ఇల్లలకగానే పండగ కాదు అనేది సామెత… తమ విజయాల గురించి అత్యుత్సాహానికి గురయ్యే వాళ్లను ఉద్దేశించిన సామెత ఇది. అయితే.. అంతకంటె ఎక్కువ ఉత్సాహం కనబరిచే వాళ్లను ఏమనాలి? ఏమోగానీ.. నారా లోకేష్ మాత్రం ఆ కేటగిరీలోకే వస్తాడు. అధికార వికేంద్రీకరణ బిల్లును శాసనమండలి సెలక్ట్ కమిటీకి పంపినందుకే.. ఆయన పండగ చేసుకుంటున్నారు. అమరావతి రైతులనుంచి సన్మానాలు చేయించుకుంటున్నారు.
నేటి రాజకీయంలో భజన పర్వం ఎక్కువైపోయింది. ఒక అంశం మీద పోరాటం సాగిస్తే అందులో సీరియస్ నెస్ ఉండడంలేదు. ఏదో ఉబుసుపోక ఆందోళనలు చేస్తున్నట్లుగా ఉంది. అంశాన్ని వదిలేసి ఇతర విషయాల మీద వారు ఫోకస్ పెడుతున్నారు. అమరావతి ప్రాంత రైతులు రాజధానిని తరలించడానికి వ్యతిరేకంగా.. ఉద్యమిస్తున్నారు. దీక్షలు చేస్తున్నారు. వారి ప్రధాన ఫోకస్ అదే అన్నట్లుగా ఉండాలి.
గురువారం నాడు దీక్షాశిబిరాన్ని సందర్శించడానికి లోకేష్ తదితరులు వచ్చేసరికి.. దీక్షలు చేస్తున్న వారికి ఉత్సాహం హెచ్చింది. పరిపాలన వికేంద్రీకరణ బిల్లును సెలక్టు కమిటీకి పంపినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ.. వారు లోకేష్ తదితరులకు సన్మానం చేశారు. సదరు తెదేపా ఎమ్మెల్సీలు కూడా.. తామేదో ఘనకార్యం సాధించేసినట్లుగా… చాలా సంతోషంగా సన్మానం చేయించుకున్నారు.
నిజానికి సెలక్టు కమిటీకి పంపడం అనేది.. వారి డిమాండు తీర్చడమూ కాదు, పరిష్కారమూ కాదు.. ఏదో లోకేష్ వచ్చేసరికి… ఆయన ముఖప్రీతికోసం సన్మానం అనుకున్నారు. మండలినుంచి సెలక్ట్ కమిటీకి పంపడం వలన తాము సాధించిందేమీ లేదని స్పష్టంగా తెలిసినప్పటికీ.. లోకేష్ ప్రభృతులు సన్మానం చేయించుకున్నారు. ప్రజలు మాత్రం.. చేసిందేమీ లేకపోయినా సన్మానాలకు ఎగబడ్డం చూసి నవ్వుకుంటున్నారు.