Advertisement

Advertisement


Home > Politics - Gossip

పిల్లి అరుపులకే విలువ ఇచ్చిన జగన్!

పిల్లి అరుపులకే విలువ ఇచ్చిన జగన్!

పిల్లి అరుపులే కదా అని నిర్లక్ష్యం చేయలేదు. పట్టించుకోకుండా విడిచి పెట్టలేదు. మొత్తానికి పిల్లి అరుపులే నెగ్గాయి. రామచంద్రపురం నియోజకవర్గం వైసీపీ రాజకీయాల పరిస్థితి ఇది. రామచంద్రపురం నుంచి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఇదే ప్రాంతానికి చెందిన రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ వర్గంతో ఆయనకు పొసగడం లేదు.

పిల్లి వర్గాన్ని పక్కన పెట్టి ఆయన నియోజకవర్గంలో రాజకీయంచేస్తున్నారనే పేరుంది. దాంతో ఆగ్రహించిన పిల్లి వర్గం నాయకులు గతంలో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించి.. రాబోయే ఎన్నికల్లో చెల్లుబోయిన కు మళ్లీ టీకెట్ ఇస్తే ఓడించి తీరుతామని పిల్లి సుభాష్ చంద్రబో స్ కొడుకు సూర్యప్రకాష్ కు టికెట్ ఇవ్వాల్సిందేనని భీష్మించుకున్నారు.

ఈ వ్యవహారం అక్కడ బాగా ముదిరింది. పిల్లి సుభాష్ చంద్రబోస్ ను వైఎస్ జగన్ తన తాడేపల్లి క్యాంప్ ఆఫీసుకు పిలిపించి ప్రత్యేకంగా మాట్లాడారు. అయినా సరే.. తిరిగి నియోజకవర్గానికి వెళ్లిన వెంటనే.. ఈసారి ఎన్నికల్లో తాను గానీ, తన కొడుకు గానీ ఎమ్మెల్యేగా పోటీచేసి తీరుతాం అని సుభాష్ చంద్రబోస్ ప్రకటించారు.

తీరా ఇప్పుడు పిల్లి మాటలే నెగ్గినట్లున్నాయి. ఆయన అభ్యర్థిత్వాన్ని రామచంద్రపురం నుంచి కన్ఫర్మ్ చేయడంతో పాటు, అక్కడ ఉన్న చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి మారుస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మొత్తానికి అక్కడ అసమ్మతి స్వరమే నెగ్గింది. చెల్లుబోయిన వర్గాన్ని పిల్లి వర్గం ఎలా కలుపుకుపోతుందో చూడాలి.

అదే విధంగా ఉభయగోదావరి జిల్లాల్లో మరి కొన్ని నియోజకవర్గాల విషయంలో కూడా అభ్యర్థుల మార్పుచేర్పులు ఉంటాయని వార్తలు వస్తున్నాయి. జగన్ ఈసారి ఎన్నికలకు కేవలం విజయావకాశాలు మాత్రమే లక్ష్యంగా ఎలాంటి మొహమాటానికి గానీ, శషబిషలకు గానీ పోకుండా.. సర్వేల ఆధారంగానే అభ్యర్థులను నిర్ణయిస్తున్నారు. పార్టీ ప్రయోజనాలు తప్ప మరో అంశాన్ని దృష్టిలో ఉంచుకోవడం లేదు.

ఈ క్రమంలో భాగంగా కొందరు ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలను కూడా మారుస్తున్నారు. అయితే ఈ వైనంపై పచ్చమీడియా హేయమైన రీతిలో గోల చేస్తోంది. ఎస్సీలకు అన్యాయం జరుగుతోందని కారుకూతలు కూస్తోంది. ఎస్సీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేను మారిస్తే.. మళ్లీ మరో ఎస్సీనే పోటీచేయిస్తారు తప్ప.. జనరల్ కేండిడేట్ కు ఇవ్వరు కదా. అలాంటప్పుడు ఈ మార్పులు ఎస్సీలకు అన్యాయం చేసినట్లు ఎలా అవుతాయని ప్రజలు అనుకుంటున్నారు.

వైఎస్సార్ కాంగ్రెస్, జగన్ రాజకీయ వ్యూహాలను బద్నాం చేయడానికి ఇలాంటి విషప్రచారాలను మానుకోవాలని కోరుతున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?