ముఖ్యమంత్రిగా తన తొలి ప్రసంగంలోనే ఎమ్మెల్యేల పవర్ కట్ చేశారు జగన్. అధికారులకు అడ్డు తగలొద్దని, వారి నిర్ణయాలకు అడ్డు చెప్పొద్దని, రికమండేషన్లు, రిఫరెన్స్ లు చెల్లవని కరాఖండిగా చెప్పేశారు. అవినీతి, ఆశ్రిత పక్షపాతానికి చోటులేకుండా చేయాలన్న జగన్ నిర్ణయం సరైనదే, కానీ దాని అమలులో మాత్రం లోపాలు ఇప్పుడిప్పుడే బైటపడుతున్నాయి. స్థానిక నేతల జోక్యం తగ్గిపోయేసరికి అధికారులు ఆడింది ఆట, పాడింది పాటగా మారుతోందని కొన్ని జిల్లాల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి.
ఉన్నతస్థాయి అధికారులు కొన్నిచోట్ల ఎమ్మెల్యేల మాట పూర్తిస్థాయిలో పెడచెవిన పెడుతున్నారట. దీంతో అటు కార్యకర్తలకు సర్దిచెప్పుకోలేక, ఇటు ఆఫీసుల్లో పనులు చేయించుకోలేక సతమతమవుతున్నారు స్థానిక నేతలు. పోనీ అధికారులేమైనా అంత నిక్కచ్చిగా పనిచేస్తున్నారా అంటే అదీ లేదు. రేపు-మాపు అంటూ అందర్నీ తిప్పించుకుంటున్నారు. దీంతో చంద్రబాబు హయాంలో జరిగిందే మళ్లీ రిపీటవుతోందని అంటున్నారు వైసీపీ నేతలు. సీఎం జగన్ ని ఏమార్చేలా నివేదికలు పంపడంలో అధికారులు బిజీ అయిపోతున్నారని ఆరోపిస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా స్పందన కార్యక్రమం సక్సెస్ అయిందని, 90 శాతానికి పైగా సంతృప్తిగా ఉన్నారని ఇటీవల సాక్షాత్తూ సీఎం జగన్ సెలవిచ్చారు. అయితే జిల్లాల్లో పరిస్థితి వేరు. ముఖ్యమంత్రి చెప్పినట్టు అంతమంది సంతృప్తిగా ఉంటే, అన్ని ఫిర్యాదులు పరిష్కారం అయ్యి ఉంటే.. క్రమంగా స్పందనకి జనంరాక తగ్గాలి. కానీ ఈ రోజుకీ వేలాది మంది ప్రజలు అర్జీలు చేతబట్టుకుని గ్రీవెన్స్ డేకి హాజరవుతున్నారు. గతంలో కంటే జనాల సంఖ్య భారీగా పెరిగింది.
అలాంటప్పుడు స్పందనపై జగన్ చేతికి అందిన నివేదికల మాటేంటి? అధికారులు మసిపూసి మారేడుకాయ చేసినట్టే కదా. ఇది మాత్రమేకాదు, చాలాచోట్ల సమస్యలను పరిష్కరించే మార్గం ఉన్నా కూడా ఏదో ఒక సాకుతో ఫిర్యాదుల్ని బుట్టదాఖలు చేయడానికే అధికారులు ప్రయత్నిస్తున్నారు. అవకాశం ఉన్నా కూడా కొన్ని పనులు కావు అని చెప్పేసి, ఫిర్యాదుల్ని క్లోజ్ చేస్తున్నారు. దీంతో నివేదికల్లో.. అపరిష్కృతంగా ఉన్న సమస్యల సంఖ్య సున్నాగా కనపడుతోంది. అంటే అధికారులు బాగా పనిచేసినట్టు అన్నమాట.
అయితే వాస్తవం స్థానిక నేతలకు మాత్రమే తెలుసు. దీంతో మరోసారి బాధితులు ప్రజా ప్రతినిధుల వైపే చూస్తున్నారు. తమకు సిఫార్సు చేసిపెట్టమని అడుగుతున్నారు. ఈ అవకతవకలపై నేరుగా సీఎంకే ఫిర్యాదు చేయడానికి రెడీ అవుతున్నారు ఎమ్మెల్యేలు. అధికారులపై పెత్తనం చెలాయించం కానీ, తాము స్థానికంగా పరిస్థితుల్ని సమీక్షిస్తామని చెప్పబోతున్నారు. చేతులు కాలకముందే ఆకులు పట్టుకుందామని అధినేతకు వివరించబోతున్నారు.