పాపం టీడీపీ… పార్టీలో ప్రెస్ మీట్ డ్యూటీలు

ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ తరపున మాట్లాడేందుకు అధికార ప్రతినిధులు, మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు పోటీ పడేవారు. రాష్ట్ర కార్యాలయంలో పచ్చ బ్యాక్ గ్రౌండ్ ముందు కూర్చుని మాట్లాడటం అంటే అదో గొప్ప హోదాగా పరిగణించేవారు.…

ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ తరపున మాట్లాడేందుకు అధికార ప్రతినిధులు, మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు పోటీ పడేవారు. రాష్ట్ర కార్యాలయంలో పచ్చ బ్యాక్ గ్రౌండ్ ముందు కూర్చుని మాట్లాడటం అంటే అదో గొప్ప హోదాగా పరిగణించేవారు. జిల్లా నాయకులకు రాష్ట్ర కార్యాలయ పరిధిలో ప్రెస్ మీట్ పెట్టే అవకాశం అంత తేలిగ్గా లభించేది కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. టీడీపీలో గొంతులు మూగబోయాయి.

మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరూ మీడియా ముందుకు రావడంలేదు, ఆఖరికి పోలిట్ బ్యూరో సభ్యులు కూడా పార్టీ తరపున మాట్లాడ్డానికి నామోషీగా ఫీలవుతున్నారు. ఓవైపు చంద్రబాబు నానా తంటాలు పడుతుంటే సొంత బామ్మర్ది, కొడుకు కూడా పక్కన లేకుండాపోవడం.. అధినాయకుడి దుస్థితిని తెలియజేస్తోంది. దీంతో ఇప్పుడు జిల్లా నాయకులకు పార్టీ ఆహ్వానాలు పంపుతోంది. రారండోయ్ ప్రెస్ మీట్ పెడతాం అంటూ జిల్లా, మండలస్థాయి నాయకులను పిలుస్తున్నారు. ఔత్సాహికుల లిస్ట్ తీసుకుని డ్యూటీలు కూడా వేస్తున్నారు. దీంతో ఇటీవల టీడీపీ ప్రెస్ మీట్లు, లైవ్ షోలు బాగానే పెరిగిపోయాయి.

ఆమధ్య కాలంలో మాజీ మేయర్ పంచుమర్తి అనురాధ మాత్రమే ప్రెస్ మీట్లతో హడావిడి చేస్తూ కనిపించేవారు. ఇప్పుడా స్థానంలో చాలామంది నేతలు కనిపిస్తున్నారు. జిల్లానేతలు మీడియాతో మాట్లాడేందుకు గుంటూరుకు పిలుస్తున్నారంటూ సంతోషంగా కదులుతున్నారు. మొత్తమ్మీద టీడీపీలో సెకండ్ గ్రేడ్ నాయకులకు మంచిరోజులొచ్చాయని అనుకుంటున్నారు.

మెయిన్ స్ట్రీమ్ అంతా సైలెంట్ అయ్యేసరికి, ఇప్పుడు జిల్లానాయకులపై చంద్రబాబు ఆధారపడాల్సి వస్తోంది. అందుకే జిల్లా పర్యటనలతో పార్టీలో కదలిక తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు చంద్రబాబు. కష్టకాలంలో పార్టీకి సహకరించనివారిని కూడా బాబు ఓ కంట కనిపెడుతున్నారని తెలుస్తోంది.

వైసీపీతో మంతనాలు జరుపుతున్నవారి లిస్ట్ కూడా బాబు దగ్గర రెడీగా ఉంది. ఏం తెలుసుకున్నా, ఎంత తెలుసుకున్నా చంద్రబాబు చేసేదేం లేకపోవడమే ఇక్కడ చిత్రమైన విషయం. 

సినిమా రివ్యూ: ఆర్‌డిఎక్స్‌ లవ్‌