తెలుగు రాష్ట్రాలు, తెలుగు ప్రజల మధ్య ఎంత స్నేహం ఉందో.. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య కూడా అంతే దోస్తీ ఉంది. అయితే ఎన్నికల్లో జగన్ ఘన విజయాన్ని చూసి కేసీఆర్ కాస్త కుళ్లుకుంటున్నారన్న విషయం మాత్రం వాస్తవం. ఈ ఘన విజయం, పాలనలో జగన్ దూకుడు పరోక్షంగా కేసీఆర్ కి తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకుంటామని ఎన్నికల్లో ఇచ్చిన హామీకి కట్టుబడి జగన్ ఆ దిశగా తొలి అడుగు వేశారు. దీంతో అటు తెలంగాణ ఆర్టీసీ నేతలు కూడా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. ఏపీ సాకు చూపుతూ కేసీఆర్ కి డెడ్ లైన్ పెట్టడానికి రెడీ అవుతున్నారు. సీపీఎస్ రద్దు, ఉద్యోగుల ఐఆర్ పెంపుదలపై కూడా త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఆయా వర్గాల వారు డిమాండ్ చేస్తున్నారు.
వేతనాల పెంపు కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగులు కూడా జగన్ నిర్ణయాలను ప్రస్తావిస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. వీరంతా తెలంగాణ కేబినెట్ మీటింగ్ లో సంచలన నిర్ణయాలు వెలువడతాయని ఆశించారు. అయితే అందర్నీ నిరాశకు గురిచేస్తూ కేసీఆర్ ఎలాంటి సంచలనాలు లేకుండానే కేబినెట్ మీటింగ్ ముగించారు. స్వరూపానంద స్వామికి 2ఎకరాలు, దర్శకుడు శంకర్ కి 5 ఎకరాలు, జిల్లాల్లో టీఆర్ఎస్ కార్యాలయాలకు స్థలాలు కేటాయింపు వంటి నిర్ణయాలతో కేబినెట్ భేటీని మమ అనిపించారు ముఖ్యమంత్రి.
దీంతో అక్కడి ఉద్యోగ సంఘాలు మరోసారి తమ అసంతృప్తిని బాహాటంగానే వెళ్లగక్కుతున్నాయి. లోటు బడ్జెట్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్ లోనే ఉద్యోగస్తులకు జీతాలు పెంచి, సీపీఎస్ రద్దుచేసి, ఆర్టీసీని విలీనం చేసుకుంటూ, అందరికీ ఆర్థిక భరోసా కల్పిస్తుంటే.. తెలంగాణలో ఎందుకు చేయరంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు ఉద్యోగులు. ఇలా జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు పరోక్షంగా కేసీఆర్ కి తలనొప్పి తెచ్చిపెడుతున్నాయి.