దగ్గుబాటి కుటుంబంలో రాజకీయ శూన్యత

భార్య కేంద్రమంత్రిగా పనిచేశారు, భర్తకు రాష్ట్రమంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. అయినా ఆ కుటుంబంలో ఇప్పుడు రాజకీయ శూన్యత ఆవరించి ఉంది. భార్య కేంద్రంలో అధికార పార్టీ సభ్యురాలు, భర్త రాష్ట్రంలో అధికార పార్టీ…

భార్య కేంద్రమంత్రిగా పనిచేశారు, భర్తకు రాష్ట్రమంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. అయినా ఆ కుటుంబంలో ఇప్పుడు రాజకీయ శూన్యత ఆవరించి ఉంది. భార్య కేంద్రంలో అధికార పార్టీ సభ్యురాలు, భర్త రాష్ట్రంలో అధికార పార్టీ నేత. అయినా సరే ఆ కుటుంబంలో ఎవరికీ ఎలాంటి పదవులు లేవు. దగ్గుబాటి ఫ్యామిలీ ప్రస్తుతం రాజకీయ ఉనికి కోసం ఇబ్బంది పడుతోంది.

చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలతో తన పొలిటికల్ కెరీర్ నే అర్థాంతరంగా వదిలేశారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు. ఆ తర్వాత తన భార్య పురందీశ్వరితో సహా కాంగ్రెస్ లో చేరి, ఇటీవల తానొక్కరే కొడుకు భవిష్యత్ కోసం వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. తీరా కొడుకు నామినేషన్ కుదరకపోయే సరికి గత ఎన్నికల్లో తానే వైసీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు. గతంలో పొందిన ఓటముల కంటే.. ఈ ఓటమి దగ్గుబాటిని బాగా కుంగదీసింది. రాష్ట్రమంతా వైసీపీ గెలవడం, తనకు మాత్రం అదృష్టం కలిసి రాకపోవడంతో తీవ్ర నిరాశలో ఉండిపోయారు వెంకటేశ్వరరావు.

ఇక పురందేశ్వరి సంగతి సరేసరి. కాంగ్రెస్ హయాంలో కేంద్ర మంత్రిగా పదవి అనుభవించిన ఆమె.. తర్వాత బీజేపీలో చేరారు. కేంద్రంలో తమ పార్టీ అధికారంలో ఉంది అని చెప్పుకోవడం మినహా రాష్ట్రంలో ఆమె చేయగలిగిందేమీ లేదు. కనీసం టీడీపీతో కలసి అధికారాన్ని పంచుకున్న టైమ్ లో కూడా ఆమెకు కలిగిన రాజకీయ ప్రయోజనం శూన్యం. ఇప్పుడు అదీలేదు. ఆమధ్య కొన్నిరోజులు పర్యటనలు, యాత్రలు అంటూ హడావిడి చేసిన పురందేశ్వరి ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అయ్యారు.

అటు వెంకటేశ్వరరావు మాత్రం ఎమ్మెల్సీ పదవిపై ఆశ పెట్టుకున్నట్టు తెలుస్తోంది. గతంలో తనకేమీ హామీ లభించనప్పటికీ.. సీఎం జగన్ ని కలసి ఆయన రిక్వెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటికే జగన్ దగ్గర హామీల జాబితా చాంతాడంత ఉంది. వారందర్నీ కాదని జస్ట్ ఎన్నికలకు ముందు పార్టీలోకి వచ్చిన ఎన్టీఆర్ అల్లుడికి ఎమ్మెల్సీ ఇచ్చే సాహసం జగన్ చేస్తారా అనేది తేలాల్సి ఉంది.

ఒకవేళ జగన్ వచ్చే దఫా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వెంకటేశ్వరరావుకి ఛాన్స్ ఇస్తే.. పొలిటికల్ గా దగ్గుబాటి కుటుంబం మళ్లీ నిలదొక్కుకునే అవకాశం ఉంటుంది. లేకపోతే పేరుగొప్ప, ఊరు దిబ్బ అన్నట్టుగా మాజీ కేంద్రమంత్రి, మాజీ రాష్ట్ర మంత్రుల కుటుంబంగా దగ్గుబాటివారు మిగిలిపోవాల్సిందే. 

చిరంజీవి గారి వల్లనే అవన్నీ సాధ్యం అయ్యాయి