మౌలికంగా ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకోసం సుదీర్ఘంగా చిత్తశుద్ధితో పోరాడిన నాయకుడు. అసలే ఆయన హరీష్ రావుకు అనుకూలుడైన నాయకుడు అని తొలినుంచి ఒక ప్రచారం ఉంది. కొత్తగా ఆయన మీద అవినీతి పరుడనే ముద్రవేసే ప్రయత్నమూ జరిగింది. దాన్ని అనుసరించి.. ఆయన మంత్రిపదవి మీద వేటు పడుతుందనే ప్రచారాన్ని షురూచేశారు. కొత్తగా ఆయన మీద.. పార్టీ మీద తిరుగుబాటు చేస్తున్నట్లుగా మరికొన్ని వ్యాఖ్యానాలు జత చేస్తున్నారు. ఇన్ని రకాల వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్న వ్యక్తి.. తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్.
ఈటల రాజేందర్ ఇప్పుడు తెలంగాణలో వార్తల్లో వ్యక్తిగా మారారు. తెలంగాణ రాష్ట్ర సమితి రాజకీయం మొత్తం ఆయన చుట్టూతానే తిరుగుతోంది. పార్టీలో ఏ ఇద్దరు కలిసినా ఈటల గురించే మాట్లాడుకుంటున్నారు. ఈటల మీద సానుభూతి వ్యక్తం చేస్తున్నవాళ్లు.. చేసింది తప్పే అంటున్న వాళ్లు .. ఇలాగే జరుగుతోంది. ఈటల భావోద్వేగంలో మాట్లాడేయడమూ.. తర్వాత నాలిక్కరుచుకుని.. ఆ మాటల్ని దిద్దుకునే ప్రయత్నం చేయడమూ జరుగుతోంది.
ఈటల రాజేందర్‌పై డెక్కన్ క్రానికల్ లో ఒక కథనం వచ్చినప్పటినుంచి ఇదంతా మొదలైంది. సోషల్ మీడియా విచ్చలవిడిగా దానిని ప్రచారం చేసింది. ఈలోగా.. కేసీఆర్ కేబినెట్ విస్తరణకు ప్రయత్నిస్తున్నారనే సమాచారం బయటకు రాగానే.. ఈటలకు ఉద్వాసన తప్పదనే కథనాలు కూడా మీడియాలో వెల్లువెత్తాయి.
హుజూరాబాద్ లో తెరాసలోకి కాంగ్రెసు నాయకుల చేరిక సందర్భంగా.. గురువారం నిర్వహించిన సభలో.. ఈటెల మరింత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన మేమే.. గులాబీ జెండాకు యజమానులం అన్నట్లుగా ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్రమైన చర్చకు దారితీశాయి. పార్టీ మీద ఆయన తిరుగుబాటు జెండా ఎగరేస్తున్న సంకేతాలు.. సోషల్ మీడియా ద్వారా వ్యాపించాయి.
సాయంత్రానికి ఈటల నష్టనివారణకు మరో ప్రెస్ నోట్ ఇవ్వాల్సి వచ్చింది. తాను కేవలం గులాబీ సైనికుడిని మాత్రమే. తమ నాయకుడు ఎప్పటికీ కేసీఆరే. తనమాటలను వక్రీకరించి.. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారు… అంటూ అందులో వివరించారు. మొత్తానికి ఈటల వివాదం పర్యవసానంగా తెరాసలో కీలక పరిణామాలు జరిగేలా ఉన్నాయి.