రాగాల పూలతోట – భాగేశ్వరి

2020 అక్టోబర్ 12: విజయవాడ వెళ్తున్నాం కారులో. తెనాలి గాయకుడు, మిత్రుడు సాబిర్ మహమ్మద్ డ్రైవ్ చేస్తున్నాడు. సాహిత్య సంగీత స్పెషల్ శివలెంక పావనీ ప్రసాద్ ముందు సీట్లో, నేను వెనక. Advertisement పావనీ ప్రసాద్…

2020 అక్టోబర్ 12: విజయవాడ వెళ్తున్నాం కారులో. తెనాలి గాయకుడు, మిత్రుడు సాబిర్ మహమ్మద్ డ్రైవ్ చేస్తున్నాడు. సాహిత్య సంగీత స్పెషల్ శివలెంక పావనీ ప్రసాద్ ముందు సీట్లో, నేను వెనక.

పావనీ ప్రసాద్ ఒక పల్లవి పాడారు. సాబిర్ చరణం అందుకున్నాడు. అలా వో నాలుగు పాటలు. ఇవన్నీ భాగేశ్వరి రాగం.. తెలుసా?అన్నారు.

నేను రెండు పాటలు గుర్తు చేశాను. అమ్మో, మీకెలా తెలుసు అన్నారు.

తుచ్ఛ‌మైన జర్నలిస్టువి కదా, స్వచ్ఛ‌మైన సంగీతంతో నీకేం పని? అని దానర్థం. అవమానాన్ని దిగమింగి కక్షతో రగిలిపోయిన ఆ క్షణాల్లోనే, నా ప్రియురాలు భాగేశ్వరి గురించి రాయాలని డిసైడైపోయాను. దాదాపు 3 గంటల సేపు భాగేశ్వరి లోని సినిమా పాటలతో ప్రయాణం సాగిపోయింది.

ఆర్ట్ సినిమా, నిజమైన సాహిత్యం లాగే సీరియస్ శాస్త్రీయ సంగీతం యవ్వనంలోనే నా తల నిమిరి దగ్గరికి తీసుకుంది. 1978లో విశాఖ 'ఈనాడు'లో చేరాక  నాలుగైదేళ్ళ పాటు గొప్ప కచేరీలకు వెళ్లాను.

79 – 80లో మా సుశీలక్క దగ్గరికి విజయనగరం వెళ్లినపుడు, ఆ సాయంకాలం ఎం ఎల్ వసంతకుమారి సంగీత కచేరి…. నాలుగు గంటల సేపు దాదాపు నాన్ స్టాప్ గా PURE CLASSICAL గంగా ప్రవాహం. జనం వూగిపోయారు. మంచి గంధం లాంటి సంగీతాన్ని, శ్రీవిద్యనీ మనకి కానుకగా ఇచ్చిన తల్లి ఎం.ఎల్.వసంతకుమారి.

మరో చల్లని సాయంకాలం ఆంధ్రా యూనివర్సిటీ లో రవిశంకర్ కచేరీ. రూపాయి ఖర్చు లేకుండా రవిశంకర్ కచేరి వినడం, అదీ ముందు వరసలో కూర్చుని! రవిశంకర్ పక్కన గ్రేస్ ఫుల్ గా ఉన్న బట్టతలాయన లాల్చీవెనక్కి మడిచిన చేతులతో రెండు తబలాలనీ ప్రేమగా నిమురుతున్నాడు – వాడు అల్లారఖా!

45 నిమిషాలు సితార తో మైమరిపించాక రవిశంకర్ చిన్నగా నవ్వి “నువ్వు కానీ ఇక” అన్నట్టుగా చేతితో సైగ చేశాడు. అందుకున్నాడు అల్లారఖా. 45 నిమిషాల సేపు అల్లారఖా సోలో! ఈ చెవులు నమ్మలేకపోయాయంటే నమ్మండి. మాషా అల్లా!

ఇక సితార కన్నతండ్రి, తబలా పెదనాన్న…ఇద్దరూ కలిసి మరో గంటన్నర – పక్కనున్న సముద్రం కెరటాలు కెరటాలుగా కచేరీ హాల్లోకి చొరబడిపోయినట్టు, అమృతం తాగడం అంటే ఏమిటో అవగతమవుతున్నట్టు, ఆ రెండు జతల చేతులు పట్టుకొని మబ్బుల్లో నడుస్తున్నట్టు, జాకీర్ హుస్సేన్ అనే ఒక చిన్న పిల్లాడు మా వెంటపడి వస్తున్నట్టు… శ్రీశ్రీ అన్న దివ్యానుభవం ఇదేనేమో!

****

విశాఖలోనే డీకే పట్టమ్మాళ్, ఎమ్మెస్ సుబ్బులక్ష్మి, బాలమురళీకృష్ణ, ఈమని శంకరశాస్త్రి…ఇంకా ఎందరో, ఎన్ని కచేరీలో… ఎంత ఆత్మానందం మూటగట్టుకున్నానో. మా అమ్మ ఎంత పుణ్యం చేసుకుందో… అనిపించేలా.

విజయవాడలో చిట్టిబాబు వీణ, ఐదుగురు కొడుకులతో బిస్మిల్లా ఖాన్ షెహనాయీ, కళాక్షేత్రంలో పర్వీన్ సుల్తానా అమరగానం, రవీంద్ర భారతిలో జస్రాజ్ పాట తెల్లవారి పోయేదాకా, దుర్గా జస్రాజ్  పక్కనే తంబురాతో …. సంతూర్ మాస్త్రో పండిత్ శివ కుమార్ శర్మ హృదయ రాగం…

రోజులు ఎలా గడిచిపోయాయో! , అటు జర్నలిజం అనే కడుపు వృత్తి, ఇటు సంగీతం అనే ఆత్మసంతృప్తి!

ఈ రెండిటి మధ్య సినిమా పాట అనే  కక్కుర్తి ఒకటి ఉంటుంది. అది వినోదమూ, మరియు రాగసుధా భరితము!

NEWS TO INFORM NOT TO ENTERTAIN అని పెద్ద జర్నలిస్టులు అంటుంటారు. శాస్త్రీయ సంగీతం నిన్ను మానవుణ్ణి చేస్తుంది. సినిమా పాట నీ బుగ్గలు గిల్లి, చక్కిలిగిలి పెట్టి, వినోదం అంటూ మత్తుగా కన్నుగీటుతుంది. జర్నలిజం వినోదం అయిన రోజుల్లో, సినిమా పాట వికృతంగా నవ్వుతున్న కాలంలో – కొన్ని మంచి పాటల్ని గుర్తు చేసుకుందాం.

అదిగో… రాగాలు తీస్తూ వస్తోంది 'భాగేశ్వరి'.

కేవలం స్వరాలు ప్రాతిపదికగా కాకుండా, రాగఛాయల్ని మూర్చనల ద్వారా మనసుతో గుర్తించగలగాలి. భక్తి, కరుణరస ప్రధానమైన రాగం యిది. ఎక్కువ టెంపోలో కాకుండా లలితంగా ఆలపిస్తారు. అప్పుడది మన ప్రాణేశ్వరి అవుతుంది.

మొదటిసారి, అక్బర్ దర్బారులో తాన్ సేన్ ఆలపించాడని అంటారు. ఇది ఉత్తర భారత హిందుస్తానీ సంప్రదాయ రాగం. దక్షిణాదిలో కొంత లేటుగానే అడుగు పెట్టింది.

'గులేబకావళి' అనే పాత తమిళ సినిమాలో “మయక్కుమ్ దు మా ళై పొళుదు” అనే శ్రావ్యమైన పాటతో 'భాగేశ్వరి' దక్షిణాదిని పలకరించింది.

జిక్కి, ఏ ఎం రాజా పాడారు. విశ్వనాథన్, రామ్మూర్తి మనకిచ్చిన 'తొలి రాగం' యిది. ప్రసిద్ధ సంగీత దర్శకుడు సీ. రామచంద్ర ఏ పాట కంపోజ్ చేయాలన్నా ముందుగా 'భాగేశ్వరి'లో వరస కుదురుతుందేమో అని ఆలోచించేవాడు. ఆయన భాగేశ్వరితో వూడిగం చేయించి ఎన్నో మధుర గీతాలని మనకందించాడు.

****
* విరహ వేదనతో ప్రియుని కోసం అభిసారిక ఆలపించే కరుణ రసాత్మక రాగం 'భాగేశ్వరి'.

* నీకోసమె నే జీవించునది … మాయాబజార్, ఘంటసాల సంగీతం. లీల, ఘంటసాల పాడారు.

* అలిగితివా సఖీ ప్రియా … శ్రీకృష్ణార్జునయుద్ధం, సంగీతం పెండ్యాల. పాడింది ఘంటసాల.

* 'గీతాంజలి'లో ఆమనీ పాడవే హాయిగా… ఇళయరాజా బాణీ, బాలు పాడారు.

* సాగరసంగమం లో నాదవినోదము నాట్య విలాపము… కూడా ఇళయరాజానే. గానం బాలు.

* 'రాము'లో ఎం ఎస్ విశ్వనాథన్ తమిళ పాట , నిలవే ఎన్నిడం నెరుంగాదె … పి.బి.శ్రీనివాస్ పాడారు. అదే తెలుగులో మంటలు రేపే నెలరాజా.. ఈ తుంటరి తనమూ…

* అమరశిల్పి జక్కన్నలో సుశీల పాట నగుమోము చూపించవా గోపాలా… వసంతసేనలో కిలకిల నగవుల నవమోహినీ… రెండూ ఎస్.రాజేశ్వరరావు కట్టినవే!

* 'శోభ'లో ఘంటసాల పాడిన, అందాలు చిందించు సీమలో… ఈ రాగమే.

* 'బొంబాయి'లో చిత్ర పాడిన రెహమాన్ పాట కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే…

* లవకుశలో లీల, సుశీల పాడిన రామ సుగుణధామ… ఘంటసాల సంగీతం. ఇలా తమిళ, తెలుగు, హిందీ సినిమాల్లో హృద్యమైన ఈ రాగానికి ఎన్ని పరిమళాలు పూయించారో మన సంగీత దర్శకులు.

హిందీ సినిమాల్లో సూపర్ హిట్లు

* 'సఫర్'లో ఆర్.డి బర్మన్, కిషోర్ కుమార్ గొంతులోంచి ఒంపిన జీవన్ సె భరీ తేరీ ఆంఖే…

* మధుమతిలో లతా మంగేష్కర్ తో సలీల్ చౌధురి పిలిపించిన … ఆజారే పరదేశీ – మైతొ కబ్సె ఖడీ ఇస్పార్.., ఘడీ ఘడీ మొర దిల్ ధడ్ కె … రెండూ ఆ రాగమే!

* 'జహాన్ ఆరా'లో మదన్మోహన్ – తలత్, లతతో హృదయాల్ని పిండేసేలా పాడించిన – ఫిర్ వహీ షామ్, వహీ గమ్..,

* 'దేఖ్ కబీరా రోయీ'లో హమ్ సె ఆయా న గయా.. అని తలత్ తో పాడించిందీ మదన్మోహనే!

* నాబోలె నాబోలె నాబోలెరే… 'ఆజాద్' సినిమాలో లతతో సి రామచంద్ర చేయించిన విన్యాసం – అదే తెలుగులో – రావోయి రావోయి ఓ మాధవా… అంటూ చింతామణిలో భానుమతి పాడింది.

* సీనే మె జలన్ – ఆంఖో మె తుఫాన్ సె క్యూ హై … 'గమన్'లో సురేష్ వాడేకర్ తో భాగేశ్వరిని పలికించాడు జయదేవ్.

*వసంత్ దేశాయ్ గుర్తున్నాడా?
'ఝనక్ ఝనక్ పాయల్ బాజే'లో నైన్ సె నైన్ నహీ మిలావో … అని లత, హేమంత్ కుమార్ లతో పాడించాడు. వాళ్ళిద్దరితోనే అనార్కలిలో సి రామచంద్ర జాగ్ దర్ దె ఇష్క్ జాగ్ … వినిపించాడు.

'రాజ్ హథ్' సినిమాలో శంకర్ జైకిషన్ , ఆయే బహార్ బన్ కె లుబాకర్ చలే గయే…  అంటూ రఫీ తో సమ్మోహనంగా పాడించాడు.

ఈ పాటలన్నీ ఒకే రాగం అని శ్రోత గుర్తించగలిగినపుడు అందులోని అంతర్ లయ, సొగసు, హొయలు అనుభవంలోకి వచ్చి, ఒక అపూర్వమైన ఆనందంతో  హృదయం తొట్రు పడుతుంది.

DISCLAIMER :

మన సంగీతం, రాగాలు బాగా తెలిసిన వాళ్ల కోసం ఇది రాయలేదు. శృతిమించిన 'అతి' పాటలు పాడుకుంటున్న యువతరానికి కొన్ని మంచి పాటల్నీ, భాగేశ్వరి సొగసునీ పరిచయం చేసే ప్రయత్నమే ఇది. ఈ రాగం ఎన్ని వైవిధ్యాల హొయలు పోతుందో, అలాగే ఈ పాటల్లోని సాహిత్యమూ వేదనననీ, విషాదాన్నీ, కించిత్ ఆనందాన్నీ మనకి పంచి ఇస్తుంది.

నాకు రాని, నాకు తెలీని చిత్రలేఖనం, సంగీతం గురించి పట్టుదలతో, శ్రద్ధతో తెలుసుకునే ప్రయత్నం మాత్రం చేశాను.

TAADI PRAKASH