సీఎం రిటర్స్న్.. మంత్రులు, అధికారుల్లో హడావిడి

విదేశీ పర్యటన ముగించుకుని ముఖ్యమంత్రి జగన్ తిరిగొచ్చేశారు. అయితే సీఎం రాష్ట్రంలో లేని రోజుల్లో ఇక్కడ చాలా వ్యవహారాలు జరిగాయి. వరద ముంపుపై ప్రతిపక్షం బురద రాజకీయం చేసింది, రాజధాని పేరు ప్రస్తావించి అధికార…

విదేశీ పర్యటన ముగించుకుని ముఖ్యమంత్రి జగన్ తిరిగొచ్చేశారు. అయితే సీఎం రాష్ట్రంలో లేని రోజుల్లో ఇక్కడ చాలా వ్యవహారాలు జరిగాయి. వరద ముంపుపై ప్రతిపక్షం బురద రాజకీయం చేసింది, రాజధాని పేరు ప్రస్తావించి అధికార పక్షం కాస్త ఇబ్బందుల్లో పడింది, ఈకేవైసీ పేరుతో సామాన్యులు ఇబ్బందులు పడ్డారు. స్కాలర్ షిప్ ల కోసం విద్యార్థులు రోడ్డెక్కారు.

వీటన్నిటిపై జగన్ కు ప్రాథమిక సమాచారం ఉన్నా.. విదేశీ పర్యటనలో ఉన్న ఆయనకు రాష్ట్ర సమస్యలు, రాజకీయాలపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టే అవకాశం చిక్కలేదు. తిరిగొచ్చిన ఆయన, అధికారులు, మంత్రులతో ఈ వ్యవహారాలన్నిటిపై చర్చించే అవకాశం ఉంది. అందుకే ఇటు పార్టీ నేతలు, అటు అధికారులు కాస్త హడావిడి పడుతున్నారు.

వరదల్లో సహాయక చర్యలు పూర్తిస్థాయిలో చేపట్టినా దాన్ని ప్రచారం చేసుకోవడంలో అధికార పక్షం విఫలమైంది. ఫలితంగా ప్రతిపక్షం అర్థంలేని విమర్శలతో విరుచుకుపడుతోంది. ఈ విషయంలో మంత్రులకు దిశానిర్దేశం చేయబోతున్నారట జగన్. అదే సమయంలో అమరావతి తేనెతుట్టెను అనుకోకుండా కదిపిన బొత్స కూడా జగన్ సూచన మేరకు క్లారిటీ ఇచ్చారు. తన మాటల్ని ప్రతిపక్షం వక్రీకరించారని తాజాగా వివరణ ఇచ్చారు. అదే సమయంలో మిగతా మంత్రులు కూడా రాజధాని వ్యవహారంపై కాస్త ఆలస్యంగా స్పందించారు. ఈలోగా జరగాల్సిన రచ్చ అంతా జరిగిపోయింది. ఈ విషయంపై బొత్సను ముఖ్యమంత్రి వివరణ కోరే అవకాశం ఉంది.

ఇక అధికారుల విషయానికొస్తే.. ఈకేవైసీ పేరుతో రాష్ట్రంలో లక్షలాది మంది మీ-సేవా కేంద్రాల దగ్గర పడిగాపులు కాస్తున్నారు. దీనిపై అవగాహన కల్పించడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. ఈకేవైసీ చేసుకోవాల్సినవాళ్లు ఎవరు, ఎవరికి అవసరం లేదు, ఎప్పటిలోగే చేసుకోవాలి, చేయకపోతే వచ్చే నష్టం ఏంటి అనే విషయంపై క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. ఈకేవైసీ కాకపోతే కార్డులు పీకేస్తారనే ప్రచారం జోరందుకోవడంతో.. ప్రభుత్వ పథకాలు అందవేమోననే ఆందోళనపై ప్రజలంతా మీ-సేవా కేంద్రాల దగ్గర ఇబ్బందులు పడుతున్నారు. 

అసలీ కార్యక్రమాన్ని గ్రామ వాలంటీర్లతో డెడ్ లైన్ పెట్టి నిర్వహించాలన్నది జగన్ ఆలోచన, అయితే అధికారుల అనాలోచిత చర్య వల్ల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. స్కాలర్ షిప్ ల కోసం ఆందోళన చేస్తున్న విద్యార్థులకు ప్రభుత్వం తరపున హామీ లభించకపోవడంతో వారు కూడా రోడ్లెక్కారు. సీఎం లేకపోవడంతో.. చిన్న చిన్న విషయాలపై కూడా మంత్రులు, అధికారులు నిర్ణయాలు తీసుకోలేక ఇబ్బందులు పడ్డారు. అయితే ఆ ఆలస్యమే ప్రభుత్వంపై నిందలు పడేలా చేసింది. ఇప్పుడు జగన్ రాకతో ఈ చిన్న చిన్న సమస్యలన్నీ ఓ కొలిక్కి వస్తాయి.

సినిమా రివ్యూ: కౌసల్య కృష్ణమూర్తి