రివ్యూ: సీత
రేటింగ్: 2/5
బ్యానర్: ఏ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్
తారాగణం: కాజల్ అగర్వాల్, బెల్లంకొండ శ్రీనివాస్, సోను సూద్, తనికెళ్ల భరణి, అభినవ్, చేవెళ్ల రవి, మన్నర చోప్రా, అభిమన్యు సింగ్ తదితరులు
రచన: పరుచూరి బ్రదర్స్
మాటలు: లక్ష్మీభూపాల్
కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు
సంగీతం: అనూప్ రూబెన్స్
ఛాయాగ్రహణం: శిర్షా రే
నిర్మాత: రామబ్రహ్మం సుంకర
కథ, కథనం, దర్శకత్వం: తేజ
విడుదల తేదీ: మే 24, 2019
తన స్వార్ధమే తప్ప పక్కవాళ్లు ఏమైపోయినా పట్టించుకోని కథానాయిక. పర స్త్రీని మోహించి ఆమె కోసం ఎంతకయినా తెగించే ప్రతినాయకుడు. మరదలిపై అపారమైన ప్రేమని పెంచుకుని ఆమే లోకంగా బ్రతుకుతున్న కథానాయకుడు. తేజ రాసిన 'సీత' కథలో పాత్రలన్నీ మనకి మునుపు పరిచయం వున్నవీ, చాలాసార్లు వెండితెరపై చూసినవే. కాకపోతే సదరు క్యారెక్టర్లకి కాస్త వైవిధ్యభరిత పాత్రచిత్రణ జోడించాడు. తన పని జరిపించుకోవడం కోసం విలన్‌తో నెల రోజులు సహజీవనానికి కూడా సై అంటుంది హీరోయిన్. తాను మోహించిన యువతి తనతో ఇష్టంగానే గడపాలి తప్ప ఏడుస్తూ వుండకూడదనే విలన్. చిన్నతనంలో చిత్రహింసలకి గురయి ఎక్కడో సాధువులతో పెరిగిన స్వాతిముత్యం లాంటి హీరో.
ఈ పాత్రలు రాసుకోవడం వరకు బాగానే వుంది కానీ అవి రంజింపచేసే కథ, కథనాలు మాత్రం తేజ సమకూర్చుకోలేకపోయాడు. పరుచూరి సోదరుల సాయం తీసుకున్నా కానీ ఈ 'రామాయణం' ఎంతకీ రక్తి కట్టక 'డ్రామాయణం' అనిపించక మానదు. ఆరంభంలో ఆసక్తి కలిగించినా, సాంప్రదాయాల 'గీత' దాటేందుకు తేజ సాహసించాడే అనిపించినా… సీతని మరీ బోల్డ్‌గా చూపించడానికి మాత్రం తెగించలేకపోయాడు. విలన్ తనకి తాను విధించుకున్న షరతులు, పద్ధతులతో తనని తాను లాక్ చేసేసుకుని సీతని మరో దారిలో లొంగదీసుకోవాలని చూస్తాడు. కథానాయకుడు కథలోకి ప్రవేశించడానికి అరగంట పైనే తీసుకుంటాడు. కానీ ఒకసారి ఎంటర్ అయ్యాక… మరో గంట ఆలస్యంగా పరిచయం చేసి వుండాల్సిందే అనిపిస్తాడు.
పదిన్నరకి టీ తాగి, బటర్ బిస్కెట్లు తినకపోతే అతను మనిషి కాదు. ఆ తర్వాతొక ఎర్ర టాబ్లెబ్, పచ్చ టాబ్లెట్ వేసుకోకపోతే అతను బ్రతకడు. కంటెయినర్‌ని ఒంటి చేత్తో గెంటేసేంత బలవంతుడు. తనని కొట్టిన వారిని తిరిగి కొట్టడానికి చేతులు రానంత మంచివాడు. గుండుసూదుల్ని స్పర్శతో లెక్కించగల తెలివైనవాడు. ఇరవై ఆరు భాషలు తెలిసిన వాడు. న్యాయ శాస్త్రాన్ని కొద్ది గంటల్లోనే పుక్కిట పట్టేసేంత ఏకసంథాగ్రాహి. సూపర్ మ్యాన్ లక్షణాలున్న ఈ 'రాముడు' తన బలం తనకే తెలియని 'హనుమంతుడి' లాంటోడు. బోనస్‌గా ఈ సూపర్‌మ్యాన్ 'స్వాతిముత్యం' లాంటి అమాయకుడు.
మామూలుగా అయితే ఈ స్వాతిముత్యం వున్న సన్నివేశాలు అలరించాలి కానీ తేజ రాసుకున్న సన్నివేశాలు సహనాన్ని పరీక్షిస్తాయి. దానికి తోడు నటుడిగా బెల్లంకొండ శ్రీనివాస్‌కి వున్న పరిమితుల కారణంగా అతని నటన వల్ల చాలా సన్నివేశాలు తేలిపోయాయి. హీరో క్యారెక్టర్ ఇలా వుండి తీరాలి అనుకున్నపుడు ఆ పాత్రని అలా రక్తి కట్టించే టాలెంట్ వున్న వారినే ఎంచుకోవాలి. కనీసం ఈ పాత్ర చుట్టూ అల్లుకున్న కథలో అయినా కొత్తదనం వుంటే అది కాస్త ఉపశనమిస్తుంది. కానీ ఆ కథలోను ఎనభైల కాలం నాటి వాసనలే అన్నీ. మోడ్రన్ సీత అన్న పేరే కానీ ఈ సీత లక్షణాలన్నీ ముప్పయ్యేళ్ల కాలం నాటి సినిమాలనే తలపిస్తాయి.
పరిచయ సన్నివేశాలతో పాటు సోను సూద్ పాత్రకి రాసిన సంభాషణలు, అతను తనికెళ్ల భరణి, చేవెళ్ల రవితో (బిత్తిరి సత్తి) మాట్లాడే మాటలు కాస్త వినోదాన్ని పంచడం వల్ల ప్రథమార్ధంలో విషయం లేకపోయినా కాలక్షేపం జరిగిపోతుంది. కానీ ద్వితియార్ధానికి వచ్చేసరికి కథనం కుంటుపడుతుంది. అవే సన్నివేశాలు రిపీట్ అవుతూ వుంటాయి. రాముడి గొప్పతనాన్ని సీత తెలుసుకోవడం మీదే ఫోకస్ అంతా వుంటుంది. రామ్‌తో పరిచయం అయిన కాసేపటికే మిగతా వారికి అతని పట్ల ఆరాధన ఏర్పడుతుంది. 'రంగస్థలం' మహేష్ అయితే పూనకం వచ్చిన వాడిలా హీరోని స్తుతిస్తూ వేసే సుత్తితో తల బొప్పి కటేస్తుంది. కానీ హీరోయిన్‌కి మాత్రం షరా మామూలుగా పతాక సన్నివేశంలోనే కనువిప్పు కలుగుతుంది. అది తప్పేం కాదు కానీ అందుకోసం అంత దూరం లాగాల్సిన అవసరం దేనికో తేజకే తెలియాలి. విషయం లేని కథని కనీసం అర్ధగంట పాటు ఎక్స్‌ట్రా డ్రాగ్ చేయడం వల్ల సీత మరింత ఇక్కట్లు పడాల్సి వచ్చింది.
కాజల్‌కి నటిగా ఎక్సయిట్ అయ్యే పాత్రే దక్కింది కానీ ఆమె ఈ పాత్రని రక్తి కట్టించడంలో పూర్తిగా సక్సెస్ కాలేకపోయింది. రమ్యకృష్ణ, సౌందర్య లాంటి నటీమణుల స్థాయిలో సీతతో రాక రాక వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. బెల్లంకొండపై ఈ పాత్ర పెను భారం మోపింది. సోను సూద్ వినోదం పంచినా కానీ అతనికిది కొత్త పాత్రేమీ కాదు. సిమిలర్ విలన్ పాత్రని 'ఏక్ నిరంజన్'లో చేసాడు. అందులో బ్రహ్మాజీ పాత్రని ఇక్కడ తనికెళ్ల భరణి చేయగా, చేవెళ్ల రవి 'ఆర్కెస్ట్రా' కూడా చాలా సార్లు శృతిమించింది. గతంలో హీరోయిన్ పాత్రలు చేసిన మన్నర చోప్రా ఈసారి సపోర్టింగ్ రోల్‌కి షిఫ్ట్ అయింది.
తేజ చిత్రాలలో సహజంగా పాటలు బాగుంటాయి. కానీ ఈ చిత్రంలో పాటలు ఏమంత ఆకట్టుకోవు. కొన్ని సంభాషణలు, ఛాయాగ్రహణం మాత్రం బాగున్నాయి. 'జయం' హేంగోవర్ నుంచి బయట పడడానికి చాలా ఏళ్లు తీసుకున్న తేజ ఇప్పుడు 'నేనే రాజు నేనే మంత్రి' హేంగోవర్‌లో అలాంటి నెగెటివ్ షేడ్స్ వున్న పాత్రలని తీర్చిదిద్దుతున్నట్టున్నాడు. ఆ చిత్రంలో తప్పులు దొర్లినా పాస్ అయిపోగలిగాడు కానీ సీత చిత్రానికి మాత్రం పాస్ కాలేనన్ని తప్పులు చేసుకుంటూ పోయాడు. నేటి తరం ప్రేక్షకులకి నచ్చేలా తీద్దామనే తపన వున్నా కానీ పాత కాలం ఆలోచనలని పూర్తిగా విడిచి పెట్టలేక ఈ సీతని ఎటూ కాకుండా మలిచాడు. ఫస్ట్ హాఫ్ ఛల్తా అనిపించినా, సెకండ్ హాఫ్ 'చాలిక' అంటూ చేతులెత్తేసే వరకు సాగదీసాడు.
బాటమ్ లైన్: డ్రామాయణం!
– గణేష్ రావూరి