా ప్రస్తుతం చెలరేగుతున్న దాన్ని బట్టి.. బిల్లు రాజ్యసభలోనూ నెగ్గే అవకాశాలే ఎక్కువ.