తనకు కొత్తగా పదవి వచ్చిన నాటినుంచి.. ఆ పదవిని రాష్ట్రప్రజలంతా గుర్తించేదాకా ఏదో ఒకటి చేస్తూ, మాట్లాడుతూ వార్తల్లోనే ఉండాలనే ఎజెండాతో పరితపించి పోతున్న వ్యక్తి శైలాజానాధ్. ఆయనకు పీసీసీ అధ్యక్ష పదవి వచ్చిన నాటినుంచి ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తున్నారు. అయితే జగన్ ను నిందించడంలో మాటలన్నీ రేపటికి పాచిపోతాయి కాబట్టి.. ఆయన కొత్త కొత్త మార్గాలు వెతుక్కుంటున్నారు. తాజాగా వైఎస్ రాజశేఖర రెడ్డి బతికి ఉంటే గనుక.. సీఏఏ, ఎన్‌పీఆర్, ఎన్ఆర్‌సీ బిల్లులను తిప్పికొట్టేవారని శైలాజానాధ్ అంటున్నారు.
నిజమే కావొచ్చు. వైఎస్సార్ బతికి ఉంటే ఈ బిల్లులను తిప్పికొట్టి ఉండేవారే కావొచ్చు. కానీ.. ఈ మాటల ద్వారా శైలాజానాధ్ లక్ష్యిస్తున్నది.. ఆ బిల్లులు ఆగిపోవడం కాదు. జగన్ మోహన రెడ్డిని బద్నాం చేయడం. అంతకు మించి ఆయనకు మరొక లక్ష్యం లేదు. జగన్మోహన రెడ్డి భాజపా ప్రభుత్వానికి కొమ్ముకాస్తున్నారని దుష్ప్రచారం చేయడం. భారత్ బచావో పేరుతో తాను పాల్గొంటున్నది ముస్లింల సభ కాబట్టి.. ముస్లింలలో జగన్ కు మంచి పేరున్నది కాబట్టి.. దానిని దెబ్బకొట్టడం లక్ష్యంగా ఇలాంటి అవకతవక మాటలు మాట్లాడుతునానరు.
నిజానికి కాంగ్రెస్ పార్టీ చేతకానితనం వల్లనే.. పరిస్థితి ఇక్కడదాకా వచ్చింది. రాహుల్ కు చేతనైతే.. సీఏఏ రాజ్యసభామోదం పొంది చట్టరూపం దాల్చేదే కాదు. ఎన్డీయేతర పక్షాలన్నింటిలో ఐక్యత తీసుకురావడంలోల.. అవగాహన కలిగించడంలో.. కాంగ్రెస్ ఘోరంగా ఫెయిలైంది. అవన్నీ కప్పిపుచ్చుకోవడానికి రాజశేఖర రెడ్డి బతికి ఉంటే.. అనే పడికట్టు మాటలు వాడుతున్నారు.
నిజమే వైఎస్సార్ బతికి ఉంటే ఈ పరిస్థితి రాదు. పరిస్థితి ఇంతదాకా ఎందుకు… అసలు ఆయన బతికి ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేస్తాం అని ప్రకటించే దమ్ము సోనియాకు వచ్చేదే కాదు.. భారతీయజనతా పార్టీ కేంద్రంలో కూడా అధికారంలోకి వచ్చేదే కాదు.. దేశంలో ఒకటి రెండు రాష్ట్రాలు మినహా అస్తిత్వం కూడా కోల్పోయి కాంగ్రెస్ పార్టీ శవసమానంగా మిగిలేదే కాదు.. ఇంకా చాలా జరిగేవికాదు. అయినా సరే తప్పదు.. వైఎస్సార్ చనిపోయారు.. తిరిగిరారు.. శైలాజా గారు.. ఈ వృథా ప్రసంగాలు ఎందుకు? కార్యాచరణ ఆలోచించండి…!!