ఒకవైపు కోడెల కుటుంబంపై కేసుల పరంపర కొనసాగుతూ ఉన్నాయి. అనేకమంది పోలీసు అధికారులను కలుస్తూ కోడెల కుటుంబం తమను ఎలా వేధించిందో వివరించి చెబుతూ ఉన్నారు. వారి ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు అవుతూ ఉన్నాయి. ఈ కేసుల పరిష్కారానికి ప్రత్యేక సిట్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ కూడా వినిపిస్తూ ఉంది. కేసుల సంఖ్య మరింత పెరిగితే కచ్చితంగా అదే జరగవచ్చు.
ఇలా తెలుగుదేశం నేత, మాజీ స్పీకర్ కుటుంబంపై ఫిర్యాదుల పరంపర కొనసాగుతూ ఉంది. అయితే ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ మాత్రం సైలెన్స్ ను మెయింటెయిన్ చేస్తూ ఉండటం గమనార్హం. అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రస్తావనకు కూడా తీసుకురాలేదు తెలుగుదేశం వాళ్లు. కేసులతో తమవాళ్లను వేధిస్తున్నారనో, మరో మాటో అనలేదు.
అయితే ఓడిపోయిన తెలుగుదేశం నేతలు మాత్రం ఈ విషయంలో పార్టీ తరపున డీజీపీని కలిసి ఫిర్యాదు చేయాలని అనుకున్నారట. ఇవన్నీ రాజకీయ వేధింపులు అని తెలుగుదేశం వాళ్లు వాదించాలని భావించారట. అయితే పార్టీలోనే కొంతమంది ఆ విషయాన్ని వ్యతిరేకించినట్టుగా తెలుస్తోంది.
కోడెల కూతురు. కొడుకు అవినీతి వ్యవహారాలపై పార్టీ అధికారంలో ఉన్నప్పుడే అనేక ఆరోపణలు వచ్చాయని, అప్పుడు చర్యలు తీసుకోకపోగా, ఇప్పుడు ఆ విషయంలో వారిని వెనకేసుకు వస్తే పోయేది పార్టీ పరువే అని తెలుగుదేశం పార్టీలో కొంతమంది అభిప్రాయపడినట్టుగా తెలుస్తోంది. దీంతో డీజీపీని కలిసి ఫిర్యాదు చేసే అంశాన్ని పక్కన పెట్టినట్టుగా తెలుస్తోంది.
మొత్తానికి అధికారం చేతిలో ఉన్నప్పుడు తీవ్రమైన అరాచకాలకు పాల్పడి ఇప్పుడు అందుకు రియాక్షన్స్ ను ఫేస్ చేస్తున్నట్టుగా ఉన్నారు కోడెల. ఇప్పుడు పార్టీ కూడా ఆయనకు, ఆయన కూతురు, కొడుకుకూ సాయంగా వచ్చేలా లేనట్టుంది!