సంక్షేమంతో పాటు స్వావలంబన.. జగన్ ఆశ ఇదే

నవరత్నాల అమలు కోసం ఓ వైపు విధి విధానాలు ఖరారవుతున్నా.. సీఎం జగన్ లో మాత్రం ఏదో తెలియని వెలితి కనిపిస్తోంది. ప్రభుత్వమే అన్ని సబ్సిడీలు ఇస్తూపోతే.. రాష్ట్రం అధోగతి పాలవుతుందని, ప్రజల్ని సోమరులుగా…

నవరత్నాల అమలు కోసం ఓ వైపు విధి విధానాలు ఖరారవుతున్నా.. సీఎం జగన్ లో మాత్రం ఏదో తెలియని వెలితి కనిపిస్తోంది. ప్రభుత్వమే అన్ని సబ్సిడీలు ఇస్తూపోతే.. రాష్ట్రం అధోగతి పాలవుతుందని, ప్రజల్ని సోమరులుగా చేస్తున్నారని మేధావివర్గం దెప్పి పొడుస్తోంది. మరోవైపు ప్రభుత్వ పథకాల లబ్ధికోసం ఎంతోమంది ఆశగా ఎదురు చూస్తున్నారనే విషయం “స్పందన” కార్యక్రమానికి వస్తున్న అనూహ్య స్పందన బట్టి అర్థమవుతోంది.

కానీ ప్రజలు నిజంగా ఏది కోరుకుంటున్నారనేదే ప్రధానంగా ఏ ప్రభుత్వమైనా గుర్తించాలి. ఇంటికో మంచి ఉద్యోగం ఉంటే.. ప్రభుత్వ పథకాల లబ్ధిని ఏ కుటుంబమూ కోరుకోదు. అయితే అలాంటి ఉద్యోగాలే ఇప్పుడు కరువయ్యాయి. గత టీడీపీ ప్రభుత్వం పూర్తిగా ఉద్యోగాల కల్పనను అటకెక్కించింది. కంపెనీలు వస్తున్నాయంటూ కబుర్లు చెప్పింది కానీ.. అలా వచ్చిన వాటిలో అరకొర ఉద్యోగాలు, అవీ కిందిస్థాయి సిబ్బందిగా మాత్రమే స్థానికులకు అవకాశాలిచ్చాయి. దీంతో రాష్ట్రానికి పరిశ్రమలు వస్తున్నాయన్న మాటే కానీ రాష్ట్ర ప్రజలకు ఏమాత్రం ఉపయోగంలేదు.

దీనిపైనే సీఎం జగన్ ప్రధానంగా దృష్టిపెట్టారు. 75శాతం స్థానికులకే ఉద్యోగాలనే సంచలన నిర్ణయాన్ని అమలు చేస్తున్నారు. అదే సమయంలో నూతన పరిశ్రమల స్థాపన కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. ఇప్పటికే గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయం ఉద్యోగాలతో రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఏపీపీఎస్సీ ద్వారా కూడా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ఉంటుందని స్పష్టంచేశారు. అదే సమయంలో ప్రభుత్వంపై భారం పడకుండా ప్రజలు నిశ్చింతగా ఉండాలంటే ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల భర్తీ భారీగా జరగాలి. అది జరగాలంటే అదే స్థాయిలో నూతన పరిశ్రమలు, కంపెనీలు ఏపీకి రావాలి.

ప్రత్యేకహోదా వస్తే కంపెనీలన్నీ పరిగెత్తుకుంటూ వస్తాయి. కానీ కేంద్రం పరిస్థితి చూస్తుంటే ఏపీపై కక్ష సాధిస్తున్నట్టు కనిపిస్తుందే కానీ, ఏమాత్రం జాలి చూపడంలేదు. ఇలాంటి సమయంలో జగన్ ఆరాటం, పోరాటం కత్తిమీద సామే. 35 దేశాల ప్రతినిధులతో డిప్లొమాటిక్ ఔట్ రీచ్ ను ఏర్పాటు చేయడం ఇందులో భాగమే. ఓవైపు సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే.. మరోవైపు ఆ పథకాలవైపు ప్రజలు ఆకర్షితులు కాకుండా వారి కుటుంబ ఆదాయం పెరిగేందుకు, ఇంటికో ఉద్యోగం వచ్చేందుకు జగన్ తీవ్రంగా కృషి చేస్తున్నారు.

విభజన తర్వాత రాష్ట్ర ఆర్థిక దురవస్థను గాడిలో పెట్టాలంటే ఇలాంటి నిర్ణయాలే తీసుకోవాలి. ఇలాంటి నాయకుడే కావాలి. సరైన టైమ్ లో మన రాష్ట్రానికి సరైన నాయకుడు వచ్చాడని ప్రజలు పూర్తిస్థాయిలో అర్థం చేసుకునే రోజు ఎంతో దూరంలో లేదు.