Advertisement

Advertisement


Home > Politics - Gossip

కేంద్రంతో జగన్ సర్కారు లడాయి!

కేంద్రంతో జగన్ సర్కారు లడాయి!

కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వంతో.. జగన్మోహన రెడ్డి సర్కారు తగాదా పెట్టుకోడానికి సిద్ధపడుతోందా? తాము నమ్మిన మార్గాన్ని మాత్రమే అనుసరిస్తాం అని, అందుకు ఎవరు అడ్డువచ్చినా, ఎంతవారైనా పట్టించుకునేది లేదని.. జగన్ భావిస్తున్నారా? పోలవరం ప్రాజెక్టుకు టెండర్లు రద్దుచేసి, రీటెండర్లకు నోటిఫికేషన్ కూడా జారీ చేసిన నేపథ్యంలో.. అసలు ఈ జాతీయ ప్రాజెక్టుకు నిధులు మొత్తం సమకూర్చవలసిన కేంద్ర ప్రభుత్వం అభ్యంతరాలను కూడా ఖాతరు చేయకుండా జగన్ వారితో విభేదించడానికి సిద్ధంగా ఉన్నారా? అనే అభిప్రాయాలు ఇప్పుడు కలుగుతున్నాయి.

జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రాజెక్టులు, నిర్మాణాలు, కాంట్రాక్టుల మీదనే దృష్టి సారించారు. భారీగా అవినీతి చోటు చేసుకుని ఉంటుందని అనుమానిస్తున్న కాంట్రాక్టులను ఎక్కడికక్కడ నిలిపివేయించి వాటిని సమీక్షిస్తున్నారు. ఆ రకంగా గతంలో జరిగిన అవినీతిని మొత్తం తాము బయటకు తీస్తాం అని సంకేతాలు ఇస్తున్నారు. ఇంతవరకూ బాగానే ఉంది. రెండోదశలో పోలవరం ప్రాజెక్టు పనులు చేస్తున్న సంస్థల కాంట్రాక్టులను కూడా రద్దు చేసేశారు. తాజాగా రీటెండర్లు కూడా పిలిచారు.

అయితే పనులు రద్దుచేసిన నాటినుంచి ఈ విషయం చర్చనీయాంశంగానే ఉంది. దీనినవల్ల పనుల్లో అలవిమాలిన జాప్యం జరుగుతుందని, భారం కూడా బాగా పెరుగుతుందని కేంద్రం అభ్యంతరపెడుతోంది. పనులు ఎప్పటికి పూర్తవుతాయో కూడా చెప్పలేం అంటూ కేంద్రమంత్రి పార్లమెంటులోనే వ్యాఖ్యానించారు. మరోవైపు పోలవరం ప్రాజెక్టు అథారిటీ, రాష్ట్ర అధికారులతో సమావేశం నిర్వహించి.. రీటెండర్లపై వెనక్కు తగ్గాలని సూచించింది. దీనివల్ల జాప్యం తప్పదని, భారం పెరిగితే తాము పూచీ తీసుకోమని హెచ్చరించింది.

రాష్ట్ర సర్కారు పట్టించుకోలేదు. ఈలోగా పోలవరం అథారిటీ ప్రభుత్వానికి ఓ లేఖ కూడా రాసింది. రీటెండర్లు వద్దనే అందులో సూచించారు. అయినా ఖాతరు చేయకుండా రీటెండర్లకు నోటిఫికేషన్ విడుదల కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కేంద్రం స్వయంగా రంగంలోకి దిగింది. రీటెండర్ల దాకా పరిస్థితి ఎందుకు వచ్చిందో సవివరంగా చెప్పాలంటూ అథారిటీని కేంద్ర సర్కారు కోరింది. ఇన్ని అభ్యంతరాలు వస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు రీటెండర్లు పిలుస్తోందని కేంద్రం అడుగుతోంది.

వ్యవహారం సీరియస్‌గానే పరిణమిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అవినీతిని కట్టడి చేయడానికే ఈ ప్రయత్నం చేస్తున్నట్లుగా జగన్ ప్రభుత్వం నిరూపించుకోలేకపోతే గనుక.. అచ్చంగా కేంద్రప్రభుత్వంతో తగాదా పెట్టుకున్నట్లే అవుతుంది. పోలవరం ప్రాజెక్టుకు ముందుముందు ఆర్థిక ఇబ్బుందులు ఏర్పడినా కూడా ఆశ్చర్యం లేదని పలువురు భావిస్తున్నారు.

జగన్ మేనమామపై అసంతృప్తి జ్వాలలు!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?