Advertisement

Advertisement


Home > Politics - Gossip

జీడీనెల్లూరు టీడీపీ అభ్య‌ర్థి నామినేష‌న్ వేస్తే... అన‌ర్హ‌త వేటే!

జీడీనెల్లూరు టీడీపీ అభ్య‌ర్థి నామినేష‌న్ వేస్తే... అన‌ర్హ‌త వేటే!

ఉమ్మ‌డి చిత్తూరు జిల్లా గంగాధ‌ర‌నెల్లూరు (జీడీనెల్లూరు) టీడీపీ అభ్య‌ర్థి వీఎం థామ‌స్‌ను టీడీపీ అధిష్టానం ప‌క్క‌కు త‌ప్పిస్తోందా? అంటే... ఔన‌నే స‌మాధానం వ‌స్తోంది. జీడీనెల్లూరు ఎస్సీ రిజ‌ర్వ్‌డ్ నియోజ‌క‌వ‌ర్గం. ఇక్క‌డి నుంచి వైసీపీ త‌ర‌పున డిప్యూటీ సీఎం నారాయ‌ణ‌స్వామి కుమార్తె కృపాల‌క్ష్మి పోటీ చేస్తున్నారు. టీడీపీ అభ్య‌ర్థిగా థామ‌స్ పేరును చంద్ర‌బాబు ఖ‌రారు చేశారు. బాగా డ‌బ్బున్న వ్య‌క్తి కావ‌డంతో చాలా కాలం క్రిత‌మే థామ‌స్‌కు బాబు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు.

అయితే ఆయ‌న్ను ఇటీవ‌ల కాలంలో మ‌త మార్పిడి అంశం వెంటాడుతోంది. థామ‌స్ ఎస్సీ కాద‌ని రుజువు చేసే ఆధారాలున్నాయంటూ కొంత మంది ప్ర‌జాసంఘాల నాయ‌కులు వాటిని మీడియాకు అంద‌జేశారు. థామ‌స్ క్రిస్టియ‌న్ మ‌తం తీసుకున్న‌ట్టు గెజిట్‌ను కూడా జైహింద్ పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్య‌క్షుడు అక్కిలిగుంట మ‌ధు,  హిందూ ధ‌ర్మ ప‌రిర‌క్ష‌ణ స‌మితి క‌న్వీనర్ మిట్ట‌ప‌ల్లి స‌తీష్‌రెడ్డి బ‌య‌ట పెట్టారు. అలాగే థామ‌స్ ఎస్సీ కాద‌ని, బీసీ కిందికి వ‌స్తార‌ని రుజువు చేసే ప‌త్రాలతో వైసీపీ కూడా సిద్ధంగా వుంది.

ఈ నేప‌థ్యంలో థామ‌స్‌పై అన‌ర్హ‌త వేటు వేసే ప్ర‌మాదం వుంద‌ని మాజీ మంత్రి అమ‌ర్‌నాథ్‌రెడ్డి అధిష్టానం దృష్టికి తీసుకెళ్లిన‌ట్టు తెలిసింది. దీంతో ఎందుకైనా మంచిద‌ని మాజీ ఎమ్మెల్యే ఆర్‌.గాంధీతో నామినేష‌న్ వేయించిన‌ట్టు స‌మాచారం. ఈ నెల 23న నామినేష‌న్ వేస్తాన‌ని థామ‌స్ ప్ర‌చారం చేసుకుంటున్నారు. ఒక‌వేళ వేసినా ఆయ‌న మ‌త మార్పిడిపై ఫిర్యాదు చేయ‌డానికి వైసీపీ నాయ‌కులు అన్ని ఆధారాల‌తో సిద్ధంగా ఉన్నారు. ఇది త‌ప్ప‌క వివాదం కానుంది.

అన‌వ‌స‌రంగా రిస్క్ చేయ‌డం ఎందుక‌ని చంద్ర‌బాబు భావిస్తే, థామ‌స్‌ను త‌ప్పించి, గాంధీకి బీఫామ్ అంద‌జేసే అవ‌కాశం వుంది. అలా కాకుండా రిస్క్ అయినా ఫ‌ర్వాలేదని చంద్ర‌బాబు భావిస్తే థామ‌స్‌ను కొన‌సాగించే అవ‌కాశాలున్నాయి. నామినేష‌న్ల ప‌రిశీల‌న‌లో ఏమ‌వుతుంద‌నేది త‌ర్వాతి విష‌యం. ఎందుకంటే  క్రిస్టియ‌న్‌గా మతం మార్చుకుంటే బీసీగా ప‌రిగ‌ణిస్తార‌నే ఆధారాల‌తో స‌హా వైసీపీ వాదించ‌డానికి సిద్ధంగా వుంది. జీడీనెల్లూరు అభ్య‌ర్థి థామ‌స్‌ను ఎట్టి ప‌రిస్థితుల్లోనూ కొన‌సాగించ‌డానికి వీల్లేద‌ని టీడీపీ అధిష్టానానికి మాజీ మంత్రి అమ‌ర్‌నాథ్‌రెడ్డి తేల్చి చెప్పిన‌ట్టు స‌మాచారం.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?