Advertisement

Advertisement


Home > Politics - Gossip

పాతిక లక్షలిస్తావా.. పవన్ ని పిలవాలా..?

పాతిక లక్షలిస్తావా.. పవన్ ని పిలవాలా..?

జనసేనాని పవన్ కల్యాణ్ రాజకీయాలు చూస్తూ ఆ పార్టీలో సీరియస్ పొలిటీషియన్లెవరూ ఉండాలనుకోవడంలేదు. కాసేపు రాష్ట్ర సమస్యలపై విపరీతమైన ఫోకస్ చూపించే పవన్ కల్యాణ్, మరికొన్నిరోజులు ఇవేవీ పట్టనట్టు సుప్త చేతనావస్థలోకి వెళ్లిపోతున్నారు, ఇంకొన్ని రోజులు ఆధ్యాత్మిక పర్యటనలతో కాలం గడుపుతున్నారు. పవన్ కల్యాణ్ సీజన్డ్ పొలిటీషియన్ గా చేస్తున్న పనులు సొంతపార్టీ నేతలకే రుచించడంలేదు. అందుకే ఆకుల వంటి నేతలు సేఫ్ సైడ్ చూసుకున్నారు. ఆయన బాటలో చాలామంది నడవడానికి సిద్ధమయ్యారు. మరికొందరు మాత్రం తమకేం పట్టనట్టు పార్టీతో అంటీముట్టనట్టుగా ఉన్నారు. ఇదే టైమ్ లో జనసేనకు కొత్త సమస్య వచ్చి పడింది.

అధినాయకత్వం సరిగా లేకపోవడంతో.. జిల్లాల్లో బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు ఎక్కువైపోయాయి. విద్యాసంస్థలు, కార్పొరేట్ ఆస్పత్రులు, వివిధ ప్రైవేట్ కంపెనీల దగ్గర జనసేన పేరు చెప్పి మామూళ్లు వసూలు చేసే వ్యవహారం జోరందుకుంది. పార్టీల పేరు చెప్పి ఫండ్ అడగడం, ఏదైనా వివాదం వచ్చినప్పుడు సర్దిచెప్పడానికి తమకూ వాటా కావాలని అడగడం ఓ స్థాయి నేతలకు అలవాటైన వ్యవహారమే. అయితే జనసైనికులు, ఆ పార్టీ నేతలు కొన్ని జిల్లాల్లో మరీ బరితెగిస్తున్నారు.

నెల్లూరుజిల్లాలో డ్రగ్స్ కేసులో ఇటీవల ఓ విద్యాసంస్థ పేరు బైటకు రావడంతో.. జనసేన నేత ఒకరు రంగంలోకి దిగారు. 25లక్షల రూపాయలు ఆ సంస్థనుంచి డిమాండ్ చేశారు. లేకపోతే పవన్ కల్యాణ్ ని జిల్లాకు పిలిపించి ధర్నా చేయిస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా గత ఎన్నికల్లో బరిలో దిగిన ఆ యువ నాయకుడు మరీ ఇంత చీప్ గా ప్రవర్తించడం, పవన్ కల్యాణ్ పేరు చెప్పి వసూళ్లు చేయాలనుకోవడం జిల్లాలో చర్చనీయాంశమైంది. ఇది కేవలం నెల్లూరు జిల్లాకే పరిమితమైన వ్యవహారం కాదు, రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల్లో జనసేనలో ఉన్న మిగులు జనాలు ఇలాగే బ్లాక్ మెయిలింగ్ లకు దిగుతున్నట్టు ఫిర్యాదులొస్తున్నాయి.

విద్యార్థి విభాగాలు అదిరించి, బెదిరించి మామూళ్లకు దిగడం సహజమే. ఇప్పుడు వీటికి తోడు జనసేన కూడా తయారైంది. అధినాయకత్వం పట్టించుకోక పోవడం, జిల్లాలకు నాయకులు లేకపోవడం, ఉన్నా ఎవరి పనుల్లో వారు బిజీగా ఉండటంతో.. పవన్ కల్యాణ్ పేరు చెప్పి మరీ జనసైనికులు దందాలకు దిగుతున్నారు. జనసేనను బ్లాక్ మెయిలింగ్ పార్టీగా మార్చేస్తున్నారు. ఇటీవల పార్టీ ఫండ్ పేరుతో వసూలు చేసిన లక్షల రూపాయలు జనసేన కార్యాలయానికి అందకుండా మధ్యలోనే మాయమయ్యాయి.

ఫిర్యాదులు రావడంతో పవన్ కూడా బహిరంగ ప్రకటన ఇచ్చారు. ఆన్ లైన్లోనే పార్టీ ఫండ్ స్వీకరించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడీ బ్లాక్ మెయిలింగ్ వ్యవహారాలను కూడా పవన్ ఓ కంట కనిపెట్టడం మంచిది. 

సినిమా రివ్యూ: ఆర్‌డిఎక్స్‌ లవ్‌

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?