
మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వ్యూహ కమిటీలో ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ కోవర్టున్నారా? అంటే... ఔనని ప్రధాన ప్రతిపక్ష నేతలు అనుమానిస్తున్నారు. ఎన్నికల ముంగిట ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాల్సిన తరుణంలో, బాబుతో ఉద్దేశ పూర్వకంగానే తప్పులు చేయిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో భాగంగా మహానాడులో టీడీపీ మొదటి విడత మేనిఫెస్టో ప్రకటన అని టీడీపీ నేతలు ఉదహరిస్తున్నారు.
టీడీపీ మేనిఫెస్టో సంక్షేమ పథకాలకు అగ్రస్థానం కల్పించడంపై సొంత పార్టీ నేతలే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేనిఫెస్టో ప్రకటనతో టీడీపీ కార్యకర్తలు, నాయకులు దిగాలు చెందారు. ఇంతకాలం జగన్ సంక్షేమ పథకాల అమలుపై తీవ్ర విమర్శలు గుప్పించి, ఇప్పుడు అదే పంథాలో నడుస్తామని చెప్పడం ద్వారా ప్రస్తుత ప్రభుత్వ విధానాలకు ఆమోద ముద్ర వేసినట్టైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ముఖ్యంగా మేనిఫెస్టో ప్రకటనతో టీడీపీ ఓటు బ్యాంక్‌కు గండిపడుతుందనే ఆందోళన టీడీపీ శ్రేణుల్లో కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్లు రెండు రకాలుగా విడిపోయారు. జగన్ సంక్షేమ పథకాలను మెచ్చుకునేవారు, వ్యతిరేకించే వారిగా స్పష్టమైన విభజన కనిపిస్తోంది. ప్రధానంగా తటస్థులు, మధ్యతరగతి, ఉన్నత తరగతి, మేధావులు, విద్యావంతులు, ఉద్యోగులు అభివృద్ధిని కాంక్షిస్తున్నారు. జగన్ సంక్షేమ పథకాలతో మరే అభివృద్ధి చేయడానికి వీల్లేకుండా పోతోందన్న ఆగ్రహం వారిలో ఉంది. ఇదే టీడీపీకి పాజిటివ్ ఓటు బ్యాంక్‌గా ఇంత కాలం కనిపిస్తూ వచ్చింది.
ఎప్పుడైతే జగన్‌ను మించి సంక్షేమాన్ని అందిస్తానని మొదటి విడత మేనిఫెస్టోలో చంద్రబాబు ప్రకటించారో, ఆ క్షణం నుంచే ఆయనపై వ్యతిరేకత కనిపిస్తోంది. కనీసం పొలిట్‌బ్యూరోలో కూడా మేనిఫెస్టోలోని అంశాల్ని చర్చించకుండా మహానాడు వేదికగా ప్రకటించారని ముఖ్య నాయకులు మండిపడుతున్నారు. చేజేతులా చంద్రబాబు తన అనుకూల ఓటు బ్యాంక్‌కు గండి కొట్టారని పొలిట్‌బ్యూరో సభ్యుడొకరు వాపోవడం గమనార్హం. ఇదంతా జగన్‌కు రాజకీయ ప్రయోజనం కలిగించేలా వుందని, కుట్ర ఏదో జరుగుతోందనే అనుమానాలు టీడీపీలో తలెత్తాయి.
ప్రధానంగా వేళ్లన్నీ టీడీపీ వ్యూహకర్త రాబిన్‌శర్మ వైపు చూపడం గమనార్హం. గతంలో ఇతను వైసీపీ వ్యూహకర్త పీకే టీమ్‌లో కీలకంగా పని చేశారు. గత మూడేళ్లుగా టీడీపీ వ్యూహకర్తగా పని చేస్తున్నారు. నమ్మకంగా వుంటూ, ఎన్నికల సమయంలో చంద్రబాబును తప్పుదారి పట్టిస్తున్నారనే అనుమానాలకు తాజా మేనిఫెస్టోను ఉదాహరణగా చూపుతున్నారు.
ఒకవేళ అధికారంలోకి వచ్చినా చంద్రబాబుకు పథకాలు అమలు చేయడం అసాధ్యమని, ఎకానమిస్ట్ అయిన తమ నాయకుడిని బోల్తా కొట్టించే స్థాయిలో కుట్రపూరిత వ్యూహం ఏదో పన్నారని టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. కుట్రను పసిగట్టేలోపు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందేమో అన్న బెంగ వారిలో కనిపిస్తోంది. జగన్‌కు మించి సంక్షేమ పథకాలను ప్రకటించకపోతే వైసీపీని ఓడించడం కష్టమనే భయాన్ని చంద్రబాబుపై రుద్ది, ఆయన్ను పూర్తిగా తప్పుడు మార్గంలో నడిపిస్తున్నారనే అనుమానం టీడీపీని వెంటాడుతోంది. రానున్న రోజుల్లో ఇది బయటపడే అవకాశం వుంది.
నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా