కరోనా కేసులు ఆంధ్ర ప్రదేశ్ ను అతలాకుతలం చేస్తున్నాయి. వెస్ట్ గోదావరి మినహా ప్రతి జిల్లాలో మూడు అంకెల స్థాయికి చేరిపోయింది. అయినా ప్రభుత్వ పరంగా నిర్ణయాలు ఇంకా ఏవీ వెలువడలేదు. జాగ్రత్త చర్యలు, వ్యాక్సీన్ వ్యవహారాల మీద సూచనలు ఆదేశాలు కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి, అంతే తప్ప ఆదేశాలు మాత్రం లేవు.
జిల్లాల కలెక్టర్లు అక్కడక్కడ ఆదేశాలు ఇస్తున్నారు. పార్కు లు, కమ్యూనిటీ హాళ్లు మూసేస్తున్నారు. అంతే తప్ప బార్ లు, సినిమా హాళ్ల సంగతి పట్టించుకోలేదు. అవన్నీ వారి కంట్రోల్ లో లేవు. అందుకే వాటి విషయంలో సైలంట్ గా వున్నారు.
కేంద్రం సిబిఎస్ఇ పరిక్షలు వాయిదా వేసింది. పక్క రాష్ట్రంలో కూడా పరిక్షలు వాయిదా వేసారు.కానీ ఆంధ్ర వరకు వచ్చేసరికి స్కూళ్ల విషయంలో, పరిక్షల విషయంలో ఏ నిర్ణయం తీసుకోలేదు.
బార్లు, థియేటర్లు అంటే వ్యాపారాలు, ఆర్థిక ప్రయోజనాలు వుంటాయి కాబట్టి, ముందు వెనుకలు ఆడతున్నారని అనుకుందాం. కానీ పిల్లల ఆరోగ్యంతో ఆటలాగే స్కూళ్లు, కాలేజీల సంగతేమిటి? ఎందుకు సిఎమ్ ఇంత తాత్సారం చేస్తున్నారు.
ఇదే సమయంలో ప్రయివేటు స్కూళ్లు చకచకా పరిక్షలు అయ్యాయి అనిపించేసి, పిల్లలను ప్రమోట్ చేసేసి, తరువాత సంవత్సరం ఫీజుల వసూలు మొదలుపెట్టేసాయి. ఆ ఫీజుల కోసం కరోనాను గాలికి వదిలేసాయి.
ఇలాంటి నేపథ్యంలో సరైన నిర్ణయం, సరైన సమయంలో తీసుకోకపోతే నష్టపోయేది జనమే. తిరుపతి ఎన్నిక ముగిసింది కాబట్టి ఇకనైనా కరోనా నిర్ణయాల మీద జగన్ దృష్టి సారించాల్సి వుంది.