ఆర్టికల్ 370ని రద్దు చేయడం ద్వారా… భారతీయ జనతా పార్టీకి దేశవ్యాప్తంగా ప్రజలదృష్టిలో ఒక రకమైన హీరోయిక్ ఇమేజి వచ్చింది. అందులో సందేహం లేదు. ఇది ఎంతో కొంత రాజకీయంగా కూడా వారికి మైలేజీ పెంచుతుంది. అదేసమయంలో.. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో కూడా రాజకీయంగా కమలదళం బలపడడానికి ఈ నిర్ణయం ఉపకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో కూడా గౌరవప్రదమైన సీట్లు సంపాదించుకుని, మెహబూబా ముఫ్తీతో కలిసి ప్రభుత్వంలో భాగస్వామి అయిన కమలదళం.. ఈసారి అసెంబ్లీ ఎన్నికలు జరిగే నాటికి సొంతంగానే… ప్రభుత్వంలోకి వచ్చేంతగా బలపడ్డానికి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగే ఆలోచనతో ఉన్నట్లు ఢిల్లీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో అసెంబ్లీకి ప్రస్తుతం మొత్తం 87 స్థానాలు ఉన్నాయి. ఈ అసెంబ్లీకి ఆరేళ్లకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయనే సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం అక్కడ రాష్ట్రపతి పాలన నడుస్తోంది. త్వరలోనే ఎన్నికలు నిర్వహిస్తాం అంటూ.. మొన్నటి ప్రసంగంలో ప్రధాని వారికి భరోసా ఇచ్చారు కూడా! కానీ ఆ రాష్ట్ర విభజన చట్టంలోనే రాష్ట్ర అసెంబ్లీ స్థానాలను పెంచే ప్రతిపాదనను కూడా జోడించారు. దానిని బట్టి జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ స్థానాలు ప్రస్తుతం ఉన్న 87 నుంచి 114 కు పెరుగుతాయి. మోడీ త్వరగా నిర్వహిస్తాం అని చెప్పినప్పటికీ.. నియోజకవర్గాలు పెరిగితే తప్ప ఎన్నికలు నిర్వహించకూడదు అనేది భాజపా వ్యూహం. అప్పటిదాకా అక్కడ కేంద్రపాలనే సాగుతుంటుంది.
అసెంబ్లీ నియోజకవర్గాలను పెంచడంలో భాజపా వ్యూహం మొత్తం దాగి ఉంది. జమ్మూకాశ్మీర్ ను సుదీర్ఘకాలంగా గుప్పిటపెట్టుకుని ఉన్న సాంప్రదాయ ప్రాబల్యానికి గండికొట్టేలాగా ఆ పెంపు ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జమ్మూకాశ్మీరును స్థూలంగా మూడు భాగాలుగా చూడాలి. జమ్మూ, కాశ్మీరు మరియు లడాఖ్. లడాఖ్ లో 4 అసెంబ్లీ సీట్లున్నాయి. ఇప్పుడది అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతం అయింది గనుక.. ఆ నాలుగు సీట్లు ఆవిరైపోయినట్లే. ఇక పోతే జమ్మూకాశ్మీర్ సంగతి. ఈ రెండు ప్రాంతాల్లో చెరి పది జిల్లాలు ఉన్నాయి.
జమ్మూ ప్రాంతపు పది జిల్లాల్లో 37 అసెంబ్లీ సీట్లుండగా, కాశ్మీరు ప్రాంతంలో 46 అసెంబ్లీ సీట్లున్నాయి. ఈ 83 సీటలను విభజించి 114 తయారు చేస్తారు. అయితే కొత్తగా ఏర్పడబోయే వాటిలో జమ్మూ ప్రాంతం పదిజిల్లాలకు ఎక్కువ సీట్లు, కాశ్మీరు ప్రాంతం పది జిల్లాలకు తక్కువ సీట్లు ఏర్పాటయ్యే అవకాశం ఉంటుందని అనుమానాలున్నాయి. సాధారణంగా జమ్మూలో హిందువుల సంఖ్య ఎక్కువ గనుక.. భాజపా ప్రాబల్యం బాగా ఉంటుంది.
కాశ్మీరులో మాత్రం ముస్లింల ప్రాబల్యం ఉంటుంది. ఈ సమీకరణలను దృష్టిలో ఉంచుకుని.. కాశ్మీరు రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మార్చేయడానికి జమ్మూలో ఎక్కువ అసెంబ్లీ సీట్లు ఏర్పాటయ్యేలా పునర్విభజన ఉంటుందనే అంచనాలు సాగుతున్నాయి. అంటే.. జమ్మూ – కాశ్మీర్ ప్రాంతాల వాటాలు మారుతాయన్నమాట.