వారసత్వ రాజకీయాలకు తాము వ్యతిరేకం అంటూ భారతీయ జనతా పార్టీ వాళ్లు ప్రకటించుకుంటూ ఉంటారు. ఒకసారి కాదు.. ప్రతిసారీ ఇదేమాటే. తమ రాజకీయ ప్రత్యర్థులందరినీ ఈ విషయంలోనే విమర్శలు చేస్తూ ఉంటారు. వారివన్నీ కుటుంబ పార్టీలు అంటూ ధ్వజమెత్తుతూ ఉంటారు. కాంగ్రెస్ ను విమర్శించాలన్నా, ఇతర పార్టీలను విమర్శించాలన్నా.. బీజేపీ వద్ద కుటుంబ రాజకీయాలు అనే ఆయుధం రెడీగా ఉంటుంది.
అయితే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా కుటుంబ రాజకీయాలకు అతీతం ఏమీకాదు. దేశంలో తరచిచూస్తే చాలామంది బీజేపీ నేతల వారసులు రాజకీయాల్లో తనమునకలైన కనిపిస్తారు. చాలా మంది నేతల కూతుళ్లు, కొడుకులు ప్రత్యక్ష రాజకీయాల్లో రచ్చచేస్తూ ఉన్నారు. అయినా బీజేపీ ఇతర పార్టీలను ఇదే అంశంలో విమర్శలు చేస్తూ ఉంటుంది!
ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఏకంగా అమిత్ షా తనయుడు జై షా రంగంలోకి దిగడం చర్చనీయాంశంగా మారింది. ప్రత్యక్ష రాజకీయాల వైపు రాకపోయినా.. రాజకీయాలు ఎక్కువగా ఉన్న వ్యవహారంలోకి జై షా దిగుతున్నాడు. బీసీసీఐ సెక్రటరీగా ఆయన నియామకం లాంఛనమే.
ఇదంతా ఒక డీల్ అని, ఆ డీల్ లో భాగంగానే అమిత్ షా తనయుడికి ఆ పదవి దక్కుతోందని మీడియాలో కథనాలు వస్తూ ఉన్నాయి. ఈ విషయంపై చిదంబరం తనయుడు కార్తీ కూడా స్పందించేశాడు. ఇదేంటి.. అంటూ ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఇలా బీజేపీ వాళ్ల రాజకీయ వారసత్వాలు చర్చలోకి వస్తున్నాయి.
ఇక బీసీసీఐలో మరింతమంది బీజేపీ వాళ్లు కూడా పాగా వేశారు. ఇప్పటికే ఒకసారి ఆ సంస్థ ప్రెసిడెంట్ గా చేసిన అనురాగ్ ఠాకూర్ బీజేపీ ఎంపీనే. ఇప్పుడు ఆయన తమ్ముడికి ఆ సంస్థలో కీలక పదవి దక్కుతోందట! ఇదీ కమలనాథుల వారసత్వ రాజకీయం అని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.