క్రమశిక్షణ.. కావాల్సింది పవన్‌కళ్యాణ్‌కే.!

అభిమానుల అత్యుత్సాహానికి ఉప్పొంగిపోవడం పవన్‌ కళ్యాణ్‌కి కొత్తేమీ కాదు. కానీ, ఆ అభిమానుల అత్యుత్సాహం ఇప్పుడు పవన్‌ కళ్యాణ్‌కి చికాకు తెప్పిస్తోంది. కాస్త లేటుగానే అయినా, పవన్‌ కళ్యాణ్‌ వాస్తవం అర్థం చేసుకున్నారు. కానీ,…

అభిమానుల అత్యుత్సాహానికి ఉప్పొంగిపోవడం పవన్‌ కళ్యాణ్‌కి కొత్తేమీ కాదు. కానీ, ఆ అభిమానుల అత్యుత్సాహం ఇప్పుడు పవన్‌ కళ్యాణ్‌కి చికాకు తెప్పిస్తోంది. కాస్త లేటుగానే అయినా, పవన్‌ కళ్యాణ్‌ వాస్తవం అర్థం చేసుకున్నారు. కానీ, 'క్రమశిక్షణ లేకపోతే రాణించలేం.. అందుకే ఎన్నికల్లో ఓడిపోయాం..' అంటూ పవన్‌ కళ్యాణ్‌, అభిమానుల్ని ఉద్దేశించి చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం బెడిసికొడుతున్నాయి. 

అభిమానులు చాలా తీవ్రంగానే హర్ట్‌ అవుతున్నారు తమ అభిమాన నటుడు, నాయకుడి నిర్వాకంతో.నిజానికి, అభిమానులు అలా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారంటే.. దానిక్కారణం పవన్‌ కళ్యాణ్‌ ఆయా అంశాలపై చేస్తున్న రెచ్చగొట్టే ప్రకటనలే. గడ్డం పెంచేసి, తెల్ల బట్టలు వేసుకుని రాజకీయాల్లో తిరుగుతున్న పవన్‌ కళ్యాణ్‌, తన మాట తీరు విషయంలో మాత్రం జాగ్రత్తలు పాటించలేకపోతున్నారు. 151 మంది ఎమ్మెల్యేలున్న అధికార పార్టీని ఉద్దేశించి 'మీరెంత, మీ బతుకెంత' అని ఓ సందర్భంలో సెలవిచ్చారు. 'మీరు వైసీపీ అయితే మాకేంటి? మేం జనసేన..' అని పవన్‌ కళ్యాణ్‌ తాజాగా నినదించారు.

సినిమాల్లో డైలాగులకు ఈలలు, కేకలు మామూలే. రాజకీయాల్లోనూ అవే కన్పిస్తున్నాయి. సినిమా ఇమేజ్‌ పక్కన పెట్టి, ఇంకా పవన్‌ తన నాయకత్వ లక్షణాల్ని చాటుకోవడానికి ప్రయత్నించకపోవడం హాస్యాస్పదం కాక మరేమిటి.? అవును, ఖచ్చితంగా పవన్‌ కళ్యాణ్‌కి క్రమశిక్షణ అవసరమే. చంద్రబాబు డైరెక్షన్‌లో పనిచేయడం మానేసి.. సొంత ఎజెండాతో పవన్‌ ముందుకు వెళితే, ఎంతో కొంత ఆయనకి ఓటర్ల నుంచి మద్దతు లభిస్తుంది. లేకపోతే, లక్షలాదిగా ఇప్పుడు తరలివస్తున్న అభిమానులూ ముందు ముంసదు పలచబడిపోయే ప్రమాదం లేకపోలేదు.

'మీ నుంచి ఇలాంటి వ్యాఖ్యల్ని మేం ఆశించడంలేదు..' అని ఇప్పటికే పవన్‌ అభిమానులు, తమ అభిమాన నటుడు, నాయకుడికి సోషల్‌ మీడియా వేదికగా సూచిస్తున్నారు. అయినా, పవన్‌ ఆలోచనల్లో మార్పు రావడంలేదు. జనసేన అనే ఓ రాజకీయ పార్టీకి అధినేతలా, హుందాతనంతో పవన్‌ వ్యవహరించకపోవడం.. రాజకీయంగా ఆయనకు ముందు ముందు మరిన్ని ఇబ్బందుల్ని తీసుకురాబోతోందన్నది నిర్వివాదాంశం.
'మమ్మల్ని సంస్కరించడం మానేసి.. ముందు మిమ్మల్ని మీరు సంస్కరించుకోండి..' అని అభిమానులు అలియాస్‌ జనసైనికులతో పవన్‌ కళ్యాణ్‌ చెప్పించుకునే రోజు రాకుండానే ఆయన మారితే మంచిదే.!