మోడీతో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి భేటీ అయిన తీరు, తదితర ఢిల్లీ పరిణామాలను గమనించిన వైఎస్సార్ సీపీ నాయకులు ఇప్పుడు మహోత్సాహంతో ఉన్నారు. జగన్మోహన రెడ్డి ప్రతిపాదనలకు ప్రధాని నరేంద్రమోడీ నుంచి పూర్తిస్థాయిలో మద్దతు లభించినట్లే అని అనుకుంటున్నారు. కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మునుపెన్నడూ లేనంత మంచి సహకారం ఉంటుందని.. ఆ విషయంలో జగన్ కృతకృత్యుడయ్యాడని అంచనా వేస్తున్నారు. కొందరైతే ఇంకాస్త ముందడుగు వేసి.. మోడీ జగన్ ల మధ్య అప్రకటితంగానే.. పరస్పర సహకారం, స్నేహసంబంధాలు కొనసాగుతాయని అంటున్నారు.
జగన్ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో.. పరిణామాల గురించి ఇలాంటి అంచనాలు, విశ్లేషణలు సాగడంలో వింతేమీ లేదు. కాకపోతే.. ఇటీవలే.. భాజపాతో కొత్తగా బంధం కుదుర్చుకున్న.. జగన్ పేరెత్తితేనే… ఒంటికాలిపై ఎగిరెగిరి పడుతున్న జనసేనాని పవన్ కల్యాణ్ పరిస్థితి ఏమిటి? ఆయన బకరా అయినట్టేనా? అనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.
2019 ఎన్నికల్లో హఠాత్తుగా తన చేతికి అధికారం వచ్చేస్తుందని ఆశపడ్డారో.. లేదా, ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలిస్తే చంద్రబాబు మళ్లీ గద్దెమీదకు వస్తాడని వ్యూహాత్మకంగా అడుగులు వేశాడో కానీ.. పవన్ కల్యాణ్ పార్టీని యాక్టివేట్ చేసి.. అన్ని చోట్ల బరిలోకి దిగాడు. అయితే.. ఈ క్రమంలో పార్టీ వ్యవస్థాగత నిర్మాణం గురించి మాత్రం పట్టించుకోలేదు. ఎవరైనా దాని గురించి గుర్తుచేస్తే వారిని వెటకారం చేశాడు. ఫలితం దారుణాం ఓటమి పాలయ్యారు.
అప్పటినుంచి పార్టీని నడపడం పవన్ కు చిరాకుగానే ఉంది. ఏదో పరువు పోకుండా పట్టుదలగా లాక్కొస్తున్నారు. తాను పార్టీని నడపడం సాధ్యం కాదని అర్థం చేసుకున్న తర్వాతనే.. పలుమార్లు ఢిల్లీ తిరిగి భాజపాతో పొత్తు పెట్టుకున్నారు. నిజానికి అది విలీనం కావల్సినదే కానీ.. ఆ మహూర్తం వాయిదా వేసుకున్నారు. వచ్చే ఎన్నికల్లోగా విలీనం జరుగుతుందనేది ఒక అంచనా.
ఇలాంటి పరిస్థితుల్లో భాజపా, అప్రకటితంగా వైకాపాతో స్నేహం కొనసాగిస్తే పవన్ ఏమైపోవాలి? నిజానికి భాజపాకు, ఎంతోమంది ఎంపీల బలమున్న జగన్ అవసరం. అంతే తప్ప.. పవన్ తో వచ్చే ఎన్నికల దాకా పెద్ద పనిలేదు. ఆ మేరకు అతను బకరా అయినట్లేనా? అని ప్రజలు అనుకుంటున్నారు.