cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Gossip

'దేశం' కలవరానికి ఆర్కే వివరణ?

'దేశం' కలవరానికి ఆర్కే వివరణ?

ఈవారంకొత్త పలుకులో రెండు గమ్మత్తయిన సంగతులు ప్రస్తావించారు సీనియర్ జర్నలిస్ట్ కమ్ పత్రికాధిపతి రాధాకృష్ణ అలియాస్ ఆర్కే. ఈ రెండు అంశాలు ఎందుకు ప్రస్తావించారు అన్నది పక్కన పెట్టి, ప్రస్తావించిన అంశాలను చూద్దాం. కోర్టుల్లో ఏ ఒక్క కేసులోనూ ఆంధ్ర ప్రభుత్వ వాదన నెగ్గకపోవడం. అలాగే ఇళ్లపట్టాలు ఇవ్వలేకపోవడం ఎందువల్ల అన్నది. సవివరంగా వివరించారు.

ఇంతకీ ఈ రెండింటీ ఆర్కే వివరణ ఏమిటీ? రాష్ట్ర ప్రభుత్వ వాదనలో పస లేకపోవడం కాదు, వాదనలో లూప్ హోల్స్ వున్నాయి. అందువల్లనే కేసలు నెగ్గడం లేదు. అంతకు తప్ప కోర్టులను చంద్ర బాబునో, మరొకరో మేనేజ్ చేయడం అన్నది కాదు. అన్నది ఒకటి.

అలాగే ఇళ్ల పట్టాలను గతంలో మాదిరిగా ఇచ్చేసి వుంటే సరిపోయేది, ఆస్తి హక్కు మాదరిగా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలనుకోవడం రాజ్యాంగ విరుద్ధం అందుకే చెల్లడం లేదు అన్నది ఇంకో పాయింట్.

ఈ రెండు పాయింట్లు సంగతి తరువాత చర్చిద్దాం. ముందు అసలు ఈ రెండు పాయింట్ల మీద దాదాపు ముప్పావు పేజీ వ్యాసం ఆర్కే ఎందుకు రాయాల్సి వచ్చింది అన్నది కీలకం. ఆయన ఎందుకు రాయాల్సి వచ్చింది అంటే జనాల్లో వున్న అభిప్రాయం లేదా జనాల్లో ఏర్పడుతున్న అభిప్రాయం, లేదా జనాల్లోకి చొచ్చకుపోతున్న లేదా చొప్పిస్తున్న విషయాలు తెలుగుదేశం పార్టీని కలవరపెడతున్నాయి. ఈ కలవరం తగ్గాలంటే వారిపై సరియైన వివరణ ఇవ్వాలి. ఎవరు ఇవ్వాలి? ఎవరి ద్వారా ఇవ్వాలి? ఇంకెవరు..మన ఆర్కే తప్ప అందుకు సమర్థులు ఎవరున్నారు?

కోర్టు కేసులు

మొదటి విషయానికి వస్తే, కోర్టుల్లో ఆంధ్ర ప్రభుత్వం అపజయాల సంగతి అలా వుంచితే, అసలు కోర్టుల దగ్గరకు అన్ని విషయాలు ఏలా వెళ్తున్నాయి. తెలుగుదేశం పార్టీ జనాలో, సానుభూతి పరులో ఏదో రూపంలో ప్రతి దానికీ కోర్టు తలుపులు తట్ట బట్టే కదా? ఈ విషయంలో జనాలకు పూర్తి క్లారిటీ వుంది. సరే ఇక కోర్టులను ఎవ్వరూ మేనేజ్ చేయలేరు అన్న ఆర్కే వాదనతో నేనూ ఏకీభవిస్తాను. కోర్టులను మేనేజ్ చేయలేరు. కానీ జనాల్లో ఆ అభిప్రాయం లేదు. దీనికి పూర్తిగా భిన్నమైన అభిప్రాయం జనాల్లోకి ఎలా వెళ్లిందో వెళ్లిపోయింది. చంద్రబాబు కోర్టులను మేనేజ్ చేసి, జగన్ ను ఇబ్బందుల పాలు చేస్తున్నారన్న అభిప్రాయం కింది స్థాయి వరకు వెళ్లిన మాట వాస్తవం. 

ఇలా వెళ్లింది అన్న విషయాన్ని గ్రహించారు కనుకే ఆర్కే సవివర, సుదీర్ఘ వ్యాసం అందిచాల్సి వచ్చంది. తద్వారా జరుగుతున్న తప్పిదాన్ని సరిదిద్దాలని ప్రయత్నం చేయాల్సి వచ్చింది,. 

ఇళ్లపట్టాలు

ఇళ్లపట్టాల విషయంలో జగన్ తప్పిదం ఇదీ అని ఆర్కే చెప్పింది ఏమిటి? రాజ్యాంగానికి వ్యతిరేకంగా సర్వ హక్కులు కలిగిస్తూ, ఇళ్లపట్టాలు ఇవ్వాలని చూస్తున్నారు ఇది సరికాదు అని. నిజమే జగన్ ఇలా చూడడం ఏమన్నా తప్పా?  ప్రభుత్వం ఇన్నాళ్లు పట్టాల రూపంలో అమ్ముకోవడానికి లేకుండా భూములు పేదలకు ఇస్తోంది. ఎంత మంది పేదలు అమ్ముకోకుండా వున్నారు? ఎంత మంది బడా బడా బాబులు ఇలాంటి పట్టాభూములు కొన్నారు. ఇది వాస్తవం కాదా?

దీని మీద ఓ సమగ్ర ఎంక్వయిరీ చేయిస్తే, వేలాది ఎకరాలు బడా బాబుల చేతుల్లోంచి వెనక్కు తీసుకోవచ్చు. ఎందుకంటే పట్టాభూముల కొనడం చెల్లదు కదా? కానీ ఇలా తీసుకుంటాం అంటే మళ్లీ అదోగొడవ.మళ్లీ కోర్టు. కేసు. మొట్టికాయి. సరే ఎలా ఇచ్చినా అమ్ముకునేవాళ్లు అమ్ముకుంటారు. కనీసం వుంచుకునేవాళ్లు వారసత్వపు హక్కుగా తరతరాలు ఉంచుకుంటారు అన్నది జగన్ ఆలోచన.

ఇది రాజ్యాంగ విరుద్ధమా కాదా అన్నది పక్కన పెడితే ఓ మంచి పనిపై కోర్టుకు ఎందుకు వెళ్లాలి? ఇప్పుడు ఆర్కే ఎంత సుదీర్ఘ వివరణ ఇచ్చినా, జనాల్లో తమకు ఇళ్లపట్టాలు రాకుండా చేసింది చంద్రబాబ, తెలుగుదేశం అనే భావనను తుడిచివేయగలరా? ఈ విషయం జగన్ కూడా గ్రహించినట్లున్నారు. అందుకే ఇళ్లపట్టాల పంపిణీకి ఆయనేమీ తొందరపడడం లేదు. ప్రతి ఊరులో ఊరిస్తున్నట్లు రెడీ అయిన లేఅవుట్ లు చూసి, జనాల మనసుల్లో చంద్రబాబు మీద, తెలుగుదేశం మీద వ్యతిరేకత అంతకంతకూ పెరుగుతూనే వుంటుంది. పైగా ఈ లే అవుట్ ల తయారీ అయితే ఆగలేదు. మరింతగా ముస్తాబయి రెడీ గా వున్నాయి.

కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఇళ్లపట్టాల కోర్టు కేసు అంశం చంద్రబాబుకు మైనస్ అవుతుంది తప్ప ప్లస్ కాదు కాక కాదు. ఒకవేళ తమ ప్రభుత్వం వచ్చాక ఇళ్లపట్టాలు ఇస్తామని హామీ ఇచ్చినా, చంద్రబాబును నమ్మరు. ఎందుకంటే ఆపేసింది ఆయనే అని జనం నమ్ముతున్నారు కనుక.

మొత్తం మీద కోర్టు కేసులపై జనాల్లో వున్న అభిప్రాయాన్ని, ఇళ్ల పట్టాల పంపిణీ నేపథ్యంలో జనాల్లో చంద్రబాబు, తెలుగుదేశం పట్ల పెరుగుతున్న వ్యతిరేకతను ఆర్కే గమనించారు. ఆర్కే గమరించారు అంటే చంద్రబాబు గమనించినట్లే. ఆర్కే వివరణ ఇవ్వడానికి చాలా కష్టపడ్డారు. ఆయన అంత కష్టపడ్డారు అంటే ఈ విషయమై చంద్రబాబు గట్టగా కలవరపడుతున్నట్లే. 

అంటే మొత్తం మీద కోర్టుల్లో గెలవకపోయినా, జగన్ కు ఆశించిన ఫలితం దక్కతోంది అనుకోవాలేమో?

ఆర్వీ