చంద్రబాబు ఇంటిపై డ్రోన్ ఎగిరింది, ఆ ఎగరేసినోళ్లకి ముఖ్యమంత్రి జగన్ కీ లింకు ఉంది. బాబుని చంపాలని చూస్తున్నారు, జగన్ పేరు కూడా ఎఫ్ఐఆర్ లో చేర్చాల్సిందేనంటూ రంకెలేస్తున్నారు అచ్చెన్నాయుడు సహా కొంతమంది టీడీపీ నేతలు. ఈ మేరకు ఇప్పటికే గవర్నర్ ని కలసి ఫిర్యాదు కూడా చేశారు. బాబు ఇంటిపై డ్రోన్ ఎగిరిన కేసులో జగన్ ని కూడా ముద్దాయిని చేయాలంటున్నారు. పోనీ జగన్ ని కూడా విచారించాల్సిందే అనుకుందాం. కేవలం డ్రోన్ ఎగిరితేనే అంత రాద్ధాంతం చేస్తున్నారే, మరి జగన్ పై జరిగిన హత్యాయత్నం సంగతేంటి.
అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ఎయిర్ పోర్ట్ ఆవరణలో జగన్ పై కత్తివేటు పడితే దానికి వైసీపీ నేతలు ఎవరిపై కేసుపెట్టాలి. అప్పుడు అధికారంలో ఉంది చంద్రబాబే కాబట్టి, జగన్ కి ఏదైనా జరిగితే అది పరోక్షంగా టీడీపీకే లాభం కాబట్టి.. లెక్కప్రకారం చంద్రబాబుపై కేసుపెట్టాలి. అంటే జగన్ కి ఒక న్యాయం, చంద్రబాబుకి ఒక న్యాయమా? ఇప్పుడు డ్రోన్ మాత్రమే ఎగిరింది, అప్పుడు ఏకంగా జగన్ పై కత్తిపోటు పడింది. సో.. ఎవరి ప్రాణాలకు ముప్పు, ఎవరిది హత్యాయత్నం.
జగన్ పై హత్యాయత్నం జరిగితే దాన్ని కోడి కత్తి కేసు అంటూ అవహేళన చేసింది పచ్చ బ్యాచ్. అనుకూల మీడియాతో అదే రకంగా ప్రచారం చేయించింది. హత్యాయత్నానికి కారణం కుటుంబ సభ్యులు కావచ్చేమోనంటూ శాడిజాన్ని కూడా ప్రదర్శించారు టీడీపీ నేతలు. ఇప్పుడు వైసీపీ వాళ్లు కూడా డ్రోన్ ఎగరేసింది నారా లోకేష్ అంటే చంద్రబాబు ఊరుకుంటారా? నందమూరి కుటుంబంలోనే చంద్రబాబు అంటే గిట్టనివారెవరో డ్రోన్ తో వివరాలు సేకరించబోయారని ఆరోపిస్తే వాళ్లకు ఎలా ఉంటుంది?
జగన్ పై జరిగిన అంత పెద్ద హత్యా ప్రయత్నాన్ని మసిపూసి మారేడుకాయ చేసి, కామెడీ చేయాలని చూసిన టీడీపీ నేతలు, ఇంత చిన్న డ్రోన్ వ్యవహారానికి ఎగిరెగిరి పడుతున్నారంటే ఏమనాలి? దిక్కుమాలిన, సిగ్గులేని రాజకీయం అనాలా వద్దా? డ్రోన్ కేసు పేరుతో జగన్ పై లేనిపోని నిందలేయాలని చూస్తున్న టీడీపీ నేతలు, కనీసం ప్రజలు ఏమనుకుంటారోనన్న ఇంగితం కూడా మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు.