సినిమా రివ్యూ: మహర్షి

రివ్యూ: మహర్షి రేటింగ్‌: 2.75/5 బ్యానర్‌: వైజయంతి మూవీస్‌, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, పివిపి సినిమా తారాగణం: మహేష్‌, పూజహెగ్డే, అల్లరినరేష్‌, జగపతిబాబు, రావురమేష్‌, వెన్నెలకిషోర్‌, ప్రకాష్‌రాజ్‌, జయసుధ, పోసాని కృష్ణమురళి, పృధ్వీ, శ్రీనివాసరెడ్డి…

రివ్యూ: మహర్షి
రేటింగ్‌: 2.75/5
బ్యానర్‌: వైజయంతి మూవీస్‌, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, పివిపి సినిమా
తారాగణం: మహేష్‌, పూజహెగ్డే, అల్లరినరేష్‌, జగపతిబాబు, రావురమేష్‌, వెన్నెలకిషోర్‌, ప్రకాష్‌రాజ్‌, జయసుధ, పోసాని కృష్ణమురళి, పృధ్వీ, శ్రీనివాసరెడ్డి తదితరులు
సంగీతం: దేవిశ్రీప్రసాద్‌
రచన: వంశీ పైడిపల్లి, హరి, సోలమన్‌
ఛాయాగ్రహణం: కె.యు. మోహనన్‌
నిర్మాతలు: అశ్వనీదత్‌, దిల్‌ రాజు, పరమ్‌ వి. పొట్లూరి, పర్ల్‌ వి. పొట్లూరి, కెవిన్‌ అన్నే
దర్శకత్వం: వంశీ పైడిపల్లి
విడుదల తేదీ: మే 9, 2019

సోషల్‌ మెసేజ్‌ వున్న థీమ్‌ని కమర్షియల్‌ పంథాలో అన్ని వర్గాల ప్రేక్షకులకీ నచ్చేలా చెప్పడం అందరి వల్ల సాధ్యమయ్యే పనికాదు. శంకర్‌ తర్వాత ఆ ఫార్ములాని సక్సెస్‌ఫుల్‌గా చేయగలిగినది మురుగదాస్‌, కొరటాల శివ లాంటి కొందరు దర్శకులు మాత్రమే. మహేష్‌ ఇరవై అయిదవ చిత్రానికి వంశీ పైడిపల్లి ఇలాంటి బరువైన బాధ్యతని భుజానికి ఎత్తుకున్నాడు. ఒక మంచి సందేశానికి వాణిజ్యాంశాలు జోడించడానికి వంశీ పైడిపల్లి, అతని రచయితల బృందం శాయశక్తులా కృషి చేసారు. కాకపోతే ఆ మిశ్రమాన్ని దేనికది వేరుపడి కనబడనివ్వకుండా, అంతా ఒకటే అన్నట్టు కలగలిసి పోయేలా తెర మీదకు తీసుకురావడంలో విఫలమయ్యారు.

కమర్షియల్‌ అంశాల పేరిట జోడించిన యాక్షన్‌ దృశ్యాలు శృతిమించాయి. పవర్‌ఫుల్‌గా అనిపించే రెండు యాక్షన్‌ దృశ్యాలు వున్నా కావాల్సిన ఎలివేషన్‌ వచ్చేస్తుంది. కానీ వంశీ పైడిపల్లి అలాంటి ఒకటి, రెండు పవర్‌ఫుల్‌ సీన్ల కంటే అయిదారు మామూలు యాక్షన్‌ సీన్లు పెడితే బాగుంటుందన్నట్టుగా అవసరానికి మించిన యాక్షన్‌ పెట్టాడు. తద్వారా మహర్షి రన్‌ టైమ్‌ పెరగడంతో పాటు అవసరమైన ఎమోషన్స్‌కి తగినంత స్పేస్‌ దక్కలేదు. శ్రీమంతుడు, భరత్‌ అనే నేను తరహాలోనే ఈ చిత్రంలోని హీరో క్యారెక్టర్‌ జర్నీ కూడా సాగుతుంది. ఇది భిన్నం అనిపించడానికి ఎన్ని విధాలుగా తిప్పి చూపించినా కానీ అంతిమంగా వున్నది అదేననే విషయం అయితే స్పష్టంగా తెలుస్తూనే వుంటుంది.

క్యారెక్టరైజేషన్‌, మెసేజ్‌ వగైరా అన్నీ బాగానే అమరినా కానీ రిషి జర్నీలో భాగం కావడానికి కావాల్సిన 'కనక్షన్‌'ని ఏర్పరచడంలో దర్శకులు సఫలీకృతం కాలేదు. రిషి రిలేట్‌ చేసుకునే క్యారెక్టర్‌లా కంటే 'ఇన్విన్సిబుల్‌ హీరో'లానే ఆదినుంచీ కనిపిస్తుంటాడు. కాలేజ్‌ స్టూడెంట్‌ అయినా, కార్పొరేట్‌ కంపెనీ సిఈఓ అయినా అతనికి ఎలాంటి వల్నరబలుటీస్‌ (బలహీనతలు) వుండవు. ఇంకా ఇబ్బందికర అంశమేమిటంటే… అతని కథలో సంఘర్షణ కూడా వుండదు. స్టోరీలో కాన్‌ఫ్లిక్ట్‌ పాయింట్‌ రీచ్‌ అవడానికి సెకండ్‌ హాఫ్‌ వరకు వేచి చూసేలా చేయడం స్క్రీన్‌ప్లే పరంగా చాలా పెద్ద మిస్టేక్‌. కాన్‌ఫ్లిక్ట్‌ పాయింట్‌ని డిలే చేయడంతో పాటు ఆ కాన్‌ఫ్లిక్ట్‌తో హీరోకి డైరెక్ట్‌ రిలేషన్‌ లేకపోవడం మరో ప్రాబ్లమ్‌. శ్రీమంతుడు, భరత్‌ అనే నేను తరహాలో ఆ కనక్షన్‌, కాన్‌ఫ్లిక్ట్‌ ఇంకా పర్సనల్‌ లెవల్స్‌లో వుండాల్సినది. కానీ అలా చేస్తే మళ్లీ అవే సినిమాలు అనేస్తారని అనుకున్నారో ఏమో స్నేహితుడు యాంగిల్‌ హైలైట్‌ అయింది. ఈ క్రమంలో హీరోతో తండ్రికున్న రిలేషన్‌ సరిగా ఎస్టాబ్లిష్‌ అవకుండానే కథలో రెండు, మూడు సీన్లు ఆక్రమించింది.

తండ్రితో అతనికున్న స్ట్రెయిన్డ్‌ రిలేషన్‌ నుంచి కావాల్సినంత డ్రామా పండించుకునే వీలుంది కానీ ఆ పాత్రని కేవలం బ్యాక్‌గ్రౌండ్‌కే పరిమితం చేయడం వల్ల సదరు సన్నివేశాలకి ఇంపాక్ట్‌ లేకుండా పోయింది. పోనీ స్నేహితుడి పాత్రతో అయినా అనుబంధాన్ని బలంగా రిజిష్టర్‌ చేయాల్సింది. అక్కడా పైపైన టచ్‌ చేసేసి వీరిద్దరూ క్లోజ్‌ ఫ్రెండ్స్‌ అని ప్రేక్షకులే అనుకోవాల్సిన పరిస్థితి కల్పించింది. కాలేజ్‌ ఎపిసోడ్స్‌ బిగినింగ్‌లో ఎంటర్‌టైనింగ్‌గానే అనిపించినా ముగింపు దశకి చేరుకునే సరికి అబ్‌రప్ట్‌గా అనిపిస్తాయి. స్నేహితుల మధ్య దూరం పెరగడానికి, ప్రేమికులు ఇద్దరూ విడిపోవడానికి తగిన రీజనింగ్‌ లేకుండానే ఆ ఘట్టం ముగుస్తుంది. రిషి జర్నీ బిగిన్స్‌ అని ఇంటర్వెల్‌ కార్డ్‌ వేయడంతోనే అసలు కథ అప్పుడు మొదలవుతుందనేది దర్శకుడే ఒప్పుకున్నట్టయింది.

కాలేజ్‌ ఎపిసోడ్స్‌, ఫ్రెండ్‌షిప్‌ త్రెడ్‌లో 'త్రీ ఇడియట్స్‌' ఛాయలు కనిపిస్తే, ఒక అపర ధనవంతుడు ఇండియాకి రావడం, ఒక సోషల్‌ కాజ్‌కోసం పోరాడడం విజయ్‌ చేసిన 'సర్కార్‌'ని తలపిస్తుంది. సిఈఓ పాత్రని హీరో ఎలివేషన్స్‌ కోసం వాడిన తీరు రియాలిటీకి చాలా దూరంగా వుంది. ఎంత పెద్ద సమస్య ఎదురయినా హీరో అవలీలగా దానిని దాటేస్తూ, ఎంత పెద్ద విలన్‌కి అయినా తొలి సీన్‌లోనే 'నీకు సీన్‌ లేదు' అని తేల్చేస్తూ వుంటే ఇక అతని ప్రయాణంలో ఎత్తుపల్లాలకి చోటెక్కడిది? ప్రధాన పాత్రలకి స్పేస్‌ ఇవ్వడం కంటే రైతు, పిల్లాడు, బస్టాండ్‌లో వృద్ధురాలు లాంటి పాత్రల మీద పే ఆఫ్స్‌ రాసుకోవడం వల్ల అసలు పాత్రలు డమ్మీలుగా మిగిలిపోయాయి… హీరోయిన్‌ (పూజ హెగ్డే – అందంగా కనిపించడానికి తప్ప అభినయానికి ఆస్కారం దక్కలేదు), విలన్‌తో (జగపతిబాబు – గెటప్‌, క్యారెక్టర్‌ అన్నీ బాగా తెల్లబడిపోయాయి… ఆయన గడ్డంలా) సహా!

ఇక కథలో కీలకమైన సన్నివేశాలు, సంఘటనలు మహేష్‌ నటించిన చిత్రాలనే తలపించడం వల్ల మహర్షి జర్నీ అంతా ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్‌ చేసినట్టుగానే అనిపిస్తుంది. నాలుగయిదు సినిమాల విరామం తర్వాత మహర్షి చేసినట్టయితే మరీ ఇంత ఫెమిలియర్‌గా అనిపించేది కాదేమో. కథనం పరంగా దర్శకుడు ఒక గ్రాఫ్‌ని అసలు మెయింటైన్‌ చేయలేకపోయాడు. ఒక హై ఇచ్చే సీన్‌ వుంటే దానికి ఫాలో అప్‌గా నాలుగైదు మందకొడి సన్నివేశాలు వస్తూ వుండడంతో ఈ ప్రయాణం సుదీర్ఘంగా అనిపించకుండా చేయలేకపోయారు. అటు థీమ్‌కి కావాల్సిన బరువైన పాటలతో పాటు ఇటు బాక్సాఫీస్‌కి అవసరమైన పాటలు కూడా వుండాలని భావించడం వల్ల అక్కడా రన్‌ టైమ్‌ అధికమయింది. ఒక అరగంట నిడివి తగ్గించినట్టయితే మహర్షి ప్రయాణం మరీ ఇంత భారమయ్యేది కాదేమో మరి.

దేవిశ్రీప్రసాద్‌ పాటలలో చివరి రెండు పాటలు హృద్యంగా అనిపిస్తాయి. సంభాషణల్లో రిషి ఐడియాలజీ చెప్పే స్ఫూర్తిదాయకమైనవి, రైతుల గొప్పదనాన్ని తెలియజెప్పేవి మెప్పిస్తాయి. ముగ్గురు భారీ నిర్మాతలు కలవడంతో రిషి ప్రపంచం మహా రిచ్‌గా కనిపించింది. ఇటు పల్లె అందాలని, అటు మ్యాన్‌హటన్‌ భవంతులని మోహనన్‌ కెమెరా మనోహరంగా బంధించింది. రిచ్‌మ్యాన్‌గా, తర్వాత ప్రజల సమస్యల కోసం పోరాడే వ్యక్తిగా మహేష్‌ ఇంతకుముందే నటించేసాడు కనుక అవి ఏమంత ఎక్సయిటింగ్‌గా అనిపించవు. కానీ స్టూడెంట్‌గా మహేష్‌ ఎనర్జీ చూస్తే ఎందుకని ఇలాంటి పాత్రలకి మహేష్‌ దూరంగా వుంటాడో అనిపించక మానదు.

కాలేజ్‌ స్టూడెంట్‌ పాత్రలో మహేష్‌ ఎనర్జీ లెవల్స్‌ చూస్తే ఫుల్‌ లెంగ్త్‌ ఫిలిం చేయదగ్గ స్టఫ్‌ అనిపిస్తాడు. ఎమోషనల్‌ సీన్స్‌లో మహేష్‌ నటన గురించి కొత్తగా చెప్పేదేముంది. అల్లరి నరేష్‌ తన పాత్రలో ఒదిగిపోయాడు. మిగిలిన నటీనటులకి తగినంత స్పేస్‌ని దర్శకుడు కల్పించలేదు. కీలకమైన పాత్రల్లో జయసుధ, ప్రకాష్‌రాజ్‌ కూడా గెస్ట్‌ అప్పీయరెన్స్‌లానే అనిపిస్తారు. కొన్ని టచ్‌ చేసే సన్నివేశాలు, ఆలోచింపజేసే సందేశం, అన్నిటికీ మించి మహేష్‌ బాబు స్క్రీన్‌ ప్రెజెన్స్‌, పర్‌ఫార్మెన్స్‌ మహర్షికి సపోర్ట్‌గా నిలబడినా, ఒడిదుడుకులతో కూడిన కథనం, అనవసరపు నిడివితో సుదీర్ఘంగా సాగడం, కమర్షియల్‌ అంశాలనీ, సందేశాన్ని అనుసంధానం చేయలేకపోవడం, ఇంకా ముందు చెప్పుకున్న అనేక బలహీనతలు అడ్డు పడడంతో రిషి.. మహర్షిగా మారే వైనం పూర్తిగా ఆకట్టుకోలేకపోతుంది. మహర్షి సుదీర్ఘ ప్రయాణాన్ని విసుక్కోకుండా వీక్షించడానికి కాస్త ఎక్కువ సత్తువే అవసరమవుతుంది.

బాటమ్‌ లైన్‌: ఒడిదుడుకుల ప్రయాణం!
– గణేష్‌ రావూరి