తెలంగాణ రాష్ట్రంలో మరింత బలపడే దిశగా భారతీయ జనతా పార్టీ వ్యూహాత్మకంగా కదులుతోంది. అలాగని కేంద్రంనుంచి తెలంగాణ ప్రజల మీద ప్రత్యేకమైన ప్రేమ కురిపిస్తున్నదని అనుకుంటే పొరబాటు. పార్టీ బలపడడం అంటే.. ఇతర పార్టీల నుంచి నాయకులను చేర్చుకోవడం మాత్రమే అనేదే సిద్ధాంతంగా వ్యవహరిస్తున్న ఆ పార్టీలోకి తాజాగా తెరాస నుంచి మాజీ ఎంపీ జి. వివేక్ కూడా చేరారు. తెలంగాణ రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న వివేక్ రాక తమకు అదనపు బలం అవుతోందని కమలదళం కలలు కంటోంది.
వివేక్ రాక ద్వారా… తెలంగాణ భాజపాలో దళిత నాయకత్వలేమి తీరినట్లు అవుతుంది. ఇప్పుడు పార్టీకి రాష్ట్రంలో అనేకమంది నాయకులున్నా… దళిత సామాజికవర్గంనుంచి తక్కువ. అలాంటి నేపథ్యంలో ఆర్థికబలం పుష్కలంగా ఉన్న వివేక్ చేరిక వారికి ఆనందంగా ఉంది. నిజానికి తెలంగాణ భాజపా తమ పార్టీ ప్రచారం కోసం సొంత మీడియా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచనతో చాలాకాలంగా ఉంది. సొంత టీవీ ఛానెల్ పెట్టుకోవాలని, సొంత పత్రికా వ్యవస్థ కూడా ఏర్పాటు చేసుకోవాలని వారు ఆలోచిస్తూ వచ్చారు.
ఛానెల్ ఏర్పాటుకు ప్రయత్నాలు, ఉన్న చానెళ్లను కొనుక్కోవడానికి బేరసారాలు కూడా నడిచాయి. అయితే ఇప్పుడు ఒక టీవీ న్యూస్ ఛానెల్ వి6, దినపత్రిక వెలుగు లకు యజమాని అయిన జి.వివేక్ వచ్చి పార్టీలో చేరడంతో వారికి వెదకబోయిన తీగ వచ్చి కాలికే తగిలినట్లయింది. అలాగని జి.వివేక్ ఏదో అభిమానంతో భాజపాలోకి వచ్చి చేరారని అనుకోవడానికి వీల్లేదు. తెరాసలోకి చాలా ఆశలతోనే వెళ్లినప్పటికీ.. ఆయన అటూ ఇటూ ఊగిసలాడుతూనే వచ్చారు.
గ్రాండ్ గులాబీ పార్టీలోకి వెళ్లి, సోనియా తెలంగాణ ఇవ్వగానే తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. పార్టీ ఓడిపోగానే.. తిరిగి కేసీఆర్ పంచకు వచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో సోదరుడికి టికెట్ నిరాకరించే సరికి చాలా నిరసన వ్యక్తంచేశారు. ఎంపీ ఎన్నికల్లో కూడా తనకు అవకాశం లేకపోయాక.. ఇక గత్యంతరం లేకుండాపోయింది. అయితే కాంగ్రెస్ కూడా ఆయనకు గేలం వేస్తున్నప్పటికీ.. ఆ పార్టీకి భవిష్యత్తు లేదనుకుని, ఆయన భాజపాను ఎంచుకోవడమే.. వారికి కొంత ఊరట.