హుజూర్ నగర్ లో అలాంటి సహకారాలుంటాయా?

లోక్ సభ ఎన్నికల సమయంలో.. తెలంగాణలోని కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు లోపాయి కారీగా సహకరించుకున్నాయని తెలంగాణ రాష్ట్ర సమితి వాదిస్తూ ఉంటుంది. నిజామాబాద్ లో బీజేపీ విజయానికి కాంగ్రెస్ పార్టీ సహకారమే…

లోక్ సభ ఎన్నికల సమయంలో.. తెలంగాణలోని కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు లోపాయి కారీగా సహకరించుకున్నాయని తెలంగాణ రాష్ట్ర సమితి వాదిస్తూ ఉంటుంది. నిజామాబాద్ లో బీజేపీ విజయానికి కాంగ్రెస్ పార్టీ సహకారమే కీలకమని టీఆర్ఎస్ నేతలు చెబుతూ ఉంటారు. బీజేపీకి అంత సీన్ లేదని, తాము ఎలాగూ గెలవలేమని భావించి కాంగ్రెస్ పార్టీ వాళ్లు బీజేపీకి సహకారం అందించారని.. టీఆర్ఎస్ ను ఓడించాలే లక్ష్యంతో వారు ఒక్కటయ్యారని ఆరోపిస్తూ ఉంటారు.

ఏతావాతా కాంగ్రెస్, బీజేపీలకు ఉమ్మడి శత్రువు అయిన టీఆర్ఎస్ ను ఓడించే లక్ష్యంతో ఆ రెండు పార్టీలూ చేతులు కలిపాయనే విశ్లేషణ ఒకటి ఉండనే ఉంది. అది పెద్ద ఆశ్చర్యకరమైనది ఏమీకాదు. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు హుజూర్ నగర్ లో అలాంటి సహకారాలుంటాయా? అనేది ఆసక్తిదాయకంగా మారింది.

హుజూర్ నగరర్ లో సాగుతున్న ఉప ఎన్నికలో ఇప్పుడు పోటీ రెండు పార్టీల మధ్యనే మారింది. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యనే ప్రధాన పోటీ నెలకొని ఉంది. ఇక్కడ బీజేపీ, తెలుగుదేశం పార్టీలు కూడా నామినేషన్లు వేసినా.. ప్రచారంలోనే అవి వెనుకబడిపోయాయి. జనాలు కూడా కాంగ్రెస్,టీఆర్ఎస్ ల మధ్యనే ఎవరో ఒకరు అన్నట్టుగా ఉన్నారు.

ఈ నేపథ్యంలో కొద్దో గొప్పో ప్రచారం చేసి ఓటు బ్యాంకును సమీకృతం చేసుకున్న బీజేపీ, తెలుగుదేశం పార్టీలు ఎవరికి సహకారం అందిస్తాయనేది ఆసక్తిదాయకంగా మారింది. ఎలాగూ తెలుగుదేశం పార్టీకి డిపాజిట్ రావడం కూడా కష్టమే. ఇక తెలంగాణ రాష్ట్ర సమితి ఓటమిలో తమ విజయాన్ని చూసుకోవాలనుకుంటున్న బీజేపీ ఏం చేస్తుందనేది కూడా ఆసక్తిదాయకంగా మారింది. పోలింగ్ కు సమయం ఆసన్నమవుతున్న వేళ అంతర్గత రాజకీయాలు ఫలితాన్ని ప్రభావితం చేస్తాయని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

రాంగ్ రూట్లో బాబు ఆత్మశోధన