Advertisement

Advertisement


Home > Politics - Gossip

'దేశం' ఉచ్చులో పడుతున్న జగన్?

'దేశం' ఉచ్చులో పడుతున్న జగన్?

శాసనసభ సమావేశాల నిర్వహణ విషయంలో ముఖ్యమంత్రి జగన్, ఆయన సహచరులు నేరుగా వెళ్లి తెలుగుదేశం వ్యూహంలో పడుతున్నట్లు కనిపిస్తోంది. శాసనసభ సమావేశాలను ఏమాత్రం ఏకస్వామ్యం కాకుండా, ప్రజాస్వామ్య బద్ధంగా, పద్దతిగా నిర్వహిస్తామని ముందుగానే జగన్ ప్రకటించారు. అయితే సభల నిర్వహణలో కావచ్చు, సభల్లో వ్యవహరించే విషయాల్లో కావచ్చు, తెలుగుదేశం రకరకాల వ్యూహాలు పన్నడంలో ఆరితేరిపోయింది. ఈ విషయంలో వైకాపాకు కాస్త అనుభవ రాహిత్యం వుంది. అది అంగీకరించాల్సిదే. అలాగే స్పీకర్ తమ్మినేని కూడా కాస్త సాత్విక వైఖరితో ముందుకు వెళ్తున్నారు.

ఇలాంటి నేపథ్యంలో తెలుగుదేశం తమ వ్యూహాలకు పదును పెట్టినట్లు కనిపిస్తోంది. కేవలం 23 మంది సభ్యులు, అందులోనూ మాట్లాడేవారు గట్టిగా ముగ్గురు నలుగురు మాత్రమే వున్నారు. ఇలాంటినేపథ్యంలో లెక్కప్రకారం సభ సైలంట్ గా, స్మూత్ గా నడచిపోవాలి. అలా జరిగిపోతే మరునాడు మీడియాలో ఏం హడావుడి వుంటుంది? తెలుగుదేశం పార్టీ ఫుల్ యాక్టివ్ గా వుందన్న కలరింగ్ ఎక్కడి నుంచి వస్తుంది.

అంతకు మించిన వైనం ఇంకోటి వుంది. ఆది నుంచీ జగన్ మీద, వైకాపా మీద తేదేపా చేస్తున్న తప్పుడు ప్రచారంలో రౌడీయిజం, పులివెందుల సంస్కృతి అనే వ్యవహారం కూడా వుంది. విశాఖలో విజయమ్మ పోటీ చేసినపుడు, ఇదే ప్రచారం చేసి ఆమె ఓటమికి కిందామీదా కష్టపడ్డారు. ఇప్పుడు తెలుగుదేశం అసలు వ్యూహం ఇదే.

జగన్ వచ్చిన తరువాత రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులపై దాడులు పెరిగాయి. భయంకరంగా రౌడీయిజం చేస్తున్నారు అన్నది జనాల్లోకి వెళ్లాలి. అదే సమయంలో అసెంబ్లీలో కూడా వైకాపా జనాలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు, వాళ్ల భాష ఇలా వుంది అలా వుంది, రుబాబు ఓ రేంజ్ లో వుంది అన్నది బయటకు  వెళ్లాలి. అలా వెళ్లాలి అంటే వైకాపా సభ్యులను రెచ్చగొట్టాలి.

ఇప్పుడు తేదేపా అదే చేస్తోంది. అనుభవ రాహిత్యంతో వైకాపా జనాలు ఆ ఉచ్చులో పడి తాము కూడా రెచ్చిపోతున్నారు. కానీ మర్నాడు తెలుగుదేశం అనుకూల మీడియాలో ఒకవైపు వెర్షన్ మాత్రం బయటకు వస్తోంది. అయితే సోషల్ మీడియాలో కొంతవరకు మొత్తం సీన్ వీడియాలు వస్తున్నాయి కాబట్టి, డ్యామేజ్ కంట్రోల్ లో వుంటోంది.

ఏమయినా, ఈ విషయంలో జగన్ కాస్త వ్యూహరచన చేసి, తేదేపా వ్యూహాన్ని భగ్నం చేయలేకపోతే, జనాల్లోకి తెలుగదేశం పార్టీ అనుకున్న వెర్షన్ మాత్రమే వెళ్లే ప్రమాదం వుంది.

మళ్ళీ ఆత్మగౌరవం నినాదం.. మారానని ప్రచారం

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?