రాష్ట్రంలో వైసీపీ విజయం అందరూ ఊహించిందే. అయితే ఎవ్వరూ ఊహించనిది మాత్రం ఈ భారీ మెజార్టీ. 151 స్థానాలంటే మాటలు కాదు. గతంలో ఎన్నడూ ఇలా ఎన్నికలు వన్ సైడ్ కాలేదు. ఇంకా చెప్పాలంటే తండ్రికి సాధ్యంకాని అసాధారణ విజయాన్ని సొంతం చేసుకున్నారు వైఎస్ జగన్. ప్రతిపక్షాన్ని నామరూపాలు లేకుండా తుత్తునియలు చేశారు. అయితే ఈ విజయానికి కారణం ఏంటి? వైఎస్ జగన్ కష్టమా లేక చంద్రబాబు వైఫల్యమా?
సాధారణంగా అధికార పార్టీపై ఎప్పుడూ ప్రజల్లో కాస్త వ్యతిరేకత ఉంటుంది. అంతమాత్రాన ప్రతి ఎన్నికల్లో ప్రతిపక్షాలు గెలుస్తాయంటే సాధ్యంకాదు. అయితే ఇక్కడ జగన్ మొండితనం, మొక్కవోని దీక్ష, రాష్ట్ర ప్రయోజనాలకు వెరవని తనం ఆయన్ను మహానాయకుడిని చేశాయి. ఉక్కు సంకల్పంలా చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర జగన్ ని విజయ తీరాలకు చేర్చింది. అదే సమయంలో చంద్రబాబు చేసిన తప్పిదాలు జగన్ కి బంపర్ మెజార్టీని కట్టబెట్టాయి.
అయితే ఈ ఘన విజయంలో చంద్రబాబు వైఫల్యం కంటే జగన్ కష్టమే ఎక్కువగా కనిపిస్తుంది. గత ఎన్నికల్లో జరిగిన వైఫల్యాల నుంచి జగన్ అనేక పాఠాలు నేర్చుకున్నారు. అభ్యర్థుల ఎంపిక దగ్గర్నుంచి, ప్రచారం, విజయ వ్యూహాల వరకు అంతా పగడ్బందీగా నడిపించారు. అధికారపక్ష ప్రలోభాలకు లొంగకుండా నమ్మి తనతోనే ఉన్నవారికి న్యాయం చేశారు. కప్పదాట్లను ఓ కంట కనిపెడుతూనే నిజాయితీతో కూడిన రాజకీయాలు చేశారు. పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహించకుండా పదవులకు రాజీనామా చేసిన తర్వాతే పార్టీలోకి చేర్చుకుంటూ ఒక కొత్త విలువలకు నాందీవాచకం పాడారు.
జగన్ లో ఉన్న ఈ నిబద్ధత చూసే తటస్థులు కూడా ఫ్యాన్ గుర్తుకి ఓటు వేశారు. రాష్ట్రంలో ఎప్పుడూ లేనంతగా పోలింగ్ శాతం పెరగడానికి ఇదే నిదర్శనం. పార్టీ అభిమానులు, కార్యకర్తలు ఎలాగూ తనవెంటే ఉంటారు. ఎన్నికలకు దూరంగా ఉంటే తటస్థుల మనసులు గెలవడానికి జగన్ ప్రయత్నించారు. ఆ దిశగా పూర్తిస్థాయిలో విజయవంతమయ్యారు. దీనికి ఈ ఘన విజయమే సాక్షి.
చంద్రబాబు వైఫల్యం కొంతమేరకు ఉపయోగపడొచ్చు కానీ మరోవైపు దేశమంతా మోడీగాలి వీచినా రాష్ట్రంలో ఆ ఛాయే లేదంటే జగన్ ప్రజలకు ఎంతగా నమ్మకాన్ని కలిగించారో ఊహించొచ్చు. 25 లోక్ సభ స్థానాలున్న ఏపీలో ఏకంగా 22 సీట్లు గెలిచారంటే జగన్ ది మామూలు విజయం కాదు. దాదాపుగా రాష్ట్రమంతా జగన్ వెంటే నడిచింది. జగన్ కష్టాన్ని గుర్తించింది, ఆయనకు జేజేలు పలికింది.