రాజధానిపై భయాల వ్యాప్తి ఆపండి!

అమరావతిలో రాజధాని ఉండబోవడం లేదు, దానిని తరలించేస్తున్నారు.. అంటూ భారీ ఎత్తున ప్రతిపక్షాలు ప్రచారం సాగించాయి. అయితే ముఖ్యమంత్రి మాత్రం ఇలాంటి ప్రచారం పట్ల పెదవి విప్పలేదు. కాకపోతే.. వ్యయం విషయంలో మాత్రం వృథా…

అమరావతిలో రాజధాని ఉండబోవడం లేదు, దానిని తరలించేస్తున్నారు.. అంటూ భారీ ఎత్తున ప్రతిపక్షాలు ప్రచారం సాగించాయి. అయితే ముఖ్యమంత్రి మాత్రం ఇలాంటి ప్రచారం పట్ల పెదవి విప్పలేదు. కాకపోతే.. వ్యయం విషయంలో మాత్రం వృథా కాకుండా ఉండడానికి తగు జాగ్రత్తలు తీసుకుంటూనే ఉన్నారు.

తాజాగా రాజధాని ప్రాంతంలో రోడ్లు, మౌలికవసతులు అభివృద్ధి చేయడానికి ఐఐటీనుంచి నిపుణుల్ని కూడా పిలిపిస్తున్నారు. ఇలాంటి కసరత్తు జరుగుతుండగా.. రాజధాని గురించి ఇంకా ప్రజల్లో భయాలు రేకెత్తించాలనే దురాలోచనలను విపక్షాలు మానుకోవాలి.

అడ్డదిడ్డంగా గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను చక్కదిద్దడంలోనే జగన్ ప్రభుత్వానికి కాలయాపన అవుతోంది. కాంట్రాక్టుల విషయంలో భారీగా దోపిడీకి పాల్పడ్డారనే ఆరోపణలూ ఉన్నాయి. రివర్స్ టెండరింగ్ లతో వాటన్నింటినీ చక్కదిద్దేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. కొన్ని ఇప్పటికే సత్ఫలితాలను ఇచ్చాయి.

రాజధాని ప్రాంతంలో గత ప్రభుత్వం తలపెట్టిన హేపీ నెస్ట్ ప్రాజెక్టుకు కూడా రివర్స్ టెండర్లు పిలవాలని ప్రస్తుత ప్రభుత్వం యోచిస్తోంది. జగన్మోహనరెడ్డి ఇప్పటికే రాజధాని ప్రాంతంలో సగంలో నిర్మాణాలు కొనసాగించాలని ఆదేశాలు ఇచ్చారు. మరోవైపు రాజధాని ప్రాంతంపై ప్రభుత్వం ఏర్పాటుచేసిన కమిటీ అధ్యయనం కూడా కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో విపక్షాలు ఇంకా రాజధాని అంశాన్ని పట్టుకుని ఊరేగడం విజ్ఞత అనిపించుకోదు.

ఒకవైపు అవినీతి జాడలను జాగ్రత్తగా చెరపివేస్తూనే మరోవైపు రాజధాని పనులను కొనసాగించాలని జగన్ ప్రభుత్వం అనుకుంటోంది. ప్రభుత్వం ప్లాన్ చేస్తున్న ప్రకారం.. రోడ్లు, మౌలిక వసతులు అన్నీ అనుకన్నట్లే జరుగుతాయి గానీ.. దశలవారీగా జరుగుతాయి.

ఒకదశ వరకు రోడ్లు పూర్తిచేసి.. నగర ఏర్పాటుకు అందుబాటులోకి తెచ్చిన తర్వాత… కాలక్రమంలో అవే రోడ్లను విస్తరించి.. పూర్తిస్థాయికి అభివృద్ధి చేయడం లక్ష్యంగా ఇలా ప్లాన్ చేస్తున్నారు. పాజిటివ్ గా చూసినప్పుడు.. ఇలాంటి ఏర్పాటు వల్ల ప్రభుత్వం మీద ఆర్థిక భారం పడకుండా.. పనులు ఆగిపోయే ప్రమాదం లేకుండా.. చేస్తున్నారని అనిపిస్తుంది.