తెలంగాణలో దుబ్బాక ఎన్నిక ప్రకటించిన దగ్గర నుంచి పవన్ పై పలు గ్యాసిప్ లు. భాజపాతో పొత్తు వున్న కారణంగా జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ అక్కడ ప్రచారానికి వెళ్తారని.
కానీ విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం పవన్ కళ్యాణ్ దుబ్బాకలో భాజపా కోసం ప్రచారం చేయబోవడం లేదు. ఈ విషయంపై ఆయన టీఆర్ఎస్ అధినాయకత్వానికి క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
దుబ్బాక ప్రచారానికి వస్తున్నట్లు వినివస్తున్న వార్తలు నిజమేనా? అని టీఆర్ఎస్ కు చెందిన కొందరు పవన్ తో వున్న సాన్నిహిత్యంతో ఆయను అడిగినట్లు, ఆ ఆలోచనే లేదు అని పవన్ వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది.
నిజానికి భాజపాతో ఇటీవల పవన్ సన్నిహితంగా వుండడం, తెలంగాణ భాజపా లీడర్లు కూడా పవన్ ను కలుస్తుండడం అన్నీ కలిసి దుబ్బాక ఎన్నిక ప్రచారం బరిలోకి పవన్ వస్తారన్న వార్తలకు దారి తీసాయి.
పైగా ఇటీవల తెలంగాణ జనసేన కమిటీలను కూడా పవన్ నియమించారు. ఇవన్నీ హైదరాబాద్ నగర ఎన్నికలను దృష్టిలో వుంచుకుని చేస్తున్నారని పవన్ తన పార్టీ ని ఎన్నికల బరిలోకి దింపుతారని వార్తలు వినవచ్చాయి.
కానీ దుబ్బాక విషయంలో క్లారిటీ ఇచ్చేసినట్లు తెలుస్తోంది. పైగా తెరాస పాలన బాగుందని చెబుతూ నిన్నటికి నిన్నే కోటి రూపాయల విరాళం కూడా పవన్ ప్రకటించారు.
మొత్తానికి పవన్ క్యాంప్ నుంచి వస్తున్న సమాచారం అయితే, సమీప భవిష్యత్ లో పవన్ తెలంగాణలో ఎటువంటి ఎన్నికల హడావుడిలో తలదూర్చడం లేదని తెలుస్తోంది. జనసేన నేరుగా 2024 ఎన్నికల్లో అది కూడా ఆంధ్రలో మాత్రమే రంగంలోకి దిగుతుందని బోగట్టా.