ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ రానున్న రోజుల్లో వైసీపీని వీడుతారనే ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారానికి బలం కలిగించేలా మద్దిశెట్టి వైసీపీతో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ , పార్టీ కార్యక్రమాల్లో ఆయన పెద్దగా పాల్గొనడం లేదు. ముఖ్యంగా వైసీపీలో ఆధిపత్య పోరే మద్దిశెట్టి అసంతృప్తికి కారణంగా చెబుతున్నారు. మద్దిశెట్టి వైసీపీలో వుండరనే సమాచారం అధిష్టానానికి చేరవేసినట్టు తెలిసింది.
త్వరలో జరగనున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాధినేతకు సంబంధించిన దినపత్రికను ప్రజలకు ఉచితంగా పంచేందుకు ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లతో రాష్ట్ర వ్యాప్తంగా డబ్బు కట్టించుకున్నారు. అయితే దర్శి ఎమ్మెల్యే మాత్రం ప్రభుత్వాధినేత పత్రికను ఉచితంగా పంచడానికి ముందుకు రాకపోవడం, ఆయన భవిష్యత్ ఆలోచనను తెలియజేస్తోందనే చర్చ నడుస్తోంది. ప్రభుత్వాధినేత పత్రికను ఉచితంగా పంచేందుకు ఆయన ఆసక్తి చూపకపోవడం ద్వారా, వైసీపీలో తాను ఉండడం లేదనే సంకేతాలను ఆయన పరోక్షంగా పంపినట్టైంది.
మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డితో ఎమ్మెల్యేకు అసలు పొసగడం లేదు. దర్శి ఎమ్మెల్యేగా తనకు ఎలాంటి పవర్స్ లేకుండా, అంతా మాజీ ఎమ్మెల్యే, ఆయన కుటుంబ సభ్యులే పెత్తనం చెలాయిస్తున్నారనే ఆవేదన వేణుగోపాల్‌లో వుంది. సీఎం వైఎస్ జగన్ అండ చూసుకుని, తనను కాదని బూచుపల్లి కుటుంబం చెలరేగిపోతోందని మద్దిశెట్టి వేణుగోపాల్ ఆరోపణ. మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్‌రెడ్డి తల్లి వెంకాయమ్మ ప్రస్తుతం జిల్లా పరిషత్ చైర్‌పర్సన్.
దీంతో దర్శిలో పాలనాపరమైన ఆధిపత్య పోరు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య సాగుతోంది. జిల్లా పరిషత్ నిధుల్ని ఎమ్మె ల్యేకు సంబంధం లేకుండా నేరుగా కేటాయిస్తున్నారు. ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వకుండా, ఆయనతో సంబంధం లేకుండా జిల్లా పరిషత్ నిధులతో పనులు కూడా చేస్తున్నారు. దీంతో ఇక తానెందుకని ఎమ్మెల్యే ప్రశ్నిస్తున్నారు. అలాగే దర్శి డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి బదిలీపై కూడా ఎమ్మెల్యే కినుక వహించారు.
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి కోరిక మేరకు దర్శి డీఎస్పీ నారాయణస్వామిరెడ్డిని ఒంగోలుకు బదిలీ చేశారు. ఇదే సందర్భంలో దర్శి డీఎస్పీగా అశోక్‌వర్ధన్‌ను దర్శికి ఎమ్మెల్యేతో సంబంధం లేకుండా బదిలీ చేశారు. దర్శి డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన అశోక్‌వర్ధన్ స్థానిక ఎమ్మెల్యేను కాకుండా, అమరావతికి వెళ్లి వైవీ సుబ్బారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇలాంటివన్నీ వైసీపీపై ఎమ్మెల్యే అసంతృప్తికి కారణమయ్యాయి. దర్శి ఎమ్మెల్యే రానున్న రోజుల్లో టీడీపీ లేదా జనసేనలో చేరొచ్చని సమాచారం.ఈ ఏడాది చివరికి దర్శి ఎమ్మెల్యే కీలక నిర్ణయం తీసుకోనున్నారని ఆయన వర్గీయులు బహిరంగంగానే చెబుతున్నారు.