cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: ఏబిసిడి

సినిమా రివ్యూ: ఏబిసిడి

రివ్యూ: ఏబిసిడి
రేటింగ్‌: 2.5/5
బ్యానర్‌: మధుర ఎంటర్‌టైన్‌మెంట్స్‌, బిగ్‌ బెన్‌ సినిమా, సురేష్‌ ప్రొడక్షన్స్‌ ప్రై.లి.
తారాగణం: అల్లు శిరీష్‌, రుక్షర్‌, భరత్‌, నాగబాబు, వెన్నెల కిషోర్‌, సిరివెన్నెల రాజా, శుభలేఖ సుధాకర్‌, కోట శ్రీనివాసరావు, హర్షవర్ధన్‌, వైవా హర్ష తదితరులు
సంభాషణలు: కళ్యాణ్‌ రాఘవ్‌
సంగీతం: జుడా శాండీ
ఛాయాగ్రహణం: రామ్‌
నిర్మాతలు: యష్‌ రంగినేని, మధుర శ్రీధర్‌ రెడ్డి
దర్శకత్వం: సంజీవ్‌ రెడ్డి
విడుదల తేదీ: మే 17, 2019

ఏ రీమేక్‌కి అయినా 'మార్పులు' చేసే ముందుగా తర్కించుకోవాల్సిన అంశం... 'ఇవి నిజంగా అవసరమా?' అని. ఒక కథ ఒక చోట క్లిక్‌ అయిందంటే అందులో జనాలకి నచ్చిన అంశాలు ఏమున్నాయనేది ముందుగా విశ్లేషించుకోవాలి. తదనుగుణంగా బలహీనతలని సరి చేసుకుని, బలాలని అనుసరించాలి. 'ఏబిసిడి' విషయానికి వచ్చేసరికి ఈ సూత్రానికి విరుద్ధమైన మార్గాన్ని ఎంచుకున్నారు. ఈ సినిమాకి ఏదయితే బలమో దానిని వదిలిపెట్టేసి 'సొంత తెలివి' చూపించారు.

డబ్బు విలువ తెలియకుండా పెరుగుతున్న కొడుకుకి (అల్లు శిరీష్‌) జీవితం అంటే ఏమిటో చూపించాలనే తాపత్రయంతో ఒక ఎన్నారై తండ్రి (నాగబాబు) అతడిని ఇండియాకి పంపిస్తాడు. సదరు వ్యక్తి జీవితం ఎటు వెళుతుంది, ఈ కథ ఎలా ముగుస్తుంది అనేది ఆ క్యారెక్టర్‌ ఇండియాలో ల్యాండ్‌ అయినపుడే గెస్‌ చేయవచ్చు. కానీ ప్రేక్షకుల ఊహలకి అందకుండా మలయాళ దర్శకుడు తన కథని ఆసక్తికరంగా ముగిస్తాడు. ఆ ఎండింగ్‌ షాకింగ్‌గా వున్నా కానీ క్యారెక్టరైజేషన్‌కి సూట్‌ అవుతుంది. రియాలిటీకి దగ్గరగా వుంటుంది. కానీ ఆ షాక్‌ ఫ్యాక్టర్‌ లేకుండా పాసివ్‌, ప్రిడిక్టబుల్‌ ఎండింగ్‌నే ఫ్రిఫర్‌ చేసారిక్కడ. దాంతో 'ఏబిసిడి' ఆ లెవల్‌ని దాటి 'ఎక్స్‌వైజెడ్‌'ని రీచ్‌ అవకుండానే ఎండ్‌ అయిపోయింది.

ఓకే... అలాంటి క్లయిమాక్స్‌ రిస్కీ అనుకుని ఇలా సేఫ్‌ గేమ్‌ ప్లే చేసారనే అనుకుందాం. కానీ క్యారెక్టర్‌లోని మార్పుకి అనుగుణమైన ఎలిమెంట్స్‌ ఏవి? ఎలాగైనా ఇండియా నుంచి వెళ్లిపోదామని, అందుకోసం చిన్న రంధ్రం దొరికినా దూరిపోదామని, ఈ కష్టాల నుంచి బయట పడదామని చూస్తోన్న హీరోకి ఇక్కడి స్లమ్స్‌లో జీవన శైలి నిజంగా అంత కంఫర్టబుల్‌ అనిపించిన సందర్భాలేవి? ఒక పాప త్రెడ్‌ని పెట్టి ఎమోషనల్‌ కనక్ట్‌ ఏర్పరిచామని భావించారే తప్ప ఆ త్రెడ్‌ని కూడా తెగిపోనంత, లేదా ఈ కథని పట్టి వుంచేంత బలంగా అల్లలేకపోయారు. 'రెండు రూపాయల' చుట్టూ ఈ రెండు సీన్లు వేసేసాం కాబట్టి కనక్ట్‌ అయిపోతార్లెమ్మనే తేలికపాటి ధోరణి కథనంలో కల్పించింది.

ఇక మన హీరోలో 'హీరో'ని చూసుకోవడానికి, అతడి వెంట నడవడానికి బలమైన కారణాలేవీ? ఒరిజినల్‌ దర్శకుడు ఇచ్చిన ముగింపుకి ముందు సీరియస్‌ బిల్డప్‌ అవసరం లేదు. కానీ కథ అలా కాకుండా ఇలా ముగించాలి అనుకున్నపుడు ఆ కథ అనుసరించిన దారిలో వెళ్లకూడదు. 'ఏబిసిడి' మొదలైనపుడే వినోదానికి బోలెడంత స్కోప్‌ వుందనిపిస్తుంది. డబ్బులో మునిగి తేలిన వారికి కేవలం చిల్లరతో బతకాల్సిన పరిస్థితి తలెత్తినపుడు వినోదం పండించడానికి కావాల్సినంత స్టఫ్‌ ఇస్తుంది. కానీ ఆ వినోదం కేవలం కొన్ని సీన్లకే పరిమితం అయింది.

ఇక ఈ రీమేక్‌కి చేసిన మరో మిస్టేక్‌... ఇండియాకి వచ్చి ఇద్దరు ఎన్నారైలు కష్టాలు పడుతోంటే ఒకరినే హీరోలా చూపించి, మరొకరిని సైడ్‌కి నెట్టేయడం. దీంతో ఒరిజినల్‌లో దుల్కర్‌, గ్రెగరీ మధ్య వున్న కెమిస్ట్రీ మిస్‌ అయింది. నిజానికి దుల్కర్‌ని కూడా పక్కన వున్న పాత్ర డామినేట్‌ చేస్తుంటుంది. చాలా సందర్భాల్లో ఆ పాత్ర చేసే కామెడీ ఒరిజినల్‌కి ప్లస్‌ అయింది. కానీ చాలా తెలుగు రీమేక్‌ల మాదిరిగా 'సెకండ్‌ లీడ్‌' క్యారెక్టర్‌ ఇక్కడ సపోర్టింగ్‌ క్యారెక్టర్‌గా, కొన్ని సందర్భాలలో బ్యాక్‌గ్రౌండ్‌కే పరిమితమయింది. ఇక విలన్‌ పాత్ర ఒరిజినల్‌లోనే వీక్‌ ఎలిమెంట్‌ అంటే ఇక్కడ దానిని మరింత వీక్‌గా మార్చారు. సిరివెన్నెల రాజాతో విలన్‌ పాత్ర చేయించడం మంచి ఆలోచనే కానీ అతను ఆ పాత్రలో ఏ క్షణంలోను కన్విన్సింగ్‌గా అనిపించలేదు. రాజకీయాలకి సంబంధించిన త్రెడ్‌ ఆదినుంచీ అసలు కథకి, తద్వారా వినోదానికీ అడ్డు తగులుతూనే వస్తుంది.

ఆ త్రెడ్‌ యాక్టివ్‌ అయిన సందర్భంలో కూడా సన్నివేశాలని ఆసక్తికరంగా రాసుకోకపోవడం వల్ల ద్వితియార్ధంలో వినోదం తగ్గిపోయి, ఏబిసిడికి మరో సేవింగ్‌ ఫ్యాక్టర్‌ లేకుండా పోయింది. ఇక్కడ లవ్‌స్టోరీకి కాస్త ఇంపార్టెన్స్‌ ఇచ్చినా కానీ అందులోను అలరించే గుణం లేకపోవడంతో 'మెల్ల మెల్ల మెల్లగా' పాట మినహా ఆ త్రెడ్‌ నిస్సారంగా అనిపిస్తుంది. హీరో సోషల్‌ రెస్పాన్సిబులిటీ తీసుకునేందుకు కారణమయ్యే సన్నివేశాలు చాలా పేలవంగా అనిపిస్తాయి. దుఃఖిస్తోన్న కొన్ని వృద్ధ పాత్రలని అదే పనిగా చూపించడం వల్ల ఎమోషన్‌ పండదని రియలైజ్‌ అయి వుండాల్సింది.

సన్నివేశ బలం లేని చోట దానిని నిలబెట్టే ఆర్టిస్టులు అవసరం. అందుకు వెన్నెల కిషోర్‌పై తీసిన సన్నివేశాలే సాక్ష్యం. చాలా సందర్భాలలో బలహీనంగా అనిపించే కథ, కథనాలున్న ఏబిసిడిని అల్లు శిరీష్‌ ఎటువంటి ఎక్స్‌ట్రా ఎఫర్ట్స్‌తో సపోర్ట్‌ చేయలేకపోయాడు. ఎనర్జీతోనే కొన్ని సన్నివేశాలకి, తద్వారా సినిమాలకి బలంగా ఎలా మారవచ్చు అనేదానికి తన ఇంట్లోనే బోలెడన్ని ఉదాహరణలు. టైమింగ్‌ వున్న భరత్‌కి నవ్వించడానికి తగిన డైలాగులు, సన్నివేశాలు క్రియేట్‌ చేయలేదు. రుక్షర్‌ క్యారెక్టర్‌ స్టాక్‌ క్యారెక్టర్‌లా వుంటుందే తప్ప కథకి ఎక్కడా దోహదపడదు. తెర వెనుక నుంచి కూడా ఈ చిత్రానికి అదనపు అండదండలు లభించలేదు. సిడ్‌ శ్రీరామ్‌ పాట మినహా చెప్పుకోతగ్గ అడిషినల్‌ బెనిఫిట్స్‌ లేవు. నిర్మాణ పరంగా వున్న లిమిటేషన్స్‌తో కొన్ని కీ క్యారెక్టర్స్‌ని ఎవరెవరితోనో చేయించేయడం వల్ల చాలా సన్నివేశాలు తేలిపోయాయి.

ఒరిజినల్‌ని మార్చాలని, శిరీష్‌ని అల్టిమేట్‌గా హీరోలా చూపించాలని చేసిన ప్రయత్నం వల్ల ఏబిసిడి అనే ఇంట్రెస్టింగ్‌ స్టోరీ కన్‌ఫ్యూజన్‌లో పడి చాలా రొటీన్‌ సినిమాగా ఎండ్‌ అయింది. ఈ కన్‌ఫ్యూజన్‌తో బాక్సాఫీస్‌ని గెలవడం అంత తేలిక ఏమీ కాదు మరి.

బాటమ్‌ లైన్‌: ఏ కన్‌ఫ్యూజ్‌డ్‌ రీమేక్‌!
- గణేష్‌ రావూరి

సినిమా రివ్యూ: మహర్షి